మానవ హక్కుల దినోత్సవం
జాతి, కులం, లింగం లేదా మరే ఇతర హోదాతో సంబంధం లేకుండా మానవులందరికీ స్వేచ్ఛ, సమానత్వం, భావప్రకటన లాంటి మౌలిక హక్కులు ఉంటాయి. పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి సమాజంలో ఒక సభ్యుడిగా అనుభవించే కనీస హక్కులనే ‘మానవ హక్కులు’ అంటారు. వీటి పరిరక్షణకు ఆయా దేశాలు చట్టబద్ధత కల్పించాయి. ప్రజలందరికీ తమ హక్కులపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా డిసెంబరు 10న ‘మానవ హక్కుల దినోత్సవం’గా (Human Rights Day) నిర్వహిస్తారు. హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి తెలియజేయడం, వాటి రక్షణ కోసం పోరాడుతున్న వ్యక్తులు - సంస్థలను గౌరవించుకోవడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రపంచవ్యాప్తంగా మానవులపై అనేక దురాగతాలు చోటుచేసుకున్నాయి, తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. మనుషులపై జరిగే దారుణాలను నిరోధించి, వారి గౌరవాన్ని కాపాడే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1948, డిసెంబరు 10న విశ్వమానవ హక్కుల ప్రకటనను ఆమోదించింది. దీనికి గుర్తుగా ఏటా డిసెంబరు 10న ‘మానవ హక్కుల దినోత్సవం’గా జరుపుకోవాలని 1950లో ఐరాస జనరల్ అసెంబ్లీ తీర్మానించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు. వివక్ష, అసమానతలు, అణచివేత లాంటి వాటికి వ్యతిరేకంగా మానవ హక్కులకు సంబంధించి కొనసాగుతున్న పోరాటాల గురించి అవగాహన కల్పించడం లాంటివి ఈ రోజు చేస్తారు. 2025 నినాదం: Human Rights, Our Everyday Essentials