Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

మచెల్‌కు ఇందిరాగాంధీ శాంతి పురస్కారం

మొజాంబిక్‌ మానవ హక్కుల కార్యకర్త, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా రెండో భార్య గ్రాసా మచెల్‌... ఇందిరాగాంధీ శాంతి పురస్కారానికి ఎంపికయ్యారు. 2025 ఏడాదికి గానూ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి విభాగంలో మచెల్‌కు బహుమతిని ప్రదానం చేస్తున్నట్లు ఇందిరాగాంధీ మెమోరియల్‌ ట్రస్టు 2026, జనవరి 21న తెలిపింది.  విద్యా, ఆరోగ్యం, పోషకాహారం, ఆర్థిక సాధికారత సహా పలు కీలక రంగాల్లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని ఆమె చేసిన కృషికిగాను మచెల్‌కు ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు పేర్కొంది. 

Current Affairs

మరో అయిదేళ్ల పాటు అటల్‌ పెన్షన్‌ యోజన

అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్‌ అందించే ఉద్దేశంతో తీసుకొచ్చిన అటల్‌ పెన్షన్‌ యోజన పథకాన్ని (ఏపీవై) మరో అయిదేళ్లపాటు కొనసాగించాలని కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు దీన్ని పొడిగించేందుకు 2026, జనవరి 21న ఆమోదం తెలిపింది. 2015 మే 9 ప్రారంభమైన ఈ పథకంలో 2026 జనవరి 19 నాటికి 8.66 కోట్ల మంది చందాదారులుగా చేరారు.  అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు 60 ఏళ్లు దాటాక పెన్షన్‌ అందాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అటల్‌ పెన్షన్‌ యోజన (ఏపీవై) పథకాన్ని తీసుకొచ్చింది. 

Current Affairs

233 ఏళ్ల కిందటి రామాయణం

అయోధ్యలోని అంతర్జాతీయ ‘రామకథ’ గ్రంథాలయానికి 233 ఏళ్ల కిందటి అరుదైన వాల్మీకి రామాయణం (తత్వదీపికతో) సంస్కృత రాతప్రతులను కానుకగా అందజేసినట్లు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది.  మహేశ్వర తీర్థ శాస్త్రీయ వ్యాఖ్యానం (టీకా)తో ఉన్న 1792 నాటి ఈ వాల్మీకి రామాయణాన్ని సంస్కృతం (దేవనాగరి లిపి)లో రాసి ఉంది. తాత్వికత లోతును ప్రతిబింబించే ఈ ఇతిహాసం బాలకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ అనే అయిదు విభాగాలుగా ఉంది. 

Current Affairs

సునీతా విలియమ్స్‌

భారతీయ సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ (60) పదవీ విరమణ చేసినట్లు అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించింది. 2025 డిసెంబరు 27న ఆమె పదవీ విరమణ చేసినట్లు సంస్థ జనవరి 21న అధికారికంగా వెల్లడించింది. 27 సంవత్సరాలకు పైగా నాసా కోసం పనిచేసిన సునీత మూడు సార్లు అంతరిక్ష యాత్ర చేశారు. ఆమె తన సుదీర్ఘ వృత్తి జీవితంలో 608 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో బసచేసి అత్యధిక కాలం అంతరిక్షయానం చేసిన వ్యోమగాముల జాబితాలో చేరారు. గుజరాత్‌లోని మెహసానా జిల్లాకు చెందిన దీపక్‌ పాండ్యా, స్లోవేనియాకు చెందిన ఉర్సులిన్‌ బోనీ పాండ్యాల కుమార్తె అయిన సునీత 1965 సెప్టెంబరు 19న అమెరికాలోని ఓహాయో రాష్ట్రంలో జన్మించారు.

Current Affairs

తెలంగాణకు 6 కొత్త అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌లు

పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించడం, పర్యావరణ సమతుల్యత కాపాడటం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న నగర్‌ వన్‌ యోజన పథకం కింద తెలంగాణకు కొత్తగా ఆరు అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌లు మంజూరయ్యాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఆరింటికి మొదటి విడతలో మొత్తం రూ.8.26 కోట్లను కేంద్రం మంజూరు చేసింది.  నగర్‌ వన్‌ యోజన కింద ఏర్పాటయ్యే అర్బన్‌ ఫారెస్ట్‌లలో స్థానికంగా పెరిగే మొక్కలకు ప్రాధాన్యం ఇస్తారు. ఆదిలాబాద్‌ జిల్లా మావల, యాపల్‌గూడ;  మంచిర్యాల జిల్లా ఇందారం, చెన్నూర్‌; మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా యెల్లంపేట, చెంగిచెర్లలో వీటిని ఏర్పాటు చేస్తారు.

