Posts

Current Affairs

ట్రిపుల్‌ ఐటీ (డీఎం) ప్రాంగణం

అంతర్జాతీయంగా అత్యుత్తమ ఆర్కిటెక్చర్‌ నైపుణ్యాలతో నిర్మించిన ప్రాంగణాల్లో ‘ఇన్‌స్టిట్యూషన్స్‌’ కేటగిరీలో మన దేశం నుంచి కర్నూలులోని ట్రిపుల్‌ ఐటీ (డీఎం) ప్రాంగణం తొమ్మిదో స్థానంలో నిలిచింది. 2024, నవంబరులో సింగపూర్‌లో ‘వరల్డ్‌ ఆర్కిటెక్చర్‌ ఫెస్టివల్‌-2024’ నిర్వహించారు. అన్ని కేటగిరీల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 760 సంస్థలు పోటీపడ్డాయి. అందులోని అత్యుత్తమ ప్రాంగణాలను ఇటీవల ప్రకటించారు. కర్నూలు శివారులోని జగన్నాథగట్టుపై 151 ఎకరాల విస్తీర్ణంలో రూ.254 కోట్లతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ట్రిపుల్‌ఐటీ కళాశాల(డీఎం) ప్రాంగణాన్ని నిర్మించారు.

Current Affairs

షాంఘై సదస్సు

షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) 25వ శిఖరాగ్ర సదస్సు 2025, ఆగస్టు 31న తియాన్‌జిన్‌లో లాంఛనంగా మొదలైంది. భారత్, చైనా, రష్యా, ఇరాన్, పాకిస్థాన్‌ సహా దాదాపు 26 దేశాల అగ్రనేతలు ఇందులో పాల్గొన్నారు. సెప్టెంబరు 1న ఇది ముగుస్తుంది.  దీని పుట్టుపూర్వోత్తరాలు.. 1996లో ప్రచ్ఛన్నయుద్ధం ముగిసిన తర్వాత... సరిహద్దు భద్రతా సమస్యల్ని పరిష్కరించుకోవడానికి చైనా, రష్యా, కజకస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్‌ కలిసి ‘షాంఘై అయిదు’గా రూపుదిద్దుకున్నాయి. 2001 జూన్‌ 15న ఇందులో ఉజ్బెకిస్థాన్‌ ఆరో సభ్యదేశంగా చేరడంతో ఇది కాస్తా ‘షాంఘై సహకార సంస్థ’(ఎస్‌సీఓ)గా అవతరించింది.  2005 జులై 5న కజకస్థాన్‌ రాజధాని ఆస్తానా వేదికగా జరిగిన ఎస్‌సీఓ శిఖరాగ్ర సదస్సుకు పరిశీలకుడి హోదాలో భారత్‌కు ఆహ్వానం అందింది.   2014 సెప్టెంబరులో తజికిస్థాన్‌లోని దుశాన్‌బేలో జరిగిన సమావేశంలో ఎస్‌సీఓ సభ్యత్వం కోసం భారత్‌ నమోదు చేసుకుంది. ఆ తర్వాత రష్యా వేదికగా జరిగిన భేటీలో భారత్, పాకిస్థాన్‌లు పూర్తిస్థాయిలో సభ్య దేశాలుగా మారాయి. 

Current Affairs

షీ జిన్‌పింగ్‌తో నరేంద్రమోదీ భేటీ

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భారత ప్రధాని నరేంద్రమోదీ 2025, ఆగస్టు 31న తియాన్‌జిన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సరిహద్దు వివాదాలను పక్కనపెట్టేసి అన్ని రంగాల్లో కలిసి పనిచేయాలని రెండు పక్షాలు నిర్ణయించాయి. సరిహద్దు సమస్యలకు ‘సముచితమైన, సహేతుకమైన, పరస్పర అంగీకారయోగ్యమైన పరిష్కారం’ కనుగొనేందుకు కలిసి పనిచేయాలని నేతలిద్దరూ అవగాహనకు వచ్చారు. ఆర్థిక సంబంధాలు, పెట్టుబడుల్ని విస్తరించుకుంటూ ప్రపంచ వాణిజ్యాన్ని స్థిరపరిచేందుకు పాటుపడాలని నిర్ణయించుకున్నారు. ప్రధానంగా పెట్టుబడులు, వాణిజ్యం పెంపొందించుకోవడంపై ఇద్దరు నేతలూ దృష్టి సారించారు. ప్రజల మధ్య సంబంధాలు, నేరుగా విమాన సేవలు, వీసా సదుపాయాలు వంటివి చర్చకు వచ్చాయి.

