Posts

Current Affairs

భారత సంతతి సీఈఓల్లో సంపన్నురాలు జయశ్రీ

భారత సంతతికి చెందిన అంతర్జాతీయ సంపన్న సీఈఓల్లో జయశ్రీ ఉల్లాల్‌ అగ్రస్థానంలో నిలిచారు. ‘హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2025’ ప్రకారం, అరిస్టా నెట్‌వర్క్స్‌ ప్రెసిడెంట్, సీఈఓ జయశ్రీ ఉల్లాల్‌ రూ.50,170 కోట్ల నికర సంపదతో సంపన్నుల జాబితాలో తొలిస్థానంలో ఉన్నారు. కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌ కంపెనీ అయిన అరిస్టా నెట్‌వర్క్స్‌లో 2008 నుంచి ఆమె సేవలు అందిస్తున్నారు. ఫోర్బ్స్‌ ప్రకారం.. ఆమె నాయకత్వంలో 2024లో కంపెనీ 7 బిలియన్‌ డాలర్ల (రూ.63,000 కోట్ల) ఆదాయాన్ని నమోదు చేసింది. 2023తో పోలిస్తే ఇది 20 శాతం అధికం. అరిస్టా నెట్‌వర్క్స్‌లో ఆమెకు సుమారు 3 శాతం వాటా ఉంది. జయశ్రీ ఉల్లాల్‌ 1961 మార్చి 27న లండన్‌లో భారత సంతతికి చెందిన హిందూ కుటుంబంలో జన్మించారు. 2025లో ఇంజినీరింగ్‌లో గౌరవ డాక్టరేట్‌ పొందారు.

Current Affairs

పెరగనున్న సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం

మనదేశంలో మొత్తం విద్యుదుత్పత్తి సామర్థ్యం 2019లో 356 గిగావాట్లు కాగా, 2025 నాటికి అది దాదాపు 475 గిగావాట్లకు విస్తరించినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. పునరుత్పాదక ఇంధన వనరుల విభాగంలో కొత్త యూనిట్లు అధికంగా ఏర్పాటు కావడం దీనికి ప్రధాన కారణం. ఈ విభాగంలో విద్యుదుత్పత్తి సామర్థ్యం 2019లో 81 గిగావాట్లు మాత్రమే. కానీ 2030 నాటికి అయిదురెట్లకు పైగా వృద్ధి చెంది 430 గిగావాట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సౌర, పవన విద్యుత్తు ప్రాజెక్టులకు పలు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నందున ఈ విభాగాల్లో కొత్త యూనిట్లు అధికంగా ఏర్పాటయ్యే అవకాశం కలుగుతోంది. 

Current Affairs

ప్రపంచంలోకెల్లా అతిసూక్ష్మ, స్వతంత్ర రోబోల సృష్టి

ప్రపంచంలోకెల్లా అత్యంత సూక్ష్మ పరిమాణంలోని స్వతంత్ర రోబో ఆవిష్కృతమైంది. అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం, మిషిగన్‌ యూనివర్సిటీల పరిశోధకులు దీన్ని సృష్టించారు. ఇవి 200×300×50 మైక్రోమీటర్ల పరిమాణంలో ఉంటాయి. కాంతి ద్వారా శక్తిని పొందే ఈ చిట్టి రోబోలు స్థానిక ఉష్ణోగ్రతలను పసిగట్టి ముందుకు కదులుతాయి. కణాల ఆరోగ్యాన్ని పర్యవేక్షించే సామర్థ్యం వీటి సొంతం. అతిచిన్న సాధనాలను రూపొందించడంలో ఇవి కీలకంగా మారనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

Current Affairs

కోల్‌ ఇండియా సీఈఓగా సాయిరాం

ప్రభుత్వ రంగ కోల్‌ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ)గా ఉన్న బి.సాయిరాంను సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా నియమితులయ్యారు. దీనికి కంపెనీ బోర్డు 2025, డిసెంబరు 26న ఆమోదం తెలిపింది. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో కోల్‌ ఇండియాకు 80% వాటా ఉంది. 

Current Affairs

రాష్ట్రీయ బాల పురస్కార్‌

వీర బాలదివస్‌ సందర్భంగా కేంద్ర మహిళా అభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ ప్రకటించిన ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌-2025’ను 18 రాష్ట్రాలకు చెందిన 20 మంది పిల్లలు అందుకున్నారు. ధైర్యసాహసాలు, కళలు, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ, సామాజికసేవ, శాస్త్రసాంకేతిక, క్రీడా విభాగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన వారిని ఈ పురస్కారాలు వరించాయి. 2025, డిసెంబరు 26న విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు స్వీకరించారు. ఇందులో తెలంగాణ మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన 16 ఏళ్ల పర్వతారోహకుడు విశ్వనాథ్‌కార్తికేయ పడకంటి, ఏపీ కర్నూలు జిల్లాకు చెందిన 17 ఏళ్ల శివాని హోసూరు ఉప్పర ఉన్నారు.

