డాకింగ్ ప్రక్రియ విజయవంతం
రోదసిలో రెండు వ్యోమనౌకలను అనుసంధానం (డాకింగ్) చేసే సాంకేతికతపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రెండోసారి విజయవంతంగా నిర్వహించింది. సంస్థ ప్రయోగించిన స్పేడెక్స్ ఉపగ్రహాలను అనుసంధానం చేసినట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ 2025, ఏప్రిల్ 21న తెలిపారు. స్పేడెక్స్ ప్రాజెక్టు కింద ఛేజర్ (ఎస్‌డీఎక్స్01), టార్గెట్ (ఎస్‌డీఎక్స్02) అనే రెండు ఉపగ్రహాలను 2024, డిసెంబరు 30న ఇస్రో నింగిలోకి పంపింది. ఇవి 2025, జనవరి 16న తొలిసారి కక్ష్యలో పరస్పరం అనుసంధానమయ్యాయి. మార్చి 13న తిరిగి వేరయ్యాయి. మ ళ్లీ ఏప్రిల్ 20న వాటిని ఒక్కటి చేశారు. ఈ రెండు ఉపగ్రహాల మధ్య దూరం 15 మీటర్లుగా ఉన్నప్పటి నుంచి పూర్తి స్వయంప్రతిపత్తితో ఈ ప్రక్రియ సాగిందని ఇస్రో వర్గాలు వివరించాయి.