విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐలు)కు అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానంగా మనదేశం నిలుస్తోంది. 2000 ఏప్రిల్- 2024 సెప్టెంబరు మధ్య మనదేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) లక్ష కోట్ల డాలర్ల (రూ.84 లక్షల కోట్లకు పైగా) మైలురాయిని అధిగమించినట్లు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) వెల్లడించింది. డీపీఐఐటీ గణాంకాల ప్రకారం.. గత నాలుగున్నరేళ్లలో ఈక్విటీ, లాభాలను మళ్లీ పెట్టుబడులుగా పెట్టడం, ఇతర మూలధనం సహా మొత్తం ఎఫ్‌డీఐ 1,033.40 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
మొత్తం ఎఫ్‌డీఐల్లో 25% మారిషస్ మార్గంలో వచ్చాయి. సింగపూర్ (24%), అమెరికా (10%), నెదర్లాండ్స్ (7%), జపాన్ (6%), బ్రిటన్ (5%), యూఏఈ (3%), కేమన్ ఐలాండ్స్ (2%), జర్మనీ (2%), సైప్రస్ (2%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
మారిషస్ నుంచి 177.18 బిలియన్ డాలర్లు, సింగపూర్ నుంచి 167.47 బిలియన్ డాలర్లు, అమెరికా నుంచి 67.8 బిలియన్ డాలర్ల చొప్పున మన దేశంలోకి పెట్టుబడులు వచ్చాయి.