Current Affairs

చైనా

ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌ వే సొరంగాన్ని చైనా 2025, డిసెంబరు 26న ప్రారంభించింది. ‘తియాన్షన్‌ షెంగ్లీ’గా దానికి నామకరణం చేశారు. ఈ సొరంగం పొడవు 22.13 కిలోమీటర్లు. వాయవ్య చైనాలోని షింజియాంగ్‌ యూగర్‌ అటానమస్‌ రీజియన్‌లో సెంట్రల్‌ తియాన్షన్‌ పర్వతాల మీదుగా ఇది వెళ్తుంది. ఆ పర్వతాల్లో గంటల పాటు పట్టే ప్రయాణ సమయాన్ని తియాన్షన్‌ షెంగ్లీ సొరంగం 20 నిమిషాలకు తగ్గిస్తుంది.

Current Affairs

7వ భారతీయ విజ్ఞాన సమ్మేళనం

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 7వ భారతీయ విజ్ఞాన సమ్మేళనాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) అధినేత మోహన్‌ భాగవత్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌లతో కలిసి సీఎం చంద్రబాబు 2025, డిసెంబు 26న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ‘ఇండియన్‌ నాలెడ్జ్‌ సిస్టమ్స్‌’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

Current Affairs

అగరబత్తీలకు కొత్త నాణ్యతా ప్రమాణాలు

ప్రపంచంలోనే అత్యధికంగా అగరబత్తీలను తయారు చేస్తూ, ఎగుమతి చేస్తున్న మన దేశంలో, వీటి నాణ్యతా ప్రమాణాల పెంపునకు ప్రభుత్వం నూతన నిబంధనలు జారీ చేసింది. ఇందుకోసం భారత ప్రమాణాల మండలి (బీఐఎస్‌) మార్గదర్శకాలు విడుదల చేసింది.  ప్రస్తుతం దేశీయ అగరబత్తీల వ్యాపార పరిమాణం సుమారు రూ.8,000 కోట్లుగా ఉంది. వినియోగదారు ఆరోగ్య భద్రత, అగరుబత్తీలు వెలిగించే గదిలో వాయు నాణ్యత, పర్యావరణ పరిరక్షణ, నియంత్రణ నిబంధనలు, కొన్ని రకాల సువాసన ఉత్పత్తులు, రసాయనాలపై అంతర్జాతీయంగా ఉన్న ఆంక్షలు తదితరాలను పరిగణనలోకి తీసుకుని.. అగరబత్తీల కోసం ప్రత్యేకంగా ‘ఐఎస్‌ 19412:2025’ ప్రమాణాలను రూపొందించారు. 

Current Affairs

పత్రికా పఠనం తప్పనిసరి

విద్యార్థుల రోజువారీ కార్యకలాపాల్లో వార్తాపత్రికల పఠనాన్ని తప్పనిసరి చేయాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు మార్గదర్శకాలు జారీచేసింది. ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను చూసే సమయాన్ని తగ్గించి, పుస్తక పఠన సంస్కృతిని బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది. పాఠశాల గ్రంథాలయాల్లో ఆంగ్ల, హిందీ వార్తాపత్రికలను     అందుబాటులో ఉంచాలని పేర్కొంది. ప్రతిరోజూ ఉదయం విద్యార్థుల్ని సమావేశపరిచే సమయంలో కనీసం పది నిమిషాల సమయాన్ని వార్తాపత్రికల పఠనానికి కేటాయించాలని స్పష్టంచేసింది.

Internship

మిపాస్‌ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు

మిపాస్‌ (Mepass) వర్డ్‌ప్రెస్‌ డెవలప్‌మెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సంస్థ: మిపాస్‌ పోస్టు పేరు: కార్పొరేట్‌ రిలేషన్స్‌   నైపుణ్యాలు: బిజినెస్‌ డెవలప్‌మెంట్, క్లయింట్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ (సీఆర్‌ఎం), ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, లింక్డ్‌ఇన్‌ మార్కెటింగ్, నెట్‌వర్కింగ్‌లో నైపుణ్యం ఉండాలి. స్టైపెండ్‌: రూ.10,000. వ్యవధి: 3 నెలలు దరఖాస్తు గడువు: 21-01-2026. Website:https://internshala.com/internship/detail/work-from-home-corporate-relations-partnerships-internship-at-mepass1766389839