Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

ఎస్‌బీఐ రిసెర్చ్‌ నివేదిక

భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత వృద్ధి రేటు వేగం ఇలాగే కొనసాగితే, తలసరి ఆదాయమూ గణనీయంగా పెరిగి.. 2030 నాటికి భారత్‌ ఎగువ మధ్య ఆదాయ (అప్పర్‌ మిడిల్‌ ఇన్‌కం) దేశాల జాబితాలో చేరుతుందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రిసెర్చ్‌ తాజా నివేదికలో పేర్కొంది. 2028 నాటికి జర్మనీని వెనక్కి నెట్టి.. అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని స్పష్టం చేసింది. 1990 నుంచి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ఆదాయ స్థాయిల్లో వచ్చిన మార్పులు, భారత తలసరి ఆదాయంలో వస్తున్న పెరుగుదలను విశ్లేషిస్తూ ఈ నివేదికను రూపొందించారు.

Current Affairs

ఆక్స్‌ఫాం నివేదిక

సాధారణ ప్రజానీకానికి రాజకీయ సాధికారత అందించడం ద్వారా ప్రగతి సాధించవచ్చనడానికి అద్భుత ఉదాహరణగా భారతదేశ రిజర్వేషన్‌ విధానం నిలిచిందని ‘‘ఆక్స్‌ఫాం ఇంటర్నేషనల్‌’’ సంస్థ పేర్కొంది. ప్రపంచ అసమానతలపై ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ (డబ్ల్యూఈఎఫ్‌) 56వ వార్షిక సమావేశాల మొదటి రోజైన జనవరి 19న విడుదల చేసిన నివేదికలో ఈ అంశాన్ని ప్రస్తావించింది. సామాన్యులతో పోలిస్తే ధనికులు రాజకీయ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు అవకాశాలు 4 వేల రెట్లు ఎక్కువని నివేదిక తెలిపింది. అసమానతలు ఎన్ని ఉన్నా ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజలు ప్రభావం చూపగల వ్యవస్థాగత, రాజకీయ, సామాజిక పరిస్థితులు ఉన్నప్పుడే సామాన్యులు రాజకీయంగా బలపడగలరని స్పష్టం చేసింది. 

Current Affairs

భారత్, యూఏఈ మెగా రక్షణ బంధం

ప్రధాని నరేంద్ర మోదీతో యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌ 2026, జనవరి 19న దిల్లీలో  భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య కీలక అంశాలపై చర్చలు జరిగాయి. మెగా వ్యూహాత్మక రక్షణ బంధం దిశగా భారత్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ అడుగులు వేశాయి. దీంతోపాటు ఎల్‌ఎన్‌జీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2032 నాటికి రెండు దేశాల మధ్య 200 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించాయి. పాక్, సౌదీల మధ్య రక్షణ బంధం కుదిరిన నేపథ్యంలో యూఏఈతో భారత్‌ రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం.  

Current Affairs

చైనాలో మళ్లీ తగ్గిన జనాభా

వరసగా నాలుగో సంవత్సరంలోనూ చైనాలో జనాభా తగ్గింది. 2015 నాటి పరిస్థితితో పోలిస్తే 2025లో దాదాపు కోటి మేర ఈ తగ్గుదల ఉంది. దంపతులకు ఒకే బిడ్డ అనే విధానాన్ని చాలాఏళ్లపాటు అమలుచేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని విశ్లేషకులు చెబుతున్నారు. జాతీయ గణాంకాల మండలి (ఎన్‌బీఎస్‌) 2026, జనవరి 19న విడుదల చేసిన గణాంకాల ప్రకారం చైనాలో 2025లో 79.2 లక్షలమంది శిశువులు జన్మించారు. 2024లో ఇది 95.4 లక్షలుగా ఉంది. గత ఏడాది 1.13 కోట్లమంది చనిపోయారు. అయిదు దశాబ్దాల్లో ఇదే అత్యధికం. 

Current Affairs

ఆటకు సైనా వీడ్కోలు

భారత మహిళల బ్యాడ్మింటన్‌కు మార్గదర్శిగా నిలిచి ఎన్నో అత్యుత్తమ విజయాలు అందుకున్న సైనా నెహ్వాల్‌ 2026, జనవరి 19న ఆటకు వీడ్కోలు పలికింది. చైనా ఆధిపత్యానికి గండి కొట్టి బ్యాడ్మింటన్‌లో అత్యున్నత శిఖరాలకు చేరింది. గత కొన్నేళ్లుగా సైనా ఆటకు దూరంగానే ఉంది. ఆమె చివరగా 2023లో సింగపూర్‌ ఓపెన్‌లో ఆడింది. మోకాళ్ల సమస్యే తన వీడ్కోలు నిర్ణయానికి కారణమని ఆమె తెలిపింది. విశేషాలు: 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్‌గా చరిత్ర సృష్టించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్, సూపర్‌ సిరీస్‌లలో అంతకుముందెప్పుడూ చూడని విజయాలు భారత్‌ సొంతమయ్యాయంటే సైనానే కారణం. 2009లో అర్జున అవార్డు పొందిన సైనా.. 2010లో అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్‌రత్న సొంతం చేసుకుంది.  ఒలింపిక్స్‌తో పాటు బీడబ్ల్యూఎఫ్‌ మేజర్‌ టోర్నీలైన ప్రపంచ ఛాంపియన్‌షిప్, ప్రపంచ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో కనీసం ఒక పతకం సాధించిన తొలి భారత ప్లేయర్‌ సైనానే. 

