Posts

Current Affairs

లిథువేనియా కొత్త ప్రధాని

లిథువేనియా నూతన ప్రధానమంత్రిగా ఇంగా రుగినియెనె (44) ఎన్నికయ్యారు. సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ నాయకురాలిగా ఆమె సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారు. 2025, ఆగస్టు 26న జరిగిన ఎన్నికలో మాజీ కార్మిక నాయకురాలు, కొత్తగా రాజకీయాల్లోకి ప్రవేశించిన రుగినియెనెను లిథువేనియా పార్లమెంటు ప్రధానమంత్రిగా ఎన్నుకుంది. ఈ ఎన్నికలో ఆమెకు 78 ఓట్లు పోలవగా ఆమె ప్రత్యర్థికి 35 ఓట్లు వచ్చాయి. గత సంవత్సరం సాధారణ ఎన్నికలకు ముందు ఆమె సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీలో చేరారు.

Current Affairs

ఐఏడీడబ్ల్యూఎస్‌

భారత గగనతలానికి దుర్భేద్య కవచాన్ని ఏర్పాటు చేసే దిశగా చేపట్టిన తొలి సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ (ఐఏడీడబ్ల్యూఎస్‌) పరీక్ష విజయవంతమైంది. 2025, ఆగస్టు 24న ఒడిశా తీరానికి చేరువలో ఇది జరిగినట్లు రక్షణశాఖ తెలిపింది. ఏఐడీడబ్ల్యూఎస్‌ అనేది శత్రు క్షిపణులు, యుద్ధవిమానాలు, డ్రోన్ల నుంచి రక్షణ కల్పించే బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థ. ఇందులో మూడు భిన్న ఆయుధాలు ఉన్నాయి.   1. ఉపరితలం నుంచి గగనతలంలోకి వేగంగా దూసుకెళ్లే క్షిపణి (క్యూఆర్‌శామ్‌) 2. స్వల్పశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ (వీఎస్‌హెచ్‌ఓఆర్‌ఏడీఎస్‌) 3. లేజర్‌ ఆధారిత డైరెక్టెడ్‌ ఎనర్జీ ఆయుధ (డీఈడబ్ల్యూ) వ్యవస్థ

Current Affairs

‘సమగ్ర మాడ్యులర్‌ సర్వే విద్య-2025’

పిల్లల చదువుల కోసం జాతీయ సగటు కంటే ఆంధ్రప్రదేశ్‌లో తల్లిదండ్రులు అత్యధికంగా ఖర్చుచేస్తున్నట్లు ‘సమగ్ర మాడ్యులర్‌ సర్వే విద్య-2025’ నివేదిక వెల్లడించింది. దక్షిణాదిలో తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక తర్వాత ఏపీలో పాఠశాల విద్యకు సగటున చేస్తున్న వ్యయం అధికంగా ఉన్నట్లు ఇది తెలిపింది. పూర్వ ప్రాథమిక విద్య(ఎల్‌కేజీ) నుంచి ఇంటర్మీడియట్‌ వరకు అన్ని స్థాయిల్లో కలిపి ఒక్కో విద్యార్థిపై రాష్ట్రంలో ఏటా రూ.18,479 ఖర్చు చేస్తుండగా.. ఇది జాతీయ స్థాయిలో రూ.12,616గా ఉంది. ఇదే వ్యయం తమిళనాడులో రూ.21,526, తెలంగాణలో రూ.20,590, కర్ణాటకలో రూ.18,756 చొప్పున ఉంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ 2025 ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఈ సర్వేను దేశవ్యాప్తంగా నిర్వహించింది. ఏపీలో గ్రామాలు, పట్టణాల్లో కలిపి 1,828 కుటుంబాలు, 6,516 మందిని సర్వే చేసి వివరాలు సేకరించింది.

Current Affairs

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎన్టీఆర్‌ జిల్లా మైలవరంలోని లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగాధిపతి డాక్టర్‌ మెండా దేవానంద్‌కుమార్‌ ఎంపికయ్యారు. 2025, ఆగస్టు 26న కేంద్రం ఈ ప్రకటన చేసింది. గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబరు 5న దిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతులమీదుగా ఆయన అవార్డు అందుకోనున్నారు. 2021 నుంచి మైలవరం కళాశాలలో పనిచేస్తున్న ఆయన వినూత్న కార్యక్రమాలకు పేరొందారు.   2024లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. 

