Posts

Current Affairs

ఒకే దేశం.. ఒకే సమయం

దేశవ్యాప్తంగా ఒకే సమయాన్ని ప్రామాణీకరించే చర్యలో భాగంగా ఇక అన్ని రంగాల్లో భారత ప్రామాణిక సమయం (ఐఎస్‌టీ) వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం 2025, జనవరి 26న ముసాయిదా నిబంధనలు రూపొందించింది. వీటిపై ఫిబ్రవరి 14లోపు ప్రజలు తమ అభిప్రాయాలను తెలపాల్సి ఉంటుంది.  ఇందుకోసం తూనికలు కొలతలు (భారత ప్రామాణిక సమయం) నిబంధనలు, 2024లో చట్టపరమైన విధివిధానాలు ఏర్పాటు చేశారు. ఇవి అమల్లోకి వస్తే.. చట్ట, పాలన, వాణిజ్య, ఆర్థికరంగాలతో పాటు అధికారిక పత్రాల్లోనూ ఇక ఐఎస్‌టీ తప్పనిసరి. 

Current Affairs

నాలుగు ప్రభుత్వ పథకాలకు శ్రీకారం

తెలంగాణ ప్రభుత్వం 2025, జనవరి 26న రాష్ట్రంలోని 606 గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, నూతన రేషన్‌ కార్డుల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించింది. 2025లో రైతుభరోసా కింద ప్రతి ఎకరాకు రూ.12 వేలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రెండు విడతలుగా రూ.12 వేలు ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏడాదికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తామని, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది.

Current Affairs

రక్షణ రంగ ఎగుమతులు

2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ రూ.21,000 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. 2022-23తో పోల్చితే ఇది 32.5% అధికం. మనదేశ రక్షణ ఎగుమతుల్లో దాదాపు 75% ప్రభుత్వ రంగ సంస్థల వాటా కాగా, మిగిలినవి ప్రైవేటు కంపెనీలు చేస్తున్నాయి. 2029కి రూ.50,000 కోట్ల విలువైన రక్షణ పరికరాలు ఎగుమతి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. మన దేశంలో దాదాపు 16 ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలు, 430కి పైగా ప్రైవేటు రంగ కంపెనీలు, 16,000 ఎంఎస్‌ఎంఈలు (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు) రక్షణ ఉత్పత్తుల విభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఏం ఎగుమతి చేస్తున్నాం: బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు, హెల్మెట్స్, డోర్నియర్‌(డీఓ- 228) ఎయిర్‌ క్రాఫ్ట్, చేతక్‌ హెలికాప్టర్లు, ఇంటర్‌సెప్టర్‌ బోట్లు, తేలికపాటి టోర్పెడోలు, బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ మిస్సైల్స్, ఆర్టిలరీ గన్స్, రాడార్లు, ఆకాశ్‌ మిస్సైల్స్, పినాకా రాకెట్స్, ఆర్మర్డ్‌ వాహనాలు, యుద్ధ విమానాల విడిభాగాలు అధికంగా ఎగుమతి అవుతున్నాయి. 

Current Affairs

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

ఇటలీకి చెందిన టాప్‌ సీడ్‌ సినర్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో టైటిల్‌ నెగ్గాడు. 2025, జనవరి 26న మెల్‌బోర్న్‌లో జరిగిన ఫైనల్లో అతడు 6-3, 7-6 (4), 6-3తో వరుస సెట్లలో రెండో సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)ను ఓడించాడు. జిమ్‌ కొరియర్‌ (1992-93) తర్వాత మెల్‌బోర్న్‌ పార్క్‌లో వరుసగా రెండు సంవత్సరాలు విజేతగా నిలిచిన పిన్నవయస్కుడిగా 23 ఏళ్ల సినర్‌ ఘనత సాధించాడు. 

Current Affairs

డాక్టర్‌ అనురాధ ఉప్పలూరి

బ్రిటన్‌లోని బర్మింగ్‌హమ్‌లో స్థిరపడిన ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన డాక్టర్‌ అనురాధ ఉప్పలూరికి ప్రతిష్ఠాత్మక బ్రిటిష్‌ సిటిజన్‌ అవార్డు లభించింది. వెస్ట్‌మినిస్టర్‌ ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ప్రతి సంవత్సరం బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రకటించే పీపుల్స్‌ ఆనర్స్‌ అవార్డుల్లో భాగంగా సమాజాభివృద్ధికి కృషి చేసిన వ్యక్తులకు దీన్ని ప్రదానం చేస్తారు.  ఆటిజం గురించి అవగాహన పెంపొందించడం, ఆ రంగంలో పనిచేసే సంస్థలకు నిధులు సేకరించడం తరహా సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు అనురాధకు ఈ గౌరవం దక్కింది. ఇప్పటి వరకు ఆమె రూ.30 వేల పౌండ్లను సేకరించి, అనేక సంస్థలకు అందించారు. 