Current Affairs

ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్‌)

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ వేదికగా ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు 2026, జనవరి 19న ప్రాంభమైంది. దేశ విదేశాల నుంచి 3,000 మందికిపైగా ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. ఇందులో 400 మంది రాజకీయ నేతలు ఉండగా, వారిలో 64 మంది దేశాధినేతలున్నారు. 1,000 మంది సీఈవోలు సదస్సులో పాల్గొన్నారు.  దావోస్‌ పర్వతాల మధ్య ఉండే అతి శీతల ప్రాంతం. 1880లో ఐరోపాలో టీబీ మహమ్మారి పీడించేది. దీంతో చాలా మంది స్వచ్ఛమైన గాలి కోసం దావోస్‌ పర్వత ప్రాంతాలకు వెళ్లేవారు. అలా వెళ్లినవారు అక్కడే ఒక చర్చిని నిర్మించారు. అదే చర్చి.. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక సదస్సుకు వేదికగా నిలుస్తోంది. 1971 నుంచి ఏటా జనవరిలో ఈ సదస్సు జరుగుతోంది. తొలుత ఈ సదస్సును యూరోపియన్‌ మేనేజ్‌మెంట్‌ ఫోరం నిర్వహించేది. మొదటి సదస్సుకు డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడు క్లాజ్‌ స్వాబ్‌.. 400 మంది ఐరోపా వ్యాపారవేత్తలను పిలిచారు. ఆ తర్వాతి నుంచి అది ప్రపంచ దేశాల నేతల ఆర్థిక చర్చలకు వేదికగా నిలుస్తూ వస్తోంది. జెనీవా కేంద్రంగా ఏర్పడిన డబ్ల్యూఈఎఫ్‌ ఏటా ఈ సదస్సును నిర్వహిస్తోంది. 2026లో జరిగింది 56వ సదస్సు.

Current Affairs

జాతీయస్థాయి శాసన సదస్సులు

జాతీయ స్థాయి శాసన సదస్సులు ఉత్తర్‌ ప్రదేశ్‌ శాసనసభ ఆధ్వర్యంలో 2026 జనవరి 19న లఖ్‌నవూలోని విధాన్‌ భవనంలో ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా 86వ అఖిల భారత అధ్యక్ష అధికారుల సదస్సుతో పాటు, 62వ రాష్ట్ర శాసనసభ, శాసన మండళ్ల కార్యదర్శుల సదస్సు ఒకేసారి జరుగుతాయి. 

Current Affairs

సియామ్‌ నివేదిక

విదేశీ విపణిల్లో కార్లు, ద్విచక్ర, వాణిజ్య వాహనాలకు గిరాకీ పెరగడంతో.. 2025లో మనదేశం నుంచి 63,25,211 వాహనాలు ఎగుమతి అయ్యాయని వాహన తయారీదార్ల సంఘం సియామ్‌ తెలిపింది. 2024లో ఎగుమతి అయిన 50,98,474 వాహనాలతో పోలిస్తే ఇవి 24.1% అధికం. పశ్చిమాసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాల నుంచి మన వాహనాలకు గిరాకీ స్థిరంగా లభిస్తోందని వెల్లడించింది.  మోటార్‌ సైకిల్‌ ఎగుమతులు 27% పెరిగి 43,01,927కు చేరాయి. స్కూటర్ల ఎగుమతులు 8% వృద్ధితో 6,20,241గా నమోదయ్యాయి. మొత్తం వాణిజ్య వాహనాల ఎగుమతులు 27% పెరిగి 91,759కి చేరాయి. 

Current Affairs

రూ.1.84 లక్షల కోట్ల ఔషధ ఎగుమతులు

2025-26 ఆర్థిక సంవత్సరం తొలి 8 నెలల్లో మనదేశం నుంచి 20.48 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.84 లక్షల కోట్ల) విలువైన ఔషధాలు ఎగుమతి అయ్యాయని వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాలు వెల్లడించాయి. గత ఆర్థిక సంవత్సరం (2024-25) ఇదే సమయ ఎగుమతుల కంటే ఇవి 6.5% ఎక్కువ. మన ఔషధాల ఎగుమతులు బ్రెజిల్, నైజీరియా దేశాలకు వేగంగా పెరుగుతున్నాయి.  2024-25 ఇదే సమయంతో పోలిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 8 నెలల్లో పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజీరియాకు 17.9 కోట్ల డాలర్లు (సుమారు రూ.1,600 కోట్ల) అధికంగా ఔషధాలు మనదేశం నుంచి ఎగుమతి అయ్యాయి. మన దేశం నుంచి పెరిగిన ఔషధ ఎగుమతుల్లో ఈ వాటా 14%. మన ఔషధాల ఎగుమతులు వేగంగా పెరిగింది ఈ దేశానికే. 

Current Affairs

విజయ్‌ హజారే

దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీని విదర్భ తొలిసారి కైవసం చేసుకుంది. 2026, జనవరి 18న బెంగళూరులో జరిగిన ఫైనల్లో విదర్భ 38 పరుగుల తేడాతో సౌరాష్ట్రపై గెలిచింది. మొదట విదర్భ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 317 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో సౌరాష్ట్ర.. 48.5 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది.  ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా అథర్వ తైదె (128; 118 బంతుల్లో 15×4, 3×6) నిలిచాడు.