Posts

Current Affairs

అరేబియా సముద్రంలో కొత్త ఆక్టోపస్‌ జాతి

కేరళలోని కొల్లం తీరం.. అరేబియా సముద్రంలో 390 మీటర్ల లోతులో సరికొత్త ఆక్టోపస్‌ జాతిని కేంద్ర సాగర మత్స్య పరిశోధనా సంస్థ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ) శాస్త్రవేత్తలు గుర్తించారు. అది రెండు మీటర్లకన్నా ఎక్కువ పొడవు, 61 కిలోల బరువుకు పెరుగుతుంది. దానికి సీఎంఎఫ్‌ఆర్‌ఐ మాజీ డైరెక్టర్, కేరళ విశ్వవిద్యాలయ మాజీ ఉప కులపతి డాక్టర్‌ ఈజీ సీలాస్‌ పేరిట టానింజియా సీలాసీ అని నామకరణం చేశారు. టానింజియా అనే వర్గం కింద కనుగొన్న రెండవ ఆక్టోపస్‌ జాతి ఇదే. 

Current Affairs

భారత నైపుణ్యాల నివేదిక-2026

ఉద్యోగాలు చేసేందుకు అవసరమైన నైపుణ్యాలు కలిగిన వారు దేశవ్యాప్తంగా 56.35% మంది ఉన్నట్లు భారత నైపుణ్యాల నివేదిక-2026 వెల్లడించింది. ఉద్యోగ అర్హత నైపుణ్యాలున్న వారిలో ఉత్తర్‌ప్రదేశ్‌ (78.64%) మొదటి స్థానంలో నిలవగా.. ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర (75.42%), కర్ణాటక (73.85%), కేరళ (72.16%), దిల్లీ (71.25%) నిలిచాయి. ఏఐసీటీఈ, సీఐఐ సహకారంతో వీబాక్స్‌ సంస్థ నిర్వహించిన ఈ సర్వే నివేదికను తాజాగా విడుదల చేశారు.  సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా మొత్తం 7 లక్షల మందికి గ్లోబల్‌ ఎంప్లాయిబిలిటీ టెస్ట్‌(గెట్‌) నిర్వహించగా.. ఇందులో 60% పైగా మార్కులు సాధించిన వారు 56.35% మంది ఉన్నారు. మహిళలు పని చేయడానికి ఇష్టపడే మొదటి 10 రాష్ట్రాల్లో ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది. దీనికి ముందు రాజస్థాన్, కేరళ, తెలంగాణ వరుసగా ఉన్నాయి. 

Current Affairs

డబ్ల్యూహెచ్‌వో నివేదిక

భారత్‌లో 2023 సంవత్సరంలో 15-49 ఏళ్ల వయసు గల మహిళల్లో ఐదో వంతు మంది సన్నిహిత భాగస్వామితో హింసకు గురవ్వగా, దాదాపు 30 శాతం మంది వారి జీవితకాలంలో ఈ సమస్య బారినపడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. నవంబరు 25న ‘మహిళలు, బాలికలపై హింస నిర్మూలన దినోత్సవం’ సందర్భంగా ప్రపంచ వ్యాప్త పరిస్థితులపై డబ్ల్యూహెచ్‌వో నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ప్రతి ముగ్గురిలో ఒకరు, మొత్తంగా 840 మిలియన్ల (84 కోట్లు) మంది వారి జీవితకాలంలో లైంగిక హింస ఎదుర్కొన్నారు. 

Current Affairs

ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌తో మోదీ భేటీ

జీ20 దేశాల 20వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ 2025, నవంబరు 21న దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌ చేరుకున్నారు. ఇక్కడి గౌటెంగ్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌లో మోదికి సంప్రదాయబద్ధంగా స్వాగతం లభించింది. మోదీ జొహన్నెస్‌బర్గ్‌లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో భేటీ అయ్యారు. రక్షణ, అణు ఇంధనం సహా పలు రంగాల్లో పరస్పర సహకారం పెంపుపై చర్చించారు.

Current Affairs

యూరోపియన్‌ టిప్స్‌తో యూపీఐ అనుసంధానం

భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన మొబైల్‌ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ)ని, యూరోపియన్‌ చెల్లింపుల వ్యవస్థ టార్గెట్‌ ఇన్‌స్టంట్‌ పేమెంట్‌ సెటిల్‌మెంట్‌ (టిప్స్‌)తో అనుసంధానం చేయనున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తెలిపింది. భారత్‌-ఐరోపా ప్రాంతాల మధ్య నగదు బదిలీ (రెమిటెన్స్‌)ని సులభతరం చేసే లక్ష్యంతో, యూపీఐ-టిప్స్‌ను జత చేయాలనే ప్రతిపాదన రూపొందించినట్లు పేర్కొంది. 

