Posts

Current Affairs

ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌

ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో జీవాంజి దీప్తి బంగారు పతకం నెగ్గింది. 2025, అక్టోబరు 12న ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరిగిన టీ20 మహిళల 400 మీటర్ల పరుగును 55.92 సెకన్లలో ముగించిన దీప్తి అగ్రస్థానం సాధించింది. కరీనా పెయిమ్‌ (పోర్చుగల్‌) రజతం, తెలాయా బ్లాక్‌స్మిత్‌ (ఆస్ట్రేలియా) కాంస్య పతకాలు గెలుచుకున్నారు.

Current Affairs

భావనా చౌధరి

బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌)లో ఫ్లైట్‌ ఇంజినీర్‌గా ఇన్‌స్పెక్టర్‌ భావనా చౌధరి ఎంపికయ్యారు. 50 ఏళ్ల బీఎస్‌ఎఫ్‌ చరిత్రలో ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఈమె రికార్డు సృష్టించారు. బీఎస్‌ఎఫ్‌ మొదటిసారి సొంతంగా ఫ్లైట్‌ ఇంజినీర్లకు శిక్షణ ఇవ్వగా, అందుకు అయిదుగురుని ఎంపికచేసింది. ఆ బృందంలో ఏకైక మహిళ భావన. బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ దల్జీత్‌ సింగ్‌ చౌధరి చేతుల మీదుగా ఆమె ఇటీవల ఫ్లయింగ్‌ బ్యాడ్జీ అందుకున్నారు.

Current Affairs

రాడార్‌ గుర్తించలేని యుద్ధ విమానం తయారీ

రాడార్‌ గుర్తించలేని అయిదోతరం అత్యాధునిక యుద్ధవిమానాన్ని దేశీయంగా అభివృద్ధి చేసి, తయారు చేయనున్నారు. అడ్వాన్స్‌డ్‌ మీడియం కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (ఆమ్‌కా) స్టెల్త్‌ జెట్‌ ప్రోటోటైప్‌ రూపకల్పన కోసం, హైదరాబాద్‌కు చెందిన ఎంటార్‌ టెక్నాలజీస్‌తో అదానీ గ్రూప్‌ జట్టు కట్టింది. ఆమ్కా ప్రోటోటైప్‌ నిర్మాణం కోసం దేశీయంగా హెచ్‌ఏఎల్, ది కల్యాణీ గ్రూప్, టాటా, అదానీ, ఎల్‌ అండ్‌టీ సహా మొత్తం 7 సంస్థలు ఆసక్తి చూపాయి. 

Current Affairs

2024-25లో 7.75 లక్షల టన్నుల చక్కెర ఎగుమతులు

సెప్టెంబరుతో ముగిసిన 2024-25 మార్కెటింగ్‌ సీజన్‌లో మన దేశం 7.75 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి చేసినట్లు ఆలిండియా షుగర్‌ ట్రేడ్‌ అసోసియేషన్‌ (ఏఐఎస్‌టీఏ) వెల్లడించింది. ఏటా అక్టోబరు-సెప్టెంబరు మధ్య చక్కెర మార్కెటింగ్‌ సీజన్‌ నడుస్తుంది. 2024-25 మార్కెటింగ్‌ సీజన్‌ కోసం చక్కెర ఎగుమతులను 2025 జనవరి 20న అనుమతించారు. గత ఏడాది 10 లక్షల టన్నుల ఎగుమతులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

Current Affairs

ఏపీలో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎక్కువ

ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ గణాంకాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా 1,04,125 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండగా, వీటిలో 33.76 లక్షలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ తరహా స్కూళ్లు అత్యధికంగా ఏపీలో 12,912 ఉండగా, తర్వాతి స్థానాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ (9,508), ఝార్ఖండ్‌ (9,172), మహారాష్ట్ర (8,152) కర్ణాటక (7,349), లక్షద్వీప్‌ (7,217), మధ్యప్రదేశ్‌ (7,217), పశ్చిమ్‌ బెంగాల్‌ (6,482), రాజస్థాన్‌ (6,117), ఛత్తీస్‌గఢ్‌ (5,973), తెలంగాణ (5,001) ఉన్నాయి.

