Posts

Current Affairs

800 మీ. జాతీయ రికార్డు బద్దలు

ఆసియా క్రీడల రజత విజేత మహమ్మద్‌ అఫ్జల్‌.. 800 మీటర్ల పరుగులో జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. 2025, మే 9న జరిగిన యూఏఈ అథ్లెటిక్స్‌ గ్రాండ్‌ ప్రిలో 800.మీ రేసును అఫ్జల్‌ 1 నిమిషం 45.61 సెకన్లలో పూర్తి చేసి రజతం సాధించాడు. ఈ క్రమంలో జిన్సన్‌ జాన్సన్‌ 2018లో  1 నిమిషం 45.65 సెకన్లతో నెలకొల్పిన రికార్డును అధిగమించాడు.

Current Affairs

‘ఆర్నాలా’ నౌక నేవీకి అప్పగింత

సముద్ర అంతర్భాగంలో నౌకాదళ అవసరాల నిమిత్తం నిర్మించిన ‘యాంటీ సబ్‌మెరైన్‌ వార్ఫేర్‌-వాటర్‌ క్రాఫ్ట్‌’ నౌక ‘ఆర్నాలా’ను 2025, మే 9న ఇండియన్‌ నేవీకి అప్పగించారు. మొత్తం ఎనిమిది నౌకా నిర్మాణ ఆర్డర్లను దక్కించుకున్న గార్డెన్‌రీచ్‌ షిప్‌బిల్డింగ్‌ ఇంజినీర్స్‌ సంస్థ తొలి నౌక నిర్మాణం పూర్తి చేయడంతో నేవీ కార్యకలాపాలకు వినియోగించనున్నారు.

Current Affairs

ప్రపంచ రెడ్‌ క్రాస్‌ దినోత్సవం

ఇంటర్నేషనల్‌ కమిటీ ఆఫ్‌ ది రెడ్‌ క్రాస్‌ (ఐసీఆర్‌సీ) సహవ్యవస్థాపకులైన హెన్రీ డునాంట్‌ జయంతి సందర్భంగా ఏటా మే 8న ‘ప్రపంచ రెడ్‌ క్రాస్‌ దినోత్సవం’గా నిర్వహిస్తారు. దీన్నే ‘రెడ్‌ క్రెసెంట్‌ డే’ అని కూడా అంటారు. రెడ్‌ క్రాస్‌ అనేది ప్రపంచ మానవతా సంస్థ. ఇందులో ఎలాంటి లాభాపేక్ష లేకుండా, అవిశ్రాంతంగా పనిచేసే స్వచ్ఛంద సేవకులు, సిబ్బంది, మద్దతుదారులను గౌరవించుకోవడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం: 1859లో ఇటలీలో జరిగిన సోల్ఫెరెనో యుద్ధం రెడ్‌ క్రాస్‌ స్థాపనకు మూలం. యుద్ధంలో వేలాదిగా మరణించిన, గాయపడిన వారిని ప్రత్యక్షంగా చూసిన స్విట్జర్లాండ్‌ వ్యాపారవేత్త హెన్రీ డునాంట్‌ తీవ్ర వేదనకు గురయ్యారు. సాయుధ పోరాటాల్లో క్షతగాత్రులైనవారికి సాయం చేసేందుకు ఆయన 1863లో ఇంటర్నేషనల్‌ రెడ్‌ క్రాస్‌ అండ్‌ రెడ్‌ క్రెసెంట్‌ మూవ్‌మెంట్‌ను ప్రారంభించారు. అదే ఏడాది ఫిబ్రవరి 17న తన సహచరులతో కలిసి జెనీవాలో ఐసీఆర్‌సీని ఏర్పాటు చేశారు. 1938లో లండన్‌లో ఐసీఆర్‌సీ 14వ సమావేశం జరిగింది. అందులో హెన్రీ డునాంట్‌ జన్మదినమైన మే 8న ‘ప్రపంచ రెడ్‌ క్రాస్‌ దినోత్సవం’గా జరుపుకోవాలని సభ్యులు నిర్ణయించారు. దీన్ని మొదటిసారి 1948లో నిర్వహించారు. 

Current Affairs

ముంబయిలో ఇల్లినోయీ టెక్‌ క్యాంపస్‌

అమెరికాలోని షికాగోకు చెందిన ఇల్లినోయీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ భారత్‌లో తన క్యాంపస్‌ ఏర్పాటు చేయడానికి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) అనుమతి ఇచ్చినట్లు అధికారులు 2025, మే 8న వెల్లడించారు. భారత్‌లో క్యాంపస్‌ ఏర్పాటుకు అనుమతి పొందిన తొలి అమెరికా వర్సిటీగా ఇది నిలిచింది.