Current Affairs

దేశ రక్షణకు హిమ, ఉదయగిరి

స్వీయ సాంకేతికతతో తయారు చేసిన నీలగిరి శ్రేణి నౌకలైన ఐఎన్‌ఎస్‌ హిమగిరి, ఐఎన్‌ఎస్‌ ఉదయగిరిలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ 2025, ఆగస్టు 26న జాతికి అంకితం చేశారు. తూర్పు నౌకాదళ ముఖ్య కేంద్రమైన విశాఖపట్నంలోని డాక్‌యార్డులో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇండో-పసిఫిక్, చైనా ప్రాంత సరిహద్దుల్లో చేపడుతున్న వ్యూహాత్మక రక్షణ ప్రాజెక్టు పనుల్లో భాగంగా పీ-17 పేరిట స్వీయ సాంకేతికత, ఆధునిక కమ్యూనికేషన్‌ వ్యవస్థలతో కోల్‌కతా, ముంబయిలలో ఈ యుద్ధ నౌకలను భారత రక్షణ వ్యవస్థ నిర్మించింది.

Current Affairs

ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌

ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో సిఫ్ట్‌ కౌర్‌ రెండు స్వర్ణాలు గెలిచింది. 2025, ఆగస్టు 26న షిమ్‌కెంట్‌ (కజకిస్థాన్‌)లో జరిగిన మహిళల వ్యక్తిగత 50మీ రైఫిల్‌ 3 పొజిషన్స్‌లో స్వర్ణం గెలిచిన ఆమె.. భారత్‌ జట్టు స్వర్ణం గెలవడంలోనూ కీలక పాత్ర పోషించింది. కౌర్‌.. వ్యక్తిగత ఫైనల్లో 459.2 పాయింట్లు స్కోర్‌ చేసి విజేతగా నిలిచింది. చైనాకు చెందిన యాంగ్‌ యుజీ (458.8) రజతం నెగ్గగా.. జపాన్‌ అమ్మాయి నోబతా మిసాకి (448.2) కాంస్యం చేజిక్కించుకుంది.  ఇదే విభాగం టీమ్‌ ఈవెంట్లో సిఫ్ట్, అంజుమ్‌ మౌద్గిల్, ఆశి చౌస్కీలతో కూడిన జట్టు టైటిల్‌ గెలుచుకుంది. ఈ త్రయం 1753 పాయింట్లు స్కోర్‌ చేసింది. జపాన్‌ (1750) రజతం, దక్షిణ కొరియా (1745) కాంస్యం గెలిచాయి. 

Current Affairs

కామన్వెల్త్‌ వెయిట్‌లిఫ్టింగ్‌

కామన్వెల్త్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ లిఫ్టర్‌ కోయెల్‌ బార్‌ యూత్‌ విభాగంలో రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పుతూ ఛాంపియన్‌గా నిలిచింది. 2025 ఆగస్టు 26న అహ్మదాబాద్‌లో జరిగిన 53 కేజీల విభాగంలో కోయెల్‌ స్నాచ్‌లో 85 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 107 కేజీలు.. మొత్తంగా 192 కేజీలతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో యూత్‌ విభాగంలో స్నాచ్, ఓవరాల్‌ బరువుల్లో ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టింది. జూనియర్, యూత్‌ విభాగాలు రెంటికీ ఈ ప్రదర్శనను పరిగణించడంతో ఆమెకు రెండు పసిడి పతకాలు దక్కాయి. 

Government Jobs

పీజీసీఐఎల్‌లో ఫీల్డ్ ఇంజినీర్ పోస్టులు

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన ఫీల్డ్‌ ఇంజినీర్‌, ఫిల్డ్‌ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 1,543 వివరాలు:  ఫీల్డ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 532 ఫీల్డ్ ఇంజినీర్ (సివిల్): 198 ఫీల్డ్ సూపర్వైజర్ (ఎలక్ట్రికల్): 535 ఫీల్డ్ సూపర్వైజర్ (సివిల్): 193 ఫీల్డ్ సూపర్వైజర్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్): 85 అర్హత: కనీసం 55% మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌  ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.  పే స్కేల్: నెలకు ఫీల్డ్‌ ఇంజినీర్‌కు రూ.30,000 నుంచి రూ.1,20,000; ఫీల్డ్‌ సూపర్వైజర్‌కు రూ.23,000- రూ.1,05,000. వయోపరిమితి: 17.09.2025 నాటికి 29 ఏళ్లు మించకూడదు.  ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.  పరీక్ష విధానం: టెక్నికల్‌ నాలెడ్జ్‌ 50 ప్రశ్నలు, ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ 25 ప్రశ్నలు (ఇంగ్లిష్‌, రీజనింగ్‌, ఆప్టిట్యూడ్‌, జనరల్‌ నాలెడ్జ్‌), ఫీల్డ్‌ ఇంజినీరింగ్‌కు మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది. పరీక్ష కేంద్రాలు: దిల్లీ, భోపాల్‌, కోల్‌కతా, బెంగళూరు, గువాహటి, ముంబయి. దరఖాస్తు రుసుము: ఫీల్డ్‌ ఇంజినీర్‌కు రూ.400. ఫీల్డ్ సూపర్వైజర్‌కు రూ.300.ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.  ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 17-09-2025. Website:https://www.powergrid.in/job-opportunities

