యూఎన్సీటీఏడీ నివేదిక
2024లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)ను అందుకున్న దేశాల్లో, ప్రపంచవ్యాప్తంగా భారత్ 15వ స్థానంలో నిలిచిందని యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ (యూఎన్సీటీఏడీ) నివేదిక వెల్లడించింది. 2023లో 28.1 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.42 లక్షల కోట్ల) ఎఫ్డీఐ మన దేశంలోకి తరలి రాగా 16వ స్థానంలో నిలిచింది. 2024లో 27.6 బి.డాలర్ల (సుమారు రూ.2.37 లక్షల కోట్ల) ఎఫ్డీఐ వచ్చినా ఒక స్థానం మెరుగైంది. నివేదికలోని ముఖ్యాంశాలు: 2024లో 1,080 కొత్త ప్రాజెక్టులను ప్రకటించారు. ఇందులో అంతర్జాతీయ ప్రాజెక్టు ఫైనాన్స్ ఒప్పందాలు సాధించిన అగ్రగామి 5 ఆర్థిక వ్యవస్థల్లో మన దేశం ఉంది. ఇలాంటి లావాదేవీలు 97 జరిగాయి. రెండు విభాగాల్లోనూ అమెరికా అగ్ర స్థానంలో ఉంది. భారత్తో పోలిస్తే అమెరికాలో కొత్త ప్రాజెక్టులు, అంతర్జాతీయ ప్రాజెక్టు ఫైనాన్స్ ఒప్పందాలు రెండింతలుగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ఎఫ్డీఐ సాధించిన దేశాల్లో 279 బి.డాలర్లతో అమెరికాలో తొలి స్థానంలో ఉంది. 2023లో 233 బి.డాలర్ల ఎఫ్డీఐ అమెరికాకు వెళ్లింది. చైనాకు ఎఫ్డీఐ 29 శాతం తగ్గడంతో 2024లో నాలుగో స్థానానికి పడిపోయింది. వరుసగా రెండో ఏడాదీ చైనాలోకి ఎఫ్డీఐ తగ్గింది. 2023లో చైనా రెండో స్థానంలో ఉంది.