Current Affairs

16వ ఆర్థిక సంఘం పదవీ కాలం పొడిగింపు

నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌ఛైర్మన్‌ అరవింద్‌ పనగడియా నేతృత్వంలో ఏర్పాటైన 16వ ఆర్థిక సంఘం పదవీకాలాన్ని నెలరోజులపాటు పొడిగించేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2025, అక్టోబరు 11న ఆమోదం తెలిపారు. 2023 డిసెంబరు 31న ఏర్పాటైన ఈ సంఘం 2026 ఏప్రిల్‌ 1 నుంచి వచ్చే ఐదేళ్ల కాలానికి పంపిణీ చేయాల్సిన ఆర్థిక వనరులపై సెప్టెంబరు 31వ తేదీలోపు రాష్ట్రపతికి నివేదిక సమర్పించాల్సి ఉంది. అది కాస్త జాప్యం కానున్న నేపథ్యంలో కమిషన్‌ గడువును నవంబరు 30 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. 

Current Affairs

ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా సోనాలీ సేన్‌ గుప్తా

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ)గా సోనాలీ సేన్‌ గుప్తా  నియమితులయ్యారు. ఇంతవరకు ఆర్‌బీఐ బెంగళూరు కార్యాలయంలో, కర్ణాటక రీజనల్‌ డైరెక్టర్‌గా ఆమె వ్యవహరించారు. ఆర్‌బీఐలోనే ఆమెకు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్, మానవ వనరుల నిర్వహణ, బ్యాంకింగ్‌ నియంత్రణ-పర్యవేక్షణ విభాగాల్లోనూ ఆమె కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

Current Affairs

పీఎం ధనధాన్య కృషి యోజన, పప్పుధాన్యాల స్వావలంబన మిషన్‌ పథకాలు

దిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన మండలి ప్రాంగణంలో ప్రధాని నరేంద్ర మోదీ 2025, అక్టోబరు 11న పీఎం ధనధాన్య కృషి యోజన, పప్పుధాన్యాల స్వావలంబన మిషన్‌ పథకాలను ప్రారంభించి ప్రసంగించారు. రూ.24 వేల కోట్లతో చేపట్టే ధనధాన్య యోజన కింద 36 పథకాలను సమ్మిళితం చేసి అమలు చేయనున్నట్లు తెలిపారు. దేశంలో వ్యవసాయపరంగా వెనుకబడిన 100 జిల్లాల్లో పంటల ఉత్పాదకత పెంపుతోపాటు పశుసంవర్ధకంపైనా ఇందులో దృష్టిసారిస్తామని చెప్పారు. 

Current Affairs

సింధు

ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) అథ్లెట్స్‌ కమిషన్‌కు భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు వరుసగా మూడోసారి ఎన్నికైంది. నవంబరు 2022- నవంబరు 2029 కాలానికి గాను కొత్త సభ్యుల వివరాలను 2025, అక్టోబరు 10న బీడబ్ల్యూఎఫ్‌ ప్రకటించింది. సింధు, ఆన్‌ సి యంగ్‌ (కొరియా), దోహా హనీ (ఈజిప్ట్‌), జియా యి ఫాన్‌ (చైనా), డెబోరా జిలీ (నెదర్లాండ్స్‌) కమిషన్‌లో చోటు సంపాదించారు. అయిదు స్థానాలకు ఒక్కో నామినేషన్‌ మాత్రమే రావడంతో వీరంతా ఏకగ్రీవంగా  ఎన్నికయ్యారు. 

Current Affairs

ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా శశిధర్‌

ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా సి.శశిధర్‌ 2025, అక్టోబరు 10న అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఛైర్‌పర్సన్‌ అనురాధ పదవీకాలం పూర్తి కావడంతో సభ్యుడిగా ఉన్న శశిధర్‌కు ప్రభుత్వం ఛైర్మన్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. కమిషన్‌ సభ్యురాలు బీఎస్‌ సెలీనా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం శశిధర్‌ బాధ్యతలు చేపట్టారు.