Government Jobs

ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో గ్రేడ్ ఏ, బి, సి పోస్టులు

ఆయిల్‌ ఇండియా లిమిటెడ్.. అస్సాం రాష్ట్రం దులియంజన్‌లో వివిధ విభాగాల్లో గ్రేడ్‌ ఏ, బి, సి పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నియామాక ప్రకటన ద్వారా ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, అకౌంట్స్‌, ఐటీ తదితర పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల సంఖ్య: 102 వివరాలు:  సూపరింటెండింగ్ ఇంజినీర్ (గ్రేడ్ C)- 03  సీనియర్ ఆఫీసర్ (గ్రేడ్ B)- 97  కాన్ఫిడెన్షియల్ సెక్రటరీ (గ్రేడ్ A)- 01  హిందీ ఆఫీసర్ (గ్రేడ్ A)- 01  విభాగాలు: ప్రొడక్షన్‌, ఆఫిషియల్ లాంగ్వేజ్, కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, పెట్రోలియం, మెకానికల్, ఐటీ, ఫైర్ & సేఫ్టీ, పబ్లిక్ అఫైర్స్, హెచ్‌ఆర్, లీగల్, జియాలజీ, జియోఫిజిక్స్, హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్‌మెంట్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, అకౌంట్స్ & ఆడిట్, కంపెనీ సెక్రటరీ, సెక్యూరిటీ మొదలైనవి. అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌/ పీజీ, ఎంబీఏ/ పీజీడీఎం, సీఏ/ ఐసీడబ్ల్యూఏ/సీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు గ్రేడ్‌ సి పోస్టుకు రూ.80,000- రూ.2,20,000; గ్రేడ్‌ బి పోస్టుకు రూ.60,000- రూ.1,80,000; గ్రేడ్‌ ఏ కు రూ.50,000- రూ.1,60,000. ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు ఫీజు: రూ.500 +జీఎస్‌టీ (ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఈడబ్ల్యూఎస్‌/ఎక్స్-సర్వీస్‌మెన్ ఫీజులో మినహాయింపు ఉంటుంది). దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 26/09/2025. తాత్కాలిక పరీక్ష తేదీ: 01.11.2025. Website:https://www.oil-india.com/careeroil

Government Jobs

ఎన్‌హెచ్‌పీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులు

హరియాణాలోని నేషనల్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌పీసీ) జూనియర్‌ ఇంజినీర్‌ (నాన్‌-ఎగ్జిక్యూటివ్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  మొత్తం పోస్టుల సంఖ్య: 248 వివరాలు: అసిస్టెంట్‌ రాజ్‌భాషా ఆఫీసర్‌ (E1 గ్రేడ్‌)- 11 పోస్టులు జూనియర్‌ ఇంజినీర్‌ (సివిల్‌l)- 109 పోస్టులు జూనియర్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌)- 46 పోస్టులు జూనియర్‌ ఇంజినీర్‌ (మెకానికల్‌)- 49 పోస్టులు జూనియర్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌)- 17 పోస్టులు సూపర్‌వైజర్‌ (ఐటీ)- 01 పోస్ట్ సీనియర్‌ అకౌంటెంట్‌- 10 పోస్టులు హిందీ ట్రాన్స్‌లేటర్‌- 05 పోస్టులు అర్హతలు: 60 శాతం మార్కులతో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయోసడలింపు వర్తిస్తుంది.  జూనియర్‌ ఇంజినీర్‌ / సూపర్‌వైజర్‌ / సీనియర్‌ అకౌంటెంట్‌కు రూ.రూ.29,600- రూ.1,19,500; హిందీ ట్రాన్స్‌లేటర్‌కు రూ.27,000- రూ.1,05,000, అసిస్టెంట్‌ రాజ్‌భాషా ఆఫీసర్‌ కు రూ.40,000- రూ.1,40,000;  ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష ఆధారంగా. అప్లికేషన్ ఫీజు: రూ.708 ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: 02-09-2025 దరఖాస్తు చివరి తేదీ: 01-10-2025  Website:https://www.nhpcindia.com/