Current Affairs

పీసీసీఎఫ్‌గా చలపతిరావు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అటవీ దళాల అధిపతి (పీసీసీఎఫ్‌)గా 1994 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్‌ అధికారి పీవీ చలపతిరావు 2025, ఆగస్టు 31న నియమితులయ్యారు. ప్రస్తుత పీసీసీఎఫ్‌ ఏకే నాయక్‌ పదవీవిరమణ చేయడంతో ఆయన స్థానంలో ప్రస్తుత నియామకం జరిగింది. 2028 జూన్‌ నెలాఖరు వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఇప్పటి వరకు ఎర్రచందనం, ప్రొడక్షన్‌ విభాగం పీసీసీఎఫ్‌గా ఆయన బాధ్యతలు నిర్వహించారు.

Current Affairs

జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవం

ముడి పదార్థాలు ఉపయోగించి.. వివిధ ఉత్పత్తులు లేదా వస్తువులను తయారు చేసే వ్యవస్థను పరిశ్రమ అంటారు. ప్రస్తుత కాలంలో దేశ ప్రగతి, ఆర్థికాభివృద్ధికి ఇవి ఎంతో అవసరం. వీటిలో చిన్న తరహా పరిశ్రమలు స్థానిక ఉత్పత్తుల తయారీలో కీలకంగా ఉన్నాయి. ప్రధానంగా హస్తకళలను ప్రోత్సహిస్తూ, చేతి వృత్తిదారులకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తున్నాయి. అంతేకాక కొత్త ఆవిష్కరణలను పెంపొందించడంలో, ఉపాధి కల్పనలో, ఆర్థిక వృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో ఇవి ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు సంస్కృతిని కాపాడటంలో ఇవి పోషిస్తోన్న పాత్రను గుర్తుంచుకోవాలనే లక్ష్యంతో ఏటా ఆగస్టు 30న మన దేశంలో ‘జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవం’గా  నిర్వహిస్తారు. చారిత్రక నేపథ్యం:  దేశంలో చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధికి మద్దతు కల్పించేందుకు ప్రభుత్వం 2000, ఆగస్టు 30న ఒక సమగ్ర విధాన ప్యాకేజీని ప్రకటించింది. చిన్న పరిశ్రమలకు మౌలిక సదుపాయాల కల్పన, సాంకేతిక అభివృద్ధి, చెల్లింపుల విధానంలో సమస్యలను తీర్చడం దీని ముఖ్య ఉద్దేశం. దీనికి గుర్తుగా ఏటా ఆ తేదీన ‘జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవం’గా నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. దీన్ని 2001 నుంచి ఏటా నిర్వహిస్తున్నారు. 

Current Affairs

దేశంలోనే తొలి ట్యాంపర్డ్‌ గ్లాస్‌ ప్లాంటు

ఆప్టిమస్‌ ఇన్‌ఫ్రాకామ్‌ నోయిడాలో ఏర్పాటు చేసిన దేశంలోనే మొట్టమొదటి ట్యాంపర్డ్‌ గ్లాస్‌ ప్లాంటును 2025, ఆగస్టు 30న కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రారంభించారు. మొబైల్‌ ఫోన్ల తెరలకు రక్షణ పొరగా (ప్రొటెక్టివ్‌ లేయర్‌) ఈ ట్యాంపర్డ్‌ గ్లాస్‌లను వాడతారు. వీటి తయారీ నిమిత్తం అమెరికాకు చెందిన కార్నింగ్‌ సంస్థతో ఆప్టిమస్‌ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. 