Current Affairs

లక్ష్మీకాంతం బాలయ్యనాయుడు

ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్‌ అధికారి లక్ష్మీకాంతం బాలయ్యనాయుడు ప్రతిష్ఠాత్మకమైన ఈఐసీబీఐ (యూరప్‌ ఇండియా సెంటర్‌ ఫర్‌ బిజినెస్‌ అండ్‌ ఇండస్ట్రీ)లో ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ అండ్‌ బిజినెస్‌ అలియన్సెస్‌కు వైస్‌ ఛైర్‌గా నియమితులయ్యారు. ఈఐసీబీఐని 2011లో ఏర్పాటు చేశారు. దీనికి యూరోపియన్‌ కమిషన్‌ రిజిస్ట్రేషన్, యూరోపియన్‌ పార్లమెంటు నుంచి జియోపొలిటికల్‌ ఫోరమ్‌ అక్రిడిషన్‌ ఉన్నాయి. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు.

Current Affairs

వైట్‌హౌస్‌ డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీగా కుష్‌ దేశాయ్‌

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత సంతతికి చెందిన కుష్‌ దేశాయ్‌ను వైట్‌హౌస్‌ డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దేశాయ్‌ 2024లో రిపబ్లికన్‌ పార్టీ నేషనల్‌ కన్వెన్షన్‌కు డిప్యూటీ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌గా, అయోవా రాష్ట్రంలో పార్టీ కమ్యూనికేషన్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఎన్నికల ప్రచారంలో పెన్సిల్వేనియా వంటి కీలక రాష్ట్రాల్లో ట్రంప్‌ అనుకూల పవనాలు వీచేలా కృషి చేశారు.

Current Affairs

అమెరికా రక్షణ మంత్రిగా పీట్‌ హెగ్సే

అమెరికా రక్షణశాఖ మంత్రిగా పీట్‌ హెగ్సే (44)ను సెనేట్‌ ధ్రువీకరించింది. 100 మంది సభ్యులున్న సెనెట్‌లో హెగ్సేకు అనుకూలంగా 50, వ్యతిరేకంగా 50 ఓట్లు వచ్చాయి. దీంతో ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్‌ తనకున్న ఓటుహక్కును వినియోగించి పీట్‌ హెగ్సేకు అనుకూలంగా ఓటు వేశారు.  ఉపాధ్యక్షుడు ఇలా ఓటు వేయడం ఇది రెండోసారి. 2017లో అప్పటి ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్‌ ఇలా ఓటువేశారు.

Current Affairs

అదనపు న్యాయమూర్తులుగా నలుగురి ప్రమాణం

తెలంగాణ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన రేణుకా యారా, నందికొండ నర్సింగ్‌రావు, ఇ.తిరుమలాదేవి, బి.ఆర్‌.మధుసూదన్‌రావులు 2025, జనవరి 25న ప్రమాణం చేశారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజయ్‌పాల్‌ వారితో ప్రమాణం చేయించారు.

Current Affairs

శౌర్య పురస్కారాలు

సాయుధ దళాల్లో పనిచేస్తున్న 93 మందికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా శౌర్య పురస్కారాల అందజేతకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2025, జనవరి 25న ఆమోదముద్ర వేశారు. ఇందులో ఇద్దరికి కీర్తిచక్ర, 14 మందికి శౌర్యచక్ర అవార్డులు ఉన్నాయి. దేశంలో రెండో అత్యున్నత శౌర్య పురస్కారమైన కీర్తిచక్రను మేజర్‌ మన్‌జీత్, నాయక్‌ దిలావర్‌ ఖాన్‌ (మరణానంతరం)లకు అందజేయనున్నారు. శౌర్యచక్ర అవార్డులకు ఎంపికైన 14 మందిలో ముగ్గురికి మరణానంతరం ఈ గౌరవం దక్కనుంది. వీటితోపాటు రక్షణ సిబ్బందికి 305 గౌరవ మెడల్స్‌ను రాష్ట్రపతి ఆమోదించారు.