Posts

Current Affairs

జాతీయ పరిశోధనా సంస్థగా సీటీఆర్‌ఐ

పొగాకుపై అనేక పరిశోధనలు చేస్తున్న రాజమహేంద్రవరంలోని కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ (ఐకార్‌-సీటీఆర్‌ఐ) ఐకార్‌ జాతీయ వాణిజ్య, వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఎన్‌ఐఆర్‌సీఏ-నిర్కా)గా మారింది. పొగాకుతోపాటు వాణిజ్య పంటలైన మిరప, పసుపు, అశ్వగంధ, ఆముదంపై పరిశోధనలు చేయనుంది. ఆ పంటల విలువ ఆధారిత ఉత్పత్తులను అంతర్జాతీయ విపణిలోకి పంపించడం, సాంకేతికత అభివృద్ధిలో పెట్టుబడులు పెంచడమే లక్ష్యంగా సేవలు అందించనుంది. 1947లో రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రంగా సీటీఆర్‌ఐ ఏర్పాటైంది. 

Current Affairs

అక్సెల్సెన్, సియంగ్‌కు టైటిళ్లు

ఇండియా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో విక్టర్‌ అక్సెల్సెన్‌ (డెన్మార్క్‌), ఆన్‌ సియంగ్‌ (దక్షిణ కొరియా) టైటిళ్లు సాధించారు. 2025, జనవరి 19న జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో మూడో సీడ్‌ అక్సెల్సెన్‌ 21-16, 21-8తో లీ చుక్‌ (హాంకాంగ్‌)పై నెగ్గి విజేతగా నిలిచాడు. 2017, 2019లలో టైటిళ్లు గెలిచిన అక్సెల్సెన్‌ ఈ టోర్నీలో ఛాంపియన్‌గా నిలవడం ఇది మూడోసారి.  మహిళల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ సియంగ్‌ 21-12, 21-9తో పోర్న్‌పావీ చోచువాంగ్‌ (థాయ్‌లాండ్‌)పై గెలుపొందింది. 

Current Affairs

ఖోఖో ప్రపంచకప్‌

మొట్టమొదటి ఖోఖో ప్రపంచకప్‌లో భారత్‌ పురుషులు, మహిళల విభాగాల్లో విజేతగా నిలిచింది. 2025, జనవరి 19న జరిగిన మహిళల ఫైనల్లో భారత్‌ 78-40తో నేపాల్‌ను ఓడించింది. పురుషుల తుదిపోరులో భారత్‌ 54-36తో నేపాల్‌పై విజయం సాధించింది. 

Current Affairs

ఎస్టీ టెలీమీడియా గ్లోబల్‌ డేటా సెంటర్‌

తెలంగాణలో రూ.3,500 కోట్ల పెట్టుబడులకు ఎస్టీ టెలీమీడియా గ్లోబల్‌ డేటా సెంటర్‌ ముందుకు వచ్చింది. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల సమీపంలోని మీర్‌ఖాన్‌పేటలో  అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ క్యాంపస్‌ను స్థాపించేందుకు ఈ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, ఎస్టీటీ గ్రూప్‌ సీఈవో బ్రూనో లోపెజ్‌ జనవరి 18న ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రస్తుతం ఈ కంపెనీ హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో డేటా సెంటర్‌ను నిర్వహిస్తోంది. కొత్త క్యాంపస్‌ ఏర్పాటుతో కంపెనీ... కార్యకలాపాలను విస్తరించనుంది. 

Current Affairs

2024-25లో వృద్ధి రేటు 6.8%

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25) దేశ జీడీపీ 6.8% వృద్ధిని నమోదు చేయొచ్చని పీహెచ్‌డీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2025-26) వృద్ధిరేటు 7.7 శాతంగా నమోదు కావచ్చని పేర్కొంది. దీంతో 2026 నాటికి జపాన్‌ను అధిగమించి, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తుందని వెల్లడించింది.

Current Affairs

ఎంఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్‌ అధ్యయనం

చిరుధాన్యాలకు దక్షిణ భారత రాష్ట్రాలు చిరునామాగా మారుతున్నాయని ఎంఎస్‌ స్వామినాథన్‌ పరిశోధన సంస్థ (ఎంఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్‌) అధ్యయనం వెల్లడించింది. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలలో వాటి సాగు భారీగా పెరుగుతోందని, వినియోగం విస్తరిస్తోందని పేర్కొంది. తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో సంస్థ అధ్యయనం నిర్వహించి ‘‘చిరుధాన్యాల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం.. దక్షిణ భారత అధ్యయనం నుంచి పాఠాలు’ పేరిట తాజాగా నివేదికను విడుదల చేసింది. 2023 అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. తమిళనాడులోని నామక్కల్‌ జిల్లాలోని కె.హిల్స్‌ బ్లాక్‌ కేంద్రంలో అధ్యయనాంశాలను వెల్లడించింది.  నివేదికలోని అంశాలు: దేశంలో మొత్తం ఆహారధాన్యాలు 200 మిలియన్‌ టన్నులు కాగా.. అందులో చిరుధాన్యాల ఉత్పత్తి 20 మిలియన్‌ టన్నుల కంటే తక్కువగా ఉంది. దేశంలో చిరుధాన్యాలకు ప్రస్తుత నికర రాబడి హెక్టారుకు దాదాపు రూ.10,000 మాత్రమే. 2011-15 సంవత్సరాలలో వరికి వెచ్చించిన ఖర్చు కంటే వచ్చిన ఆదాయం 224 శాతం, గోధుమలకు 304 శాతం కాగా చిరుధాన్యాలకు 100 శాతమే ఉంది. 

