Posts

Current Affairs

భారత్‌ టెక్స్‌ 2025

‘భారత్‌ టెక్స్‌ 2025’ కార్యక్రమంలో 2025, ఫిబ్రవరి 16న ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రపంచంలో టెక్స్‌టైల్స్‌ ఎగుమతుల్లో భారత్‌ 6వ స్థానంలో ఉన్నట్లు, 2024-25లో రూ.3 లక్షల కోట్ల టెక్స్‌టైల్‌ ఎగుమతులు చేసినట్లు మోదీ తెలిపారు. టెక్స్‌టైల్‌ రంగం 2030 నాటికి రూ.9 లక్షల కోట్ల వార్షిక ఎగుమతులే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.  2025-26 కేంద్ర బడ్జెట్‌లో రూ.5,272 కోట్ల (బడ్జెట్‌ అంచనాలు) నిధులను టెక్స్‌టైల్స్‌ మంత్రిత్వ శాఖకు కేటాయించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన బడ్జెట్‌ అంచనా రూ.4,417.03 కోట్లతో పోలిస్తే ఇది 19 శాతం అధికం. 

Current Affairs

దేశంలో నమోదైన డ్రోన్లు 29,501

దేశంలో 29,501 డ్రోన్లు (నమోదైనవి) ఉన్నాయని పార్లమెంట్‌లో పౌర విమానయాన శాఖ సహాయమంత్రి మురళీధర్‌ మొహోల్‌ వెల్లడించారు. దేశంలోనే అత్యధికంగా దిల్లీలో 4,882 డ్రోన్లు, తమిళనాడులో 4,588, మహారాష్ట్రలో 4,132 ఉన్నట్లు తెలిపారు. ఆ తర్వాత హరియాణాలో 3,689, కర్ణాటకలో 2,516, తెలంగాణలో 1,928, గుజరాత్‌లో 1,338, కేరళలో 1,318 డ్రోన్లు ఉన్నాయని పేర్కొన్నారు.

Current Affairs

వినోద్‌కుమార్‌ చౌధరి

దిల్లీలోని కిరాడీ ప్రాంతానికి చెందిన వినోద్‌కుమార్‌ చౌధరి (44) మొబైల్‌ ఫోను కీబోర్డుపై ముక్కుతో 108 ఆంగ్ల క్యారెక్టర్లను 1.18 నిమిషాల్లో టైప్‌ చేసి, 21వ సారి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ విజేతగా నిలిచారు. ఈ ప్రయత్నంలో 19 గిన్నిస్‌ రికార్డులను కలిగి ఉన్న క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ ప్రపంచ రికార్డును అధిగమించారు.  వినోద్‌కుమార్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో ఈయన కంప్యూటర్‌ ఆపరేటరుగా పనిచేస్తున్నారు. ఈయన్ను ‘టైపింగ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా పిలుస్తారు.  2014లో తొలిసారిగా గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించిన వినోద్‌ ముక్కుతో వేగంగా టైపింగు చేయడం, కళ్లకు గంతలు కట్టుకొని టైప్‌ చేయడం, మౌత్‌ స్టిక్‌తో టