Posts

Current Affairs

కామన్వెల్త్‌ ఛాంపియన్‌షిప్స్‌

భారత అగ్రశ్రేణి వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను రికార్డు బద్దలు కొడుతూ కామన్వెల్త్‌ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం గెలుచుకుంది. 2025, ఆగస్టు 25న జరిగిన మహిళల 48కేజీ విభాగంలో 193 కిలోలు ఎత్తి విజేతగా నిలిచింది. ఇది ఛాంపియన్‌షిప్‌ రికార్డు. గత రికార్డు కంటే 14 కిలోలు ఎక్కువ. చాను స్నాచ్‌లో 84 కిలోలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 109 కిలోలు ఎత్తింది. మలేసియాకు చెందిన ఇరెన్‌ హెన్రీ (161కేజీ) రజతం నెగ్గగా.. వేల్స్‌ అమ్మాయి నికోల్‌ రాబర్ట్స్‌ (150) కాంస్యం సాధించింది.

Current Affairs

దేశంలోనే తొలి స్మార్ట్‌ వర్సిటీ

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం జంతులూరులో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం దేశంలోనే తొలి స్మార్ట్‌ వర్సిటీగా నిలిచింది. ఈ విషయాన్ని వర్సిటీ వీసీ ఎస్‌ఏ.కోరి 2025, ఆగస్టు 25న వెల్లడించారు. వర్సిటీ ప్రాంగణం, తరగతి గదులు, వసతి గృహాల్లో అత్యాధునిక వసతులు సమకూర్చామని, వీటిని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఇటీవల వర్చువల్‌గా ప్రారంభించారని తెలిపారు. 

Current Affairs

నారి నివేదిక

దేశంలోని మహిళలకు అత్యంత సురక్షిత ప్రాంతాలుగా విశాఖపట్నం, భువనేశ్వర్, కోహిమా, ఆయిజోల్, ఈటానగర్, ముంబయి, గాంగ్‌టక్‌లు నిలిచినట్లు నారి 2025 నివేదిక వెల్లడించింది. పట్నా, జైపుర్, ఫరిదాబాద్, దిల్లీ, కోల్‌కతా, శ్రీనగర్, రాంచీలు భద్రత లేని ప్రాంతాలుగా ఉన్నాయి. మహిళల భద్రతపై జాతీయ వార్షిక నివేదిక/సూచిక(నారి)2025 నివేదికలో ఈ అంశాలు ఉన్నాయి. 31 నగరాల్లో 12,770 మంది మహిళలపై సర్వేచేసి నివేదికలో జాతీయ భద్రతా స్కోరును 65 శాతంగా పేర్కొంది. దీనికి ఎగువన ఉన్న నగరాలను సురక్షితమైనవిగా, దిగువన ఉన్న వాటిని భద్రత లేనివిగా వర్గీకరించింది. 

Current Affairs

సీఐఎస్‌ఎఫ్‌లో తొలి మహిళా కమాండోల బృందం

ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల నిర్వహణకు ప్రత్యేకంగా మహిళా కమాండోల బృందాన్ని ఏర్పాటు చేయాలని ‘కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం’ (సీఐఎస్‌ఎఫ్‌) నిర్ణయించింది. ‘విమానయాన భద్రత బృందం’ (ఏఎస్‌జీ) నుంచి 100 మంది మహిళలను తొలివిడతగా శిక్షణకు ఎంపిక చేశారు. మధ్యప్రదేశ్‌లోని బర్వాహాలో వీరికి శిక్షణ మొదలైంది. ఎనిమిది వారాలపాటు ఇచ్చే శిక్షణతో వీరు ‘సత్వర ప్రతిస్పందన బృందం’ (క్యూఆర్‌టీ), ప్రత్యేక కార్యదళం (ఎస్‌టీఎఫ్‌)లో సేవలకు సన్నద్ధమవుతారు.

Current Affairs

డిప్యూటీ ఎన్‌ఎస్‌ఏగా అనీశ్‌ దయాళ్‌

డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ)గా సీఆర్‌పీఎఫ్‌ మాజీ డైరెక్టర్, ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌(ఐటీబీపీ) డైరెక్టర్‌ జనరల్‌ అనీశ్‌ దయాళ్‌ సింగ్‌ నియమితులయ్యారు. ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాదం, నక్సల్స్‌ సమస్య, జమ్మూకశ్మీర్‌ వ్యవహారాలు సహా దేశ ఆంతరంగిక భద్రతకు సంబంధించిన విషయాలను అనీశ్‌ పర్యవేక్షిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. మణిపుర్‌ కేడర్‌కు చెందిన 1998 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన అనీశ్‌ 2024, డిసెంబరులో పదవీ విరమణ చేశారు.

Current Affairs

యూత్‌ ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌

ప్రపంచ యూత్‌ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన తానిపర్తి చికిత విజేతగా నిలిచింది. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. 2025, ఆగస్టు 24న విన్‌పెగ్‌ (కెనడా)లో జరిగిన అండర్‌-21 మహిళల కాంపౌండ్‌ ఫైనల్లో చికిత 142-136తో యెరిన్‌ పార్క్‌ (కొరియా)పై విజయం సాధించింది. అంతకుముందు సెమీస్‌లో చికిత 142-133తో పౌలా డయాజ్‌ (స్పెయిన్‌)పై చికిత నెగ్గింది.

Current Affairs

ఐశ్వరీకి స్వర్ణం

 ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత షూటర్‌ ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ స్వర్ణం సాధించాడు. 2025, ఆగస్టు 24న షింకెంట్‌ (కజకిస్థాన్‌)లో జరిగిన మ్యాచ్‌లో 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌లో 462.5 పాయింట్లతో అతడు అగ్రస్థానంలో నిలిచాడు. వెన్‌యు జావ్‌ (చైనా-462) రజతం, ఒకాడా (జపాన్‌-445.8) కాంస్యం గెలిచారు. 

Current Affairs

బాలకృష్ణ

లండన్‌కి చెందిన వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ (డబ్ల్యు.బి.ఆర్‌) గోల్డ్‌ ఎడిషన్‌లో తెలుగు కథానాయకుడు నందమూరి బాలకృష్ణకు చోటు దక్కింది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఈ గౌరవాన్ని పొందిన తొలి నటుడు ఆయనే. భారతీయ సినిమా రంగంలో 50 ఏళ్ల అసాధారణ ప్రయాణాన్ని పురస్కరించుకుని ఆయనకు ఈ ఘనత దక్కింది. 

Current Affairs

చెతేశ్వర్‌ పుజారా

అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైరవుతున్నట్లు సీనియర్‌ బ్యాటర్‌ చెతేశ్వర్‌ పుజారా (37 ఏళ్లు) 2025, ఆగస్టు 24న ప్రకటించాడు. అతడు దశాబ్ద కాలానికి పైగా మూడో స్థానంలో భారత్‌కు నమ్మదగ్గ బ్యాటర్‌గా ఉన్నాడు. పుజారా.. తన కెరీర్‌లో 103 టెస్టుల్లో 43.60 సగటుతో 7,195 పరుగులు చేశాడు. అతడు 5 వన్డే మ్యాచ్‌లు కూడా ఆడాడు. చివరిసారి అతడు 2023 జూన్‌లో టెస్టు మ్యాచ్‌ ఆడాడు. పుజారా 2010లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 103 టెస్టుల్లో 43.60 సగటుతో 7195 పరుగులు చేశాడు. టెస్టుల్లో భారత్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో పుజారా ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. అతడు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో 21301 పరుగులు చేశాడు. 

Current Affairs

గగన్‌యాన్‌ ఎయిర్‌ డ్రాప్‌ పరీక్ష

గగన్‌యాన్‌ ప్రాజెక్టులో భాగంగా వ్యోమగాములను సురక్షితంగా తీసుకొచ్చే పారాచూట్‌ వ్యవస్థను పరీక్షించడానికి ఇస్రో చేపట్టిన మొదటి సమీకృత ఎయిర్‌డ్రాప్‌ పరీక్ష (ఐఏడీటీ-1) విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్‌ నుంచి సుమారు 5 టన్నుల బరువున్న డమ్మీ క్రూ మాడ్యూల్‌ను చినూక్‌ హెలికాప్టర్‌ ద్వారా 2025, ఆగస్టు 24న గగనతలంలోకి తీసుకెళ్లారు. తీరానికి 35 కి.మీ. దూరంలో మూడు కి.మీ. ఎత్తు నుంచి సముద్రంలో జారవిడిచారు. తొలుత మాడ్యూల్‌కు అమర్చిన రెండు డ్రోగ్‌ పారాచూట్లు విచ్చుకుని వేగాన్ని నియంత్రించగా.. ఆ తర్వాత పైలట్‌ చూట్లు, మరో మూడు ప్రధాన పారాచూట్లు విజయవంతంగా పనిచేశాయి. బంగాళాఖాతంలో సురక్షితంగా దిగిన క్రూ మాడ్యూల్‌ను నౌకాదళ సిబ్బంది చెన్నై పోర్టుకు తరలించారు.