Current Affairs

త్రివిధ సజ్జ

ఇక్రిశాట్, భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐకార్‌), రాజస్థాన్‌ వ్యవసాయ పరిశోధన సంస్థలు సంయుక్తంగా ఆర్‌హెచ్‌బీ 273 పేరిట ప్రపంచంలోనే మొట్టమొదటి త్రివిధ సజ్జ సంకర (త్రీ వే పెర్ల్‌ మిల్లెట్‌ హైబ్రిడ్‌) రకాన్ని రూపొందించాయి. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ దాన్ని విడుదల చేశారు. సాధారణ హైబ్రిడ్‌ రకాలు రెండు మాతృకల నుంచి తయారైతే, ఈ త్రివిధ హైబ్రిడ్‌ మూడు మాతృకల కలయికతో రూపొందింది. ఇందులో అధిక దిగుబడి, నాణ్యమైన పశుగ్రాస లక్షణాలు ఉంటాయి. 

Current Affairs

‘ఐటీ సర్వీసెస్‌ 25 (2026)’ నివేదిక

అంతర్జాతీయంగా అత్యంత విలువైన ఐటీ సేవల బ్రాండ్లలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), ఇన్ఫోసిస్‌ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. బ్రాండ్‌ ఫైనాన్స్‌ సంస్థ ‘ఐటీ సర్వీసెస్‌ 25 (2026)’ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. 25 సంస్థలతో విడుదల చేసిన ఈ జాబితాలో అమెరికా, భారత్‌ నుంచి చెరి 8 సంస్థలున్నాయి. గత 8 ఏళ్లుగా మొదటి స్థానంలో నిలుస్తున్న యాక్సెంచర్, ఈసారీ 42.2 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.3.80 లక్షల కోట్ల) బ్రాండ్‌ విలువతో అగ్రస్థానంలో కొనసాగింది.  టీసీఎస్‌ వరుసగా అయిదో సంవత్సరమూ 21.2 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.91 లక్షల కోట్ల)తో రెండోస్థానంలో నిలిచింది. బ్రాండ్‌ విలువను ఏటా 15% చొప్పున పెంచుకుంటూ, గత ఆరేళ్లుగా అత్యంత వేగవంతమైన వృద్ధి సంస్థగా నిలిచిన ఇన్ఫోసిస్, 16.4 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.48 లక్షల కోట్ల)తో మూడో స్థానంలో నిలిచింది. 

Current Affairs

యూపీలో ఏఐ హబ్‌

గ్రీన్‌కో గ్రూపు వ్యవస్థాపకుల నేతృత్వంలోని ఏఎం గ్రూపు, ఉత్తర్‌ ప్రదేశ్‌ గ్రేటర్‌ నోయిడా ప్రాంతంలో  1 గిగావాట్‌ సామర్థ్యంతో కర్బన రహిత, అధిక సామర్థ్యంతో కూడిన కృత్రిమమేధ (ఏఐ) కంప్యూటింగ్‌ హబ్‌ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అంతర్జాతీయ అవసరాలను తీర్చే విధంగా ఇది ఉంటుందని పేర్కొంది.  ఈ ప్రాజెక్టు కోసం సంస్థ దాదాపు రూ.2.25 లక్షల కోట్ల (25 బిలియన్‌ డాలర్ల) పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్టును దశల వారీగా అభివృద్ధి చేస్తారు. మొదటి దశ 2028 నాటికి పూర్తవుతుందని, 2030లో పూర్తి స్థాయి 1 గిగావాట్‌ సామర్థ్యాన్ని సాధించాలని ఏఎం గ్రూప్‌ లక్ష్యంగా పెట్టుకుంది. 

Current Affairs

ఆంధ్రప్రదేశ్‌ సమాచార కమిషన్‌

ఆంధ్రప్రదేశ్‌ సమాచార కమిషన్‌(ఏపీఐసీ)లో ప్రధాన సమాచార కమిషనర్‌గా వజ్జా శ్రీనివాసరావు; కమిషనర్లుగా పరవాడ సింహాచలం నాయుడు, వొంటేరు రవిబాబు, గాజుల ఆదెన్న, వట్టికూటి శరత్‌ చంద్ర కల్యాణ చక్రవర్తి ప్రమాణం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ 2026, జనవరి 20న వీరితో సచివాలయంలో ప్రమాణం చేయించారు. వీరు మూడేళ్ల కాలం లేదా వారి వయస్సు 65 ఏళ్లు నిండే వరకు (ఏది ముందైతే అది) పదవిలో కొనసాగుతారు. వారి ప్రస్థానాలను పరిశీలిస్తే..

Current Affairs

భారత స్థూల దేశీయోత్పత్తి 7.3 శాతం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారత స్థూల దేశీయోత్పత్తి 7.3 శాతంగా నమోదవ్వొచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) అంచనా వేసింది. 2025 అక్టోబరు అంచనాల్లో మన వృద్ధిరేటు 6.6 శాతంగా ఉండొచ్చని చెప్పిన సంస్థ, 0.7% మేర పెంచింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026-27), 2027-28కి వృద్ధిరేటు అంచనాను 6.2% నుంచి 6.4 శాతానికి పెంచింది.  2025-26లో భారత్‌ ఆర్థిక వ్యవస్థ 7.4% వృద్ధిని నమోదు చేయొచ్చని గణాంకాల శాఖ ముందస్తు అంచనాల్లో పేర్కొంది. 2024-25లో వృద్ధిరేటు 6.5%గా ఉంది.