Current Affairs

ట్రాక్షన్‌ నివేదిక

ఫిన్‌టెక్‌ రంగంలో వచ్చిన నిధుల విషయంలో అంతర్జాతీయంగా భారత్‌కు మూడో ర్యాంకు దక్కింది. 2023తో పోలిస్తే 2024లో 33 శాతం మేర నిధుల రాక తగ్గినా కూడా ఈ స్థానం దక్కించుకుంది. ట్రాక్షన్‌ అనే మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ఆ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. అంతర్జాతీయంగా భౌగోళికరాజకీయ అనిశ్చితులుండడంతో మొత్తం మీద గిరాకీ తగ్గడంతో ఈ రంగానికీ నిధుల రాక క్షీణించిందని అందులో పేర్కొంది.  నివేదికలోని ముఖ్యాంశాలు: 2024లో ఫిన్‌టెక్‌ రంగం 1.9 బిలియన్‌ డాలర్ల మేర సమీకరించింది. 2023లో వచ్చిన 2.8 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఇవి 33 శాతం తక్కువ. అయినప్పటికీ.. నిధుల సమీకరణ విషయంలో ఈ రంగం అమెరికా, బ్రిటన్‌ తర్వాతి స్థానంలో నిలిచింది.  2022లో భారత ఫిన్‌టెక్‌ రంగం 5.6 బి. డాలర్లను సమీకరించింది. 

Current Affairs

ది ఇంటర్నెట్‌ ఇన్‌ ఇండియా రిపోర్ట్‌ 2024

2025లో మన దేశంలో ఇంటర్నెట్‌ వినియోగించే వారి సంఖ్య 90 కోట్లను అధిగమించనున్నట్లు ‘ది ఇంటర్నెట్‌ ఇన్‌ ఇండియా రిపోర్ట్‌ 2024’ నివేదిక వెల్లడించింది. డిజిటల్‌ కంటెంట్‌ కోసం ప్రాంతీయ భాషల వినియోగం పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐఏఎంఏఐ), కాంటార్‌ సంయుక్తంగా ఈ నివేదికను తయారు చేశాయి.  నివేదికలోని అంశాలు: 2023తో పోలిస్తే 2024లో క్రియాశీల ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య 8 శాతం పెరిగి 88.6 కోట్లుగా ఉంది. గ్రామీణ భారత్‌లో 48.8 కోట్ల మంది ఇంటర్నెట్‌ వినియోగదారులు ఉన్నారు. మొత్తం ఇంటర్నెట్‌ జనాభాలో గ్రామీణ వాటా 55 శాతంగా ఉంది.  దేశంలో ఇంటర్నెట్‌ వినియోగ ధోరణుల్లో ప్రాంతీయ భాషల కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారత భాషల్లోని కంటెంట్‌ను 98 శాతం మంది ఇంటర్నెట్‌ వినియోగదారులు వాడుతున్నారు. తమిళం, తెలుగు, మళయాళం ఇందులో ముందున్నాయి. ఈ భాషల్లో కంటెంట్‌ అధికంగా లభించడం ఇందుకు తోడ్పడుతోంది.

Current Affairs

ద్రవ ఇంజిన్‌ రీస్టార్ట్‌ ప్రక్రియ విజయవంతం

అంతరిక్ష వాహకనౌకల్లో వినియోగించే ద్రవ (లిక్విడ్‌) ఇంజిన్‌ల రీస్టార్ట్‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసినట్లు ఇస్రో 2025, జనవరి 18న ప్రకటించింది. తమిళనాడు మహేంద్రగిరిలోని ప్రొపల్షన్‌ కాంప్లెక్స్‌లో వికాస్‌ లిక్విడ్‌ ఇంజిన్‌ రీస్టార్ట్‌ ప్రక్రియను పరీక్షించినట్లు వెల్లడించింది.  ఈ ఇంజిన్‌ను తొలుత 60 సెకన్ల పాటు మండించి నిలిపివేశారు. 120 సెకన్ల తర్వాత మళ్లీ ప్రారంభించగా 7 సెకన్ల పాటు ఇంజిన్‌ మండినట్లు ఇస్రో పేర్కొంది. అన్ని దశల్లోనూ ఇంజిన్‌ పనితీరు మెరుగ్గా ఉందని తెలిపింది. 

Current Affairs

కర్ణాటకదే విజయ్‌ హజారే

విజయ్‌హజారే వన్డే టోర్నమెంట్లో కర్ణాటక విజేతగా నిలిచింది. మయాంక్‌ అగర్వాల్‌ సారథ్యంలోని జట్ట్టు 2025, జనవరి 18న జరిగిన ఫైనల్లో 36 పరుగుల తేడాతో విదర్భను ఓడించింది. మొదట కర్ణాటక 6 వికెట్లకు 348 పరుగులు చేసింది. ఛేదనలో విదర్భ పోరాడినా.. 48.2 ఓవర్లలో 312 పరుగులకే ఆలౌటైంది.  విజయ్‌హజారే ట్రోఫీ గెలవడం కర్ణాటకకు ఇది అయిదోసారి. ఆ జట్టు చివరగా 2019-20 సీజన్లో ఈ టోర్నీ విజేతగా నిలిచింది.