Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

డాక్టర్‌ విలియం కన్నుమూత

ప్రపంచ మానవాళి సాధించిన గొప్ప ప్రజారోగ్య విజయాల్లో ఒకటైన మశూచి నిర్మూలన కార్యక్రమ సారథి డాక్టర్‌ విలియం ఫోగ్‌ (89) మరణించారు. ఆయన సహ వ్యవస్థాపకుడిగా ఉన్న ‘టాస్క్‌ఫోర్స్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌’ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. విలియం అంటువ్యాధుల నిర్మూలనలో గణనీయమైన పాత్ర పోషించారు. 1980ల ప్రాంతంలో అమెరికా డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ సెంటర్స్‌కు డైరెక్టరుగా వ్యవహరించారు. 

Current Affairs

లాంగ్‌రేంజ్‌ యాంటీ షిప్‌ హైపర్‌సోనిక్‌ గ్లైడ్‌ మిసైల్‌

సముద్రంపై సుదూరంగా ఉన్న శత్రు దేశాల యుద్ధనౌకలను ధ్వంసం చేసేందుకు భారత్‌ మొదటిసారి లాంగ్‌రేంజ్‌ యాంటీ షిప్‌ హైపర్‌సోనిక్‌ గ్లైడ్‌ మిసైల్‌ (ఎల్‌ఆర్‌ఏఎస్‌హెచ్‌ఎం)ను సిద్ధం చేసింది. ఈ క్షిపణి పరిధి 1500 కి.మీ. కాగా గంటకు 6,100 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. హైదరాబాద్‌లోని అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లేబొరేటరీలో అభివృద్ధి చేసిన ఎల్‌ఆర్‌ఏఎస్‌హెచ్‌ఎంను 2024 నవంబర్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఇందులో విజయం సాధించడంతో మరో రెండేళ్లలో సైన్యంలో ప్రవేశపెట్టనున్నారు.

Current Affairs

శౌర్య పురస్కారాలు

విధి నిర్వహణలో అత్యుత్తమ ధైర్యసాహసాలను ప్రదర్శించిన 70 మంది త్రివిధ దళాల సిబ్బందికి శౌర్య పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రకటించారు. ఇందులో ఆరుగురిని మరణానంతరం ఎంపిక చేశారు. మొత్తం.. ఒక అశోక చక్ర, మూడు కీర్తి చక్రలు, 13 శౌర్య చక్రలు ప్రకటించారు. వ్యోమగామి శుభాంశు శుక్లాను ప్రభుత్వం శాంతికాలంలో ఇచ్చే అత్యున్నత శౌర్య పురస్కారం ‘అశోక చక్ర’కు ఎంపిక చేసింది.  ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ నాయర్‌తోపాటు మేజర్‌ అర్ష్‌దీప్‌ సింగ్, నాయబ్‌ సుబేదార్‌ డోలేశ్వర్‌ సుబ్బాలను ‘కీర్తి చక్ర’ పురస్కారాలు వరించాయి. శాంతికాలంలో ఇచ్చే మూడో అత్యున్నత సాహస పురస్కారమైన శౌర్య చక్రకు ఎంపికైనవారిలో నౌకాదళానికి చెందిన మహిళా అధికారులు లెఫ్టినెంట్‌ కమాండర్‌ దిల్నా, లెఫ్టినెంట్‌ కమాండర్‌ రూపా ఉన్నారు. వీరు తెరచాప నౌక ఐఎన్‌ఎస్‌వీ తరణిలో 8 నెలల పాటు ప్రపంచాన్ని చుట్టివచ్చారు. 