Current Affairs

గిరిజన భాషల అనువాదానికి ఆది వాణి

కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ త్వరలో ‘‘ఆది వాణి’’ పేరుతో కృత్రిమ మేధ సాయంతో గిరిజన భాషల్ని అనువదించే యాప్‌ను ప్రారంభించనుంది. దేశంలోని భాషా వైవిధ్యాన్ని సంరక్షించి గిరిజన జాతులకు సాధికారికత కల్పించడం కోసం ఈ చర్య తీసుకున్నట్టు గిరిజన వ్యవహారాల శాఖ వెల్లడించింది. వివిధ గిరిజన పరిశోధన సంస్థల సహకారంతో ఐఐటీ దిల్లీ, బిట్స్‌ పిలానీ, ఐఐఐటీ హైదరాబాద్, ఐఐఐటీ నవ రాయ్‌పుర్‌ సంస్థలు ఈ అనువాద సదుపాయాన్ని సృష్టించాయి.   ప్రారంభంలో ఇది సంతాలీ (ఒడిశా), భిలీ (మధ్యపదేశ్‌), ముండారి (ఝార్ఖండ్‌), గోండీ (ఛత్తీస్‌గడ్‌) భాషల్లో అనువాదానికి ఉపయోగపడుతుంది. కోయ, గారో భాషల్ని తదుపరి దశలో యాప్‌నకు జతచేస్తారు. 

Current Affairs

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జోడీ కాంస్యం నెగ్గింది. 2025, ఆగస్టు 30న పారిస్‌లో జరిగిన మ్యాచ్‌లో ఈ జంట 19-21, 21-18, 12-21తో 11వ సీడ్‌ చెన్‌ బోయాంగ్‌ - లి యి జంట చేతిలో ఓడిపోయింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో సాత్విక్‌ జోడీకి ఇది రెండో పతకం. 2022లోనూ ఈ భారత జంట కాంస్యమే నెగ్గింది.

Current Affairs

టీమ్‌లీజ్‌ డిజిటల్‌ నివేదిక

భారత కృత్రిమ మేధ (ఏఐ) విపణి పరిమాణం 2025లో 45 శాతం సంచిత వృద్ధితో 28.8 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.2.50 లక్షల కోట్లు) చేరే అవకాశం ఉందని టీమ్‌లీజ్‌ డిజిటల్‌ నివేదిక తెలిపింది. భారత డిజిటల్‌ ఆర్థికవ్యవస్థలో ఏఐ, క్లౌడ్‌ విభాగాల్లో ఉద్యోగాలకు గిరాకీ గణనీయంగా పెరగడమే కాకుండా.. వేతనాలపరంగా కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తున్నాయని నివేదిక అభిప్రాయపడింది. ఇదే సమయంలో నిపుణుల కొరత తీవ్రంగా ఉంటోందని విశ్లేషించింది. జెన్‌ఏఐ విభాగంలో ప్రతి 10 ఉద్యోగ ఖాళీలకు గాను ఒక్కరే అర్హులైన ఇంజినీర్‌ ఉంటున్నారని పేర్కొంది. 

Current Affairs

రాష్ట్రాల ఇంధన సమర్థత సూచిక-2024

కేంద్ర విద్యుత్‌శాఖకు చెందిన ‘బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ)’ కాలుష్యరహిత విద్యుత్‌ (క్లీన్‌ ఎనర్జీ) ఉత్పత్తిలో ప్రతిభ కనబరుస్తోన్న రష్ట్రాల జాబితాను ‘రాష్ట్రాల ఇంధన సమర్థత సూచిక-2024’ పేరుతో ఇటీవల విడుదల చేసింది. దేశంలోనే అత్యధికంగా 96.70% క్లీన్‌ ఎనర్జీ ఉత్పత్తితో హిమాచల్‌ప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. హిమాచల్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో జలవిద్యుదుత్పత్తి అధికంగా ఉన్నందున క్లీన్‌ ఎనర్జీ ఉత్పత్తిలో ముందున్నాయని నివేదికలో తెలిపింది. కాలుష్యరహిత విద్యుత్‌ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ 40.74%, తెలంగాణ 40.10 శాతంతో వరుసగా 16, 17 ర్యాంకుల్లో నిలిచాయి.