Posts

Current Affairs

ఐకార్‌ డీజీగా మంగీలాల్‌ జాట్‌

భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్‌) డైరెక్టర్‌ జనరల్‌గా, వ్యవసాయ పరిశోధన, విద్య విభాగం కార్యదర్శిగా డాక్టర్‌ మంగీలాల్‌ జాట్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఇక్రిశాట్‌ గ్లోబల్‌ రిసెర్చ్‌ ప్రోగ్రాం డైరెక్టర్‌గా ఉన్నారు. పదోన్నతిపై ఆయన్ను ఐకార్‌ డీజీగా నియమిస్తూ కేంద్ర నియామక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ నిర్ణయం తీసుకొంది. ఆయన బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. 

Current Affairs

2025-26లో వృద్ధి రేటు 6.4%

అమెరికా క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ అయిన ఫిచ్‌ రేటింగ్స్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025-26) భారత జీడీపీ వృద్ధి అంచనాలను 10 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 6.4 శాతానికి పరిమితం చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సర (2026-24) అంచనాను 6.3% వద్ద స్థిరంగా ఉంచింది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల వృద్ధిరేటు అంచనాలను 10 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించి, 6.2%, 6.4 శాతంగా పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక అవుట్‌లుక్‌ (జీఈఓ)కు ప్రత్యేక అప్‌డేట్‌ను 2025, ఏప్రిల్‌ 17న అందించింది. ప్రపంచ వృద్ధి రేటు కూడా 2025లో 0.4% తగ్గొచ్చని తెలిపింది. 

Current Affairs

ప్రపంచ టాప్‌-100 ఆసుపత్రులు

దిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌).. ప్రపంచంలోని టాప్‌-100 ఆసుపత్రుల్లో ఒకటిగా నిలిచింది. 2024కు సంబంధించి అత్యుత్తమ ఆసుపత్రుల పేరుతో న్యూస్‌వీక్, స్టాటిస్టా రూపొందించిన జాబితాలో అది 97వ స్థానాన్ని దక్కించుకుంది. ఆరోగ్య సేవలు, అత్యాధునిక వైద్య పరిశోధనలు, అందుబాటు ధరల్లో చికిత్స వంటి అంశాల ఆధారంగా అత్యుత్తమ ఆసుపత్రులను ఎంపిక చేశారు.  ఈ జాబితాలో- మేదాంత (గురుగ్రామ్‌) 146వ ర్యాంకు, చండీగఢ్‌లోని ది పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ 228వ ర్యాంకు పొందాయి.

Current Affairs

అంతర్జాతీయ బిగ్‌ క్యాట్‌ అలయన్స్‌ కార్యాలయం

ఏడు రకాలైన వన్యమృగాల రక్షణ కోసం ప్రధాని మోదీ చొరవతో ఏర్పాటైన అంతర్జాతీయ బిగ్‌ క్యాట్‌ అలయన్స్‌ (ఐబీసీఏ) ప్రధాన కార్యాలయం, సచివాలయం మన దేశంలోనే కొలువుదీరనున్నాయి. వీటి ఏర్పాటు ఒప్పందంపై 2025, ఏప్రిల్‌ 17న దిల్లీలో విదేశాంగశాఖ కార్యదర్శి పి.కుమరన్, ఐబీసీఏ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్పీ యాదవ్‌ సంతకాలు చేశారు. 2023 ఏప్రిల్‌ 9న ‘ప్రాజెక్టు టైగర్‌’ 50వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఐబీసీఏను ప్రారంభించారు. పులులు, సింహాలు, చిరుతలు, మంచు చిరుతలు, చీతాలు, జాగ్వార్లు, ప్యూమాలను ఐబీసీఏ సంరక్షిస్తుందని విదేశాంగశాఖ తెలిపింది. 

Current Affairs

సౌర వ్యవస్థ ఆవలా జీవం

భూమి నుంచి 120 కాంతిసంవత్సరాల దూరంలో ఉన్న ‘కె2-18బి’ అనే గ్రహంపై జీవం ఉందని బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం పరిశోధకులు తాజాగా గుర్తించారు. సముద్ర జలాల్లోని కొన్ని సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే అణువుల జాడను దీనిపై కనుగొన్నట్లు వారు తెలిపారు. ఈ గ్రహం పుడమి కంటే 8.5 రెట్లు పెద్దది. ‘కె2-18’ అనే నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తుంటుంది. ఈ గ్రహంపై మీథేన్, కార్బన్‌ డయాక్సైడ్‌ వంటి కర్బణ అణువులను పరిశోధకులు గతంలోనే గుర్తించారు. ‘కె2-18బి’కి సంబంధించి నాసాకు చెందిన జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోబ్‌ అందించిన డేటాను కేంబ్రిడ్జి పరిశోధకులు తాజాగా విశ్లేషించారు. 

Current Affairs

ప్రపంచ బిలియర్డ్స్‌ ఛాంపియన్‌షిప్‌

భారత స్టార్‌ క్యూయిస్ట్‌ సౌరవ్‌ కొఠారి ప్రపంచ బిలియర్డ్స్‌ ఛాంపియన్‌షిప్‌ (టైమ్డ్‌ ఫార్మాట్‌)ను సొంతం చేసుకున్నాడు. 2025, ఏప్రిల్‌ 17న కార్లో, ఐర్లాంగ్‌లో జరిగిన ఫైనల్లో కొఠారి 725-480 పాయింట్లతో పంకజ్‌పై విజయం సాధించాడు. సౌరవ్‌ తండ్రి మనోజ్‌ కొఠారి కూడా టైమ్డ్‌ ఫార్మాట్‌లో 1990లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో తొలి మూడు స్థానాల్లో భారత ఆటగాళ్లే నిలిచారు. ధ్రువ్‌ సిత్వాల మూడో స్థానం దక్కించుకున్నాడు. 