Current Affairs

రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం

దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు చెందిన రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్‌) ఐజీ-కమ్‌-ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్యూరిటీ కమిషనర్‌ అరోమాసింగ్‌ ఠాకుర్‌ రాష్ట్రపతి విశిష్ట సేవా పతకానికి ఎంపికయ్యారు. 1993 సివిల్‌ సర్వీసెస్‌ బ్యాచ్‌కు చెందిన ఆమె హౌరా రైల్వే డివిజన్‌లో అసిస్టెంట్‌ సెక్యూరిటీ కమిషనర్‌గా ఉద్యోగ ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ద.మ.రైల్వే ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్‌లోని రైల్‌నిలయంలో విధులు నిర్వహిస్తున్నారు.  అలాగే రైల్‌నిలయంలో అసిస్టెంట్‌ సెక్యూరిటీ కమిషనర్‌గా పనిచేస్తున్న ఉత్తమ్‌కుమార్‌ బంద్యోపాధ్యాయ్, ఆర్పీఎఫ్‌లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న రావుల శ్రీనివాస్, విజయవాడ డివిజన్‌లో పనిచేస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ కర్నాటి మహేశ్వరరెడ్డికి మెరిటోరియస్‌ సేవలకు పోలీస్‌ మెడల్స్‌ అందనున్నాయి.

Current Affairs

పద్మ పురస్కారాలు

* 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కళ, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర, సాంకేతికత, ఇంజినీరింగ్, వాణిజ్యం, పరిశ్రమ, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌర సేవల రంగాల్లో విశేష కృషి చేసిన 131 మందికి ఈ పౌర పురస్కారాలను 2026, జనవరి 26న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐదుగురు దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్‌; 13 మంది పద్మ భూషణ్‌; 113 మంది పద్మశ్రీలకు ఎంపికయ్యారు.  * పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిలో 19 మంది మహిళలు, ఆరుగురు విదేశీయులు/ ఎన్‌ఆర్‌ఐ/ పీఐఓ/ ఓసీఐలు ఉన్నారు. 16 మందికి మరణానంతరం ప్రకటించారు. పద్మ విభూషణ్‌కు ఎంపికైన ఐదుగురిలో ముగ్గురు కేరళకు చెందినవారే. 2026 మార్చి, ఏప్రిల్‌ నెలల్లో రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ పౌర పురస్కారాలను విజేతలకు ప్రదానం చేస్తారు. పద్మ విభూషణ్‌ పొందినవారు.. ధర్మేంద్ర సింగ్‌ దేవోల్‌: మహారాష్ట్రకు చెందిన ఈయనకు కళల విభాగంలో అవార్డు పొందారు. 1935లో పంజాబ్‌లో పుట్టిన ధర్మేంద్ర సీనియర్‌ నటుడు దిలీప్‌ కుమార్‌ స్ఫూర్తితో ముంబయికి చేరి సినిమా హీరో అయ్యారు. ఈయన 2025, నవంబరులో కన్నుమూశారు. 2012లో ధర్మేంద్రను ‘పద్మ భూషణ్‌’తో సత్కరించిన భారత ప్రభుత్వం.. తాజాగా దేశ రెండో అత్యున్నత పురస్కారమైన ‘పద్మ విభూషణ్‌’ను (మరణానంతరం) ప్రకటించింది.  కె.టి.థామస్‌: కేరళకు చెందిన థామస్‌ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి. 1937 జనవరి 30న కేరళలోని కొట్టాయం జిల్లాలో జన్మించిన ఆయన 1996 మార్చి 29 నుంచి 2002 జనవరి 30 వరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. 2007లో పద్మ భూషణ్‌ అవార్డు అందుకున్నారు. ప్రజా సంబంధాల విభాగంలో ఈ పురస్కారం దక్కింది. ఎన్‌.రాజం: డాక్టర్‌ ఎన్‌.రాజం కళల రంగంలో ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి పద్మ విభూషణ్‌కు ఎంపికైనప్పటికీ ఆమె 1938 ఏప్రిల్‌ 8న చెన్నైలో జన్మించారు. వయొలిన్‌ విద్వాంసురాలుగా వాసికెక్కారు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో పేరు పొందారు. మనుషుల స్వరాన్ని తలపించేలా వయొలిన్‌ను పలికించడంద్వారా ఆమె ‘సింగింగ్‌ వయొలినిస్ట్‌’గా ప్రఖ్యాతి గడించారు. 1984లో పద్మశ్రీ, 2004లో పద్మ భూషణ్, 1990లో సంగీత నాటక అకాడమీ, 2012లో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌లు పొందారు.   పి.నారాయణన్‌: 1936 మే 28న కేరళలోని మనకాడ్‌ అనే గ్రామంలో నారాయణన్‌ జన్మించారు. ఆరెస్సెస్, జన సంఘ్‌ భావజాలాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 1975లో కోళికోడ్‌ నుంచి ప్రారంభించిన జన్మభూమి పత్రికకు మేనేజర్‌గా, ప్రత్యేక కరస్పాండెంట్‌గా, ఎడిటర్‌గా పని చేశారు. 1992లో అదే పత్రికకు చీఫ్‌ ఎడిటర్‌గా పదోన్నతి పొందిన ఆయన 2000 సంవత్సరం వరకు అదే పదవిలో కొనసాగారు. సాహిత్యం, విద్య రంగంలో ఈ పురస్కారం పొందారు. వి.ఎస్‌.అచ్యుతానందన్‌: కేరళ మాజీ ముఖ్యమంత్రి. 2006 నుంచి 2011 వరకు సీపీఎం తరఫున ముఖ్యమంత్రిగా పని చేశారు. 1923 అక్టోబరు 20న జన్మించిన ఆయన 101 ఏళ్ల వయసులో 2025 జులై 21న కన్నుమూశారు. ప్రజా సంబంధాల రంగంలో అవార్డు పొందారు.

Current Affairs

అంతర్జాతీయ విద్యా దినోత్సవం

విద్య పొందడం అనేది మానవుల ప్రాథమిక హక్కు. ఇది ప్రజల్లో బాధ్యతను పెంపొందిస్తుంది. పేదరికాన్ని, అసమానతలను జయించడానికి చదువు మంచి సాధనం. సామాజిక మార్పు, స్థిరమైన అభివృద్ధికి చోదక శక్తిలా పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా శాంతి, సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పడంలో విద్య పోషించే కీలక పాత్రను గుర్తించే లక్ష్యంతో ఏటా జనవరి 24న ‘అంతర్జాతీయ విద్యా దినోత్సవం’గా (International Day of Education) నిర్వహిస్తారు. అందరికీ నాణ్యమైన విద్య అందేలా ప్రోత్సహించడంతోపాటు మారుతున్న సాంకేతిక అవసరాలకు తగ్గట్లు నిరంతర అభ్యసన ఆవశ్యకతను తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం ప్రపంచవ్యాప్తంగా శాంతి, సమానత్వం, అభివృద్ధిని ప్రోత్సహించడంలో విద్య ముఖ్య పాత్ర పోషిస్తుందని ఐక్యరాజ్యసమితి భావించింది. అందరికీ విద్య అనే సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనలో భాగంగా చదువు ఆవశ్యకతను చాటుతూ ఒక రోజును ఏర్పాటు చేయాలని సంకల్పించింది. దీనికి అనుగుణంగా ఏటా జనవరి 24న ‘అంతర్జాతీయ విద్యా దినోత్సవం’గా జరుపుకోవాలని 2018, డిసెంబరు 3న ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ తీర్మానించింది. 2019 నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు. 2026 నినాదం: The power of youth in co-creating education

Current Affairs

చక్కెర ఉత్పత్తిలో 22% వృద్ధి

2025-26 సీజనులో జనవరి 15 వరకు భారత్‌లో చక్కెర ఉత్పత్తి 22 శాతం పెరిగి 15.9 మిలియన్‌ టన్నులకు చేరింది. చెరకు సరఫరా పెరగడం, అధిక దిగుబడి ఇందుకు దోహదం చేశాయని ఇండియన్‌ షుగర్‌ అండ్‌ బయో-ఎనర్జీ మ్యాన్‌ఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ (ఐఎస్‌ఎంఏ) తెలిపింది. జనవరి 15 వరకు దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న చక్కెర మిల్లుల సంఖ్య 518 కాగా.. గత సీజనులో ఇదే సమయానికి ఈ సంఖ్య 500గా ఉందని పేర్కొంది. 

Current Affairs

సివిల్‌ సర్వీస్‌ క్యాడర్‌ కేటాయింపుల్లో మార్పులు

సివిల్‌ సర్వీస్‌ క్యాడర్‌ కేటాయింపు విధానాల్లో కేంద్రం సవరణలు చేసింది. అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఓఎస్‌ క్యాడర్‌ కేటాయింపులకోసం కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ ఇదివరకు ఉన్న జోనల్‌ విధానం స్థానంలో కొత్తగా గ్రూప్‌ విధానాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రాలను అక్షర క్రమంలో 4 గ్రూపులుగా విభజించింది. ఈ సర్వీసులకు ఎంపికైన అభ్యర్థులను ఇకమీదట ఈ గ్రూపులవారీగా క్యాడర్‌కు కేటాయిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించిన మీదట కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ కొత్త విధానాన్ని నోటిఫై చేసింది. దీంతో 2017 నుంచి ఉన్న జోనల్‌ విధానం స్థానంలో కొత్త గ్రూపు విధానం అమల్లోకి రానుంది. క్యాడర్‌ కేటాయింపుల్లో నిష్పాక్షికమైన, పారదర్శకతను పాటించడంకోసం అన్ని రాష్ట్రాల క్యాడర్, జాయింట్‌ క్యాడర్లను విభజించినట్లు వెల్లడించింది. అభ్యర్థుల ప్రాధాన్యం, ర్యాంకు, కేటగిరీ, ఆయారాష్ట్రాల్లో ఉన్న ఖాళీల ఆధారంగా సాధారణంగా క్యాడర్‌ కేటాయింపును చేస్తారు. ఇదివరకు రాష్ట్రాలను ప్రాంతాలవారీగా జోన్‌లుగా విభజించగా, ఇప్పుడు ఆ విధానాన్ని పక్కనపెట్టి అక్షరక్రమంలో గ్రూపింగ్‌చేశారు. 

Current Affairs

ఆర్బీఐ నివేదిక

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) తాజాగా విడుదల చేసిన ‘స్టేట్‌ ఫైనాన్సెస్‌’ నివేదిక ప్రకారం, దేశంలో యువ జనాభా తగ్గిపోతూ వయోధికులు అధికమవుతున్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) గణాంకాల ప్రకారం.. 60 ఏళ్ల పైబడిన జనాభా 15% మించితే ఆ రాష్ట్రాలకు వయోభారం పెరిగినట్లు లెక్క. అదే 10-15% మధ్యలో ఉంటే నడి వయసులో ఉన్నట్లు, 10%లోపు ఉంటే యుక్తవయసులో ఉన్నట్లు అంచనా. దీని ప్రకారం చూస్తే 2016 నాటికి దేశంలో ఏ రాష్ట్రమూ వయోభారం జాబితాలో లేదు. అయితే, 2026 నాటికి ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. 60 ఏళ్ల పైబడిన జనాభా శాతం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌-5, తెలంగాణ-10వ స్థానంలో ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోని మొత్తం జన సంఖ్య పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌-10, తెలంగాణ-13వ స్థానంలో ఉన్నాయి. 2036 నాటికి అత్యధిక వయోధికుల శాతం విషయంలో ఆంధ్రప్రదేశ్‌-4, తెలంగాణ-7వ స్థానానికి చేరుకుంటాయి.

Current Affairs

నొవాక్‌ జకోవిచ్‌ ఘనత

గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో 400 విజయాలు సాధించిన తొలి ప్లేయర్‌గా సెర్బియా దిగ్గజ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ ఘనత సాధించాడు. 2026, జనవరి 24న ఆస్ట్రేలియన్‌ ఓపెన్లో ప్రిక్వార్టర్స్‌ చేరే క్రమంలో మూడో రౌండ్లో 6-3, 6-4, 7-6 (7-4)తో బొటిక్‌ వాండి (నెదర్లాండ్స్‌)పై గెలిచాడు. రోజర్‌ ఫెదరర్‌ (369), రఫెల్‌ నాదల్‌ (314) వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నారు.