Current Affairs

మిస్‌ యూనివర్స్‌ ఫాతిమా బాష్‌

థాయ్‌లాండ్‌లో జరిగిన మిస్‌ యూనివర్స్‌-2025 పోటీల్లో మిస్‌ మెక్సికో ఫాతిమా బాష్‌ విజేతగా నిలిచింది. 2024లో మిస్‌ యూనివర్స్‌గా నిలిచిన డెన్మార్క్‌ భామ విక్టోరియా కెజార్‌ హెల్విగ్‌.. ఫాతిమాకు అందాల కిరీటాన్ని అందజేశారు.  ఈ పోటీల్లో మొత్తం 120 మంది పాల్గొన్నారు. తొలి రన్నరప్‌గా థాయ్‌లాండ్‌కు చెందిన ప్రవీణార్‌ సింగ్, రెండో రన్నరప్‌గా వెనెజువెలాకు చెందిన స్టిఫానీ అబాసలీ నిలిచారు. ఈ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహంచిన మణికా విశ్వకర్మ స్విమ్‌సూట్‌ రౌండ్‌తో టాప్‌ 30 వరకు చేరుకుంది. 

Current Affairs

అమల్లోకి కార్మిక(లేబర్‌) కోడ్‌లు

దేశవ్యాప్తంగా కార్మికులందరికీ సామాజిక భద్రత, న్యాయం అందించేందుకు నాలుగు కార్మిక(లేబర్‌) కోడ్‌లను అమల్లోకి తీసుకువచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు సకాలంలో వేతనాలు చెల్లిస్తూ ఆర్థిక భద్రత కల్పించనున్నట్లు పేర్కొంది.  దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో రూపొందించిన.. వేతనాల కోడ్‌-2019, పారిశ్రామిక సంబంధాల కోడ్‌-2020, సామాజిక భద్రత కోడ్‌-2020, వృత్తిపరమైన భద్రత-ఆరోగ్యం-పనిప్రదేశాల్లో పరిస్థితుల కోడ్‌-2020.. ఈ 4 కార్మిక కోడ్‌లను దేశవ్యాప్తంగా ఒకేసారి 2025, నవంబరు 21 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. 

Current Affairs

యునిసెఫ్‌ నివేదిక

ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా ‘ప్రపంచంలో బాలల స్థితిగతులు-2025’ పేరిట ఓ నివేదికను యునిసెఫ్‌ 2025, నవంబరు 20న విడుదల చేసింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 2030 కంటే ముందే బహుమితీయ పేదరికాన్ని సగానికి తగ్గించేందుకు భారత్‌ కృషి చేస్తున్నప్పటికీ, దేశంలో చాలామంది చిన్నారులు కనీస సేవలను అందుకోవడంలో ఇంకా అవాంతరాలు ఎదుర్కొంటున్నారని యునిసెఫ్‌ పేర్కొంది. భారత్‌లో ఉన్న పిల్లల్లో దాదాపు సగం మంది (20.6 కోట్లు) విద్య, వైద్యం, ఇల్లు, పోషకాహారం, రక్షిత నీరు, పారిశుద్ధ్యం లాంటి ఆరు తప్పనిసరి సేవల్లో కనీసం ఒక దాన్ని పొందలేకపోతున్నారని అందులో పేర్కొంది. ఇందులో మూడోవంతు (6.2 కోట్లు) కన్నా తక్కువ మంది పిల్లలు రెండు లేదా అంత కంటే ఎక్కువ కనీస సౌకర్యాలకు నోచుకోకపోతున్నారని వెల్లడించింది. చిన్నారులు వీటి నుంచి బయటపడటానికి సహకారం అవసరమని సూచించింది. 

Current Affairs

అమెరికా నుంచి భారత్‌కు ఆయుధాలు

ప్రాంతీయ ముప్పుల్ని ఎదుర్కొని రక్షణ రంగం పరంగా బలోపేతమయ్యేందుకు దోహదపడేలా 9.3 కోట్ల డాలర్ల (సుమారు రూ.825 కోట్ల) ఆయుధాలను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. వీటిలో ఎక్స్‌క్యాలిబర్‌ గైడెడ్‌ ఫిరంగి గుళ్లు, జావెలిన్‌ యుద్ధ ట్యాంకుల విధ్వంసక వ్యవస్థతో ముడిపడిన పరికరాలు ఉంటాయి.   ఇండో-పసిఫిక్, దక్షిణాసియా ప్రాంతాల్లో రాజకీయంగా శాంతి-సుస్థిరతలకు, ఆర్థిక పురోభివృద్ధికి కీలక శక్తిగా భారత్‌ నిలుస్తుందని, అలాంటి ముఖ్యమైన రక్షణ భాగస్వామి భద్రతను మెరుగుపరిచేందుకు ఈ అమ్మకాలు దోహదం చేస్తాయని అమెరికా పేర్కొంది.

Current Affairs

బిహార్‌ సీఎంగా నితీశ్‌ ప్రమాణ స్వీకారం

జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌ 2025, నవంబరు 20న పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. పట్నాలోని గాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన వేదికపై నీతీశ్, 26 మంది మంత్రులతో గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ప్రమాణం చేయించారు. భాజపా నుంచి 14 మంది, జేడీయూ నుంచి 8 మంది, ఎల్జేపీ నుంచి ఇద్దరు, హెచ్‌ఏఎం, ఆర్‌ఎల్‌ఎంల నుంచి ఒక్కొక్కరు మంత్రులుగా ప్రమాణం చేశారు.