Current Affairs

14వ పోప్‌గా రాబర్ట్‌ ప్రివోస్ట్‌

అమెరికాకు చెందిన రాబర్ట్‌ ప్రివోస్ట్‌ (69 ఏళ్లు) తదుపరి పోప్‌గా ఎన్నుకున్నట్టు వాటికన్‌ వర్గాలు ప్రకటించాయి. పోప్‌గా ఓ అమెరికన్‌ ఎన్నికకావడం ఇదే ప్రథమం. రాబర్ట్‌ ప్రివోస్ట్‌ను ఇకపై 14వ పోప్‌ లియోగా వ్యవహరిస్తారు.  ‘‘ఆర్డో రితూమ్‌ కాంక్లేవిస్‌’’ నిబంధనల ప్రకారం సంప్రదాయబద్ధంగా పోప్‌ ఎన్నిక పూర్తయిందని వాటికన్‌ వర్గాలు తెలిపాయి.  అమెరికాలోని షికాగోకు చెందిన ప్రివోస్ట్‌ అంతర్జాతీయ అనుభవం కలిగిన వ్యక్తి. ఒక మతగురువుగా ఆయన సుదీర్ఘకాలం దక్షిణ అమెరికాలో పనిచేశారు. ఇటీవల బిషప్‌ నియామక బాధ్యతలు నిర్వహించారు. 

Current Affairs

ఏపీ క్యాబినెట్‌ నిర్ణయాలు

రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధాని అమరావతి అన్న పదాన్ని చేర్చి, ఈ మేరకు 2014లో చేసిన చట్టానికి సవరణ చేయాలని 2025,  మే 8న ఏపీ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానించింది. సీఆర్‌డీఏ చట్టంలో అమరావతి రాజధాని ప్రాంతంగా ఏయే ప్రాంతాలను పేర్కొన్నారో అవన్నీ అమరావతి రాజధానిగా ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.  ఇతర నిర్ణయాలు: అమృత్‌ 2.0 పథకంలో రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో జల కార్యాచరణ చేపట్టేందుకు కేంద్రం 36.5% నిధులు ఇచ్చింది. ఈ పథకాన్ని వినియోగించుకునేందుకు హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా రూ.6,777 కోట్లు ఖర్చు చేస్తారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.2,947.67 కోట్లు ఇస్తుంది. మిగిలింది యాన్యుటీ పద్ధతిలో చేయాలని మంత్రిమండలి తీర్మానించింది. ఈ విధానంలో తీసుకున్న నిధులు 10.15% వడ్డీతో 40 వాయిదాల్లో ప్రాజెక్టు పూర్తయిన రెండేళ్ల తర్వాత తిరిగి చెల్లిస్తారు. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,350 కోట్ల లబ్ధి కలుగుతుంది.

Current Affairs

టెస్ట్‌ క్రికెట్‌కు రోహిత్‌ శర్మ వీడ్కోలు

భారత వన్డే, టెస్ట్‌ క్రికెట్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 2025, మే 7న టెస్ట్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2024లో భారత్‌ టీ 20 ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆ ఫార్మాట్‌కూ గుడ్‌బై చెప్పాడు. రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్‌మెంట్‌ పలికిన హిట్‌మాన్‌ ఇకపై వన్డేల్లో మాత్రమే ఆడనున్నాడు. టెస్ట్‌ అరంగ్రేట మ్యాచ్‌లోనే (వెస్టిండీస్‌పై) సెంచరీ చేసిన ఆటగాళ్లలో రోహిత్‌ ఒకరు. ఈయన సారథ్యంలో టీమిండియా టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచింది టెస్టుల్లో రోహిత్‌ మొత్తం 67 మ్యాచ్‌లు ఆడి.. 4301 పరుగులు చేశాడు. వాటిలో 12 శతకాలు, 18 అర్ధశతకాలు ఉన్నాయి.

Current Affairs

బిజుకు రష్యా సాహస పురస్కారం

కళింగ వీరుడిగా పేరొందిన బిజు బాబుకు రష్యా సాహస పురస్కారం ప్రకటించింది. రెండో ప్రపంచ యుద్ధంలో బిజు రష్యాకు సహకరించినందుకు దీన్ని ప్రదానం చేస్తున్నట్లు దిల్లీలోని రష్యా రాయబారి కార్యాలయం ప్రకటించింది. బిజు తరఫున ఆయన కుమారుడు, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పురస్కారాన్ని స్వీకరించారు.  బిజు భారత స్వాతంత్య్ర సంగ్రామంలోనే కాకుండా ఇండోనేసియా విముక్తి ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. ‘భూమిపుత్రుడి’గా ఇండోనేసియా గతంలోనే ఆయనను సత్కరించింది.

Current Affairs

ప్రవీణ్‌సూద్‌

సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సూద్‌ పదవీ కాలాన్ని కేంద్రప్రభుత్వం పొడిగించింది. ఆయన మరో ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగుతారని 2025, మే 7న ప్రకటించింది. సీబీఐ నూతన చీఫ్‌ ఎంపికపై ప్రధాని మోదీ, సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, లోక్‌సభలో విపక్ష నాయకుడు రాహుల్‌గాంధీలతో కూడిన కమిటీ సమావేశమై సూద్‌ పదవీ కాలాన్ని పొడిగించాలని ప్రతిపాదించింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. మే 24 నుంచి సూద్‌ మరో ఏడాది పాటు సీబీఐ అధిపతిగా కొనసాగుతారు. 

Current Affairs

నెరేటివ్స్‌ ఆఫ్‌ ద బెంచ్, ఏ జడ్జ్‌ స్పీక్స్‌

మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రసంగాల సంకలనంతో రూపొందించిన ‘నెరేటివ్స్‌ ఆఫ్‌ ద బెంచ్, ఏ జడ్జ్‌ స్పీక్స్‌’ పుస్తకం 2025, మే 7న దిల్లీలో విడుదలైంది. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ సహా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ దీన్ని విడుదల చేశారు.