అంతర్జాతీయ ఆటల దినోత్సవం
ఆటల ప్రాముఖ్యాన్ని ప్రపంచానికి తెలియజేసే లక్ష్యంతో ఏటా జూన్ 11న ‘అంతర్జాతీయ ఆటల దినోత్సవం’గా నిర్వహిస్తారు. మానవాభివృద్ధిలో ఆటలు ముఖ్య భూమిక పోషిస్తాయి. వీటిని కేవలం వినోదానికి సంబంధించిన విషయంగానే చెప్పలేం. పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదలకు ఇవి ఎంతగానో తోడ్పడతాయి. కొత్త విషయాలను నేర్చుకోవడం అలవడుతుంది. దీంతోపాటు పిల్లలు ఇతరులతో కలిసి ఆడటం వల్ల సంబంధాలను మెరుగుపరచుకోవడం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం, సవాళ్లను అధిగమించడం లాంటివి నేర్చుకుంటారు. వారి ఊహా శక్తిని - సృజనాత్మకతను వ్యక్తపరచడానికి, అభివృద్ధి చేయడానికి ఆటలు వేదికగా ఉంటాయి. తల్లిదండ్రులు శారీరక శ్రమ, ఆలోచనా శక్తిని పెంపొందించే ఆటలు ఆడేలా తమ పిల్లలను ప్రోత్సహించేలా చేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం: 1989లో ఐరాస జనరల్ అసెంబ్లీ ఆటలు ఆడటాన్ని పిల్లల ప్రాథమిక హక్కుగా పేర్కొంది. అయితే ప్రస్తుతం ఆటలు ఆడేవారి సంఖ్య బాగా పడిపోయింది. 2023లో డెన్మార్క్‌కు చెందిన ఎల్‌ఈజీఓ ఫౌండేషన్, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్), వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సంయుక్తంగా 36 దేశాల్లోని 25 వేలకు పైగా చిన్నారులపై సర్వే నిర్వహించాయి. దీని ప్రకారం, 73% పిల్లలు ఆటలకు దూరంగా ఉన్నారు. కేవలం 30% తల్లిదండ్రులు మాత్రమే తమ పిల్లలు ఆడుకునేలా ప్రోత్సహిస్తున్నారని తేలింది. ఎల్‌ఈజీఓ, యునిసెఫ్ తమ నివేదికను ఐరాసకు అందించి ఆటల ప్రాముఖ్యం పెరిగేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించాయి. 2024, మార్చి 25న సమావేశమైన ఐరాస జనరల్ అసెంబ్లీ పిల్లల జీవితాల్లో ఆటల ప్రాముఖ్యాన్ని చాటేలా ఏటా జూన్ 11న అంతర్జాతీయ ఆటల దినోత్సవాన్ని జరపాలని తీర్మానించింది. దీనికి 140 దేశాల ఆమోదం కూడా లభించింది. 2024 నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు. 2025 నినాదం: "Choose play - every day".