Current Affairs

లేహ్‌లో ‘3డీ’ సైనిక స్థావరం

దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక 3డీ స్వదేశీ సాంకేతికతతో లద్దాఖ్‌లోని లేహ్‌లో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే ఓ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేశారు. సైనికుల అవసరాల రీత్యా లేహ్‌లో సముద్ర మట్టానికి 11 వేల అడుగుల ఎత్తులో ఐఐటీహెచ్, సింప్లిఫోర్జ్‌ క్రియేషన్స్‌ సంయుక్తంగా దీన్ని నిర్మించాయి. దీనికి ప్రాజెక్ట్‌ ప్రబల్‌ అని పేరు పెట్టారు. ప్రాణవాయువు తక్కువున్న ప్రాంతాల్లో, ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన త్రీడీ నిర్మాణంగా ఇది గుర్తింపు పొందింది. 

Current Affairs

వరల్డ్‌ ప్రెస్‌ ఫొటో ఆఫ్‌ ది ఇయర్‌ 2025

గాజాపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో రెండు చేతులూ కోల్పోయిన ఈ పాలస్తీనా బాలుడు మహమ్మద్‌ అజ్జౌర్‌ (9) చిత్రం వరల్డ్‌ ప్రెస్‌ ఫొటో ఆఫ్‌ ది ఇయర్‌ 2025గా 2025, ఏప్రిల్‌ 17న ఎంపికైంది. ఖతర్‌ కేంద్రంగా పనిచేస్తున్న పాలస్తీనియన్‌ మహిళా ఫొటోగ్రాఫరు సమర్‌ అబు ఎలౌఫ్‌ ‘ది న్యూయార్క్‌ టైమ్స్‌’ కోసం ఈ ఫొటో తీశారు. 68వ వేడుకగా జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక ఫొటో జర్నలిజం పోటీల్లో 141 దేశాలకు చెందిన 3,778 మంది ఫొటోగ్రాఫర్లు మొత్తం 59,320 ఎంట్రీలను సమర్పించారు. 

Current Affairs

యంగ్‌ గ్లోబల్‌ లీడర్‌ అవార్డు

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం-డబ్ల్యూఈఎఫ్‌) ‘యంగ్‌ గ్లోబల్‌ లీడర్స్‌’లో ఒకరిగా ఎంపికయ్యారు. తమ తమ రంగాల్లో ప్రతిభా సామర్థ్యాలు కనబరుస్తూ సమాజంపై ప్రభావం చూపుతున్న 40 ఏళ్ల లోపు వారిని డబ్ల్యూఈఎఫ్‌ ఈ అవార్డుకు ఎంపిక చేస్తుంది. ఈ దఫా ప్రపంచ నలుమూలల నుంచి 116 మందిని ఎంపిక చేశారు.

Current Affairs

అమల్లోకి ఎస్సీ వర్గీకరణ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను 2025, ఏప్రిల్‌ 17న అమల్లోకి తెచ్చింది. వర్గీకరణ ప్రక్రియకు సంబంధించిన ముసాయిదా ఆర్డినెన్స్‌కు ఏప్రిల్‌ 15న మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తర్వాత గవర్నర్‌ కార్యాలయానికి నివేదించగా, ఏప్రిల్‌ 16న ఆయన దాన్ని ఆమోదించారు. దీంతో అధికారికంగా ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్‌-2025కి సంబంధించిన గెజిట్‌ (జీవో 19) నోటిఫికేషన్‌ను న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి విడుదల చేశారు. తద్వారా ఏప్రిల్‌ 17 నుంచి వెలువడే నియామక ప్రకటనలు, ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతులు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు వర్గీకరణ అమలు కానుంది. రాష్ట్ర ప్రభుత్వ నియామకాలకు సంబంధించిన బ్యాక్‌లాక్‌ పోస్టుల భర్తీలోనూ ఈ వర్గీకరణ వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వంలోని ఏదైనా శాఖకు సంబంధించి పోస్టుల భర్తీ, కేంద్రం ఆధీనంలో ఉండే కార్పొరేషన్లు, ఇతర సంస్థలు, విద్యా సంస్థలకు మాత్రం ఇది వర్తించదు.  59 ఉప కులాలకు లబ్ధి:  రాష్ట్రంలోని షెడ్యూల్డ్‌ కులాలన్నింటికీ విద్య, ఉద్యోగాల్లో సమాన, న్యాయమైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా.. మొత్తం 15 శాతం రిజర్వేషన్లను మూడు భాగాలుగా ఏకసభ్య కమిషన్‌ విభజించింది. గ్రూప్‌-1 కింద రెల్లి, ఉపకులాలు (12 కులాలు) చేర్చి 1% రిజర్వేషన్, గ్రూప్‌-2 కింద మాదిగ, ఉపకులాలు (18 కులాలు) చేర్చి 6.5% రిజర్వేషన్, గ్రూప్‌-3 కింద మాల, ఉపకులాలు (29 కులాలు) చేర్చి 7.5% రిజర్వేషన్‌ కేటాయించింది. దీంతో ఎస్సీల్లోని 59 ఉప కులాలకు లబ్ధి చేకూరనుంది. ఈ ప్రక్రియకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకున్నారు. రాష్ట్రం యూనిట్‌గా అమలు చేయనున్నారు. తదుపరి జనాభా లెక్కల తర్వాత ఎస్సీ వర్గీకరణను జిల్లా యూనిట్‌గా అమలు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.