అంతర్జాతీయ మాతృభూమి దినోత్సవం
అంతర్జాతీయ మాతృభూమి దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏటా ఏప్రిల్ 22న నిర్వహిస్తారు. భూమి - దాని ఆవరణ వ్యవస్థలు మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి; ప్రజల జీవనోపాధిని మెరుగుపరుచుకోవడం, జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడంలో పర్యావరణ ఆవశ్యకతను తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. విశ్వంలో జీవులు మనగలిగే ఏకైక గ్రహం భూమి. జనాభా పెరుగుదల, వాతావరణ మార్పులు, సహజ - మానవకారక విపత్తులు, అటవీ నిర్మూలన, కాలుష్యం మొదలైన కారణాల వల్ల భూమి తన సహజత్వాన్ని కోల్పోతోంది. దీని వల్ల నేల నాణ్యత క్షీణించి, పంటలు పండించడం కష్టమవుతుంది. చారిత్రక నేపథ్యం 1969, అక్టోబరులో శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన యునెస్కో సమావేశంలో అమెరికాకు చెందిన పర్యావరణవేత్త జాన్ మెక్‌కానెల్ భూమి ప్రాముఖ్యాన్ని తెలిపేందుకు ఒక రోజును కేటాయించాలని ప్రతిపాదించారు. దీనికి మద్దతుగా గేలార్డ్ నెల్సన్ అనే యూఎస్ సెనేటర్ 1970, ఏప్రిల్ 22న మొదటిసారి అమెరికాలో ‘ఎర్త్ డే’గా నిర్వహించారు. 2009లో యూఎన్ జనరల్ అసెంబ్లీ ఏటా ఏప్రిల్ 22న ‘అంతర్జాతీయ మాతృభూమి దినోత్సవం’గా జరపాలని తీర్మానించింది.