బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రైల్వే
బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రాజెక్టులకు రూ.9,417 కోట్లు కేటాయించినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ 2025, ఫిబ్రవరి 3న వెల్లడించారు. 2009-14 మధ్యకాలంలో నాటి యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చేసిన సగటు వార్షిక కేటాయింపు రూ.886 కోట్లతో పోలిస్తే, ఇది 11 రెట్లు అధికమని తెలిపారు. ప్రస్తుతం ఏపీలో రూ.80,097 కోట్ల నిధులతో 43 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. మొత్తం 5,560 కిలోమీటర్ల పొడవున పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టులకు రూ.84,559 కోట్లు వెచ్చించబోతున్నట్లు అశ్వనీ వైష్ణవ్ పేర్కొన్నారు. 73 రైల్వే స్టేషన్లను పూర్తిస్థాయిలో నవీకరించడానికి రూ.2,051 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. 2014 నుంచి ఏపీలో 1,949 కి.మీ. మేర లైన్లను విద్యుదీకరణ చేసి, 100 శాతం పూర్తిచేసినట్లు తెలిపారు. పదేళ్లలో రాష్ట్రంలో 1,560 కి.మీ. మేర కొత్త రైల్వే ట్రాక్ నిర్మించారు. ఇది శ్రీలంకలో ఉన్న మొత్తం రైల్వే నెట్‌వర్క్ కంటే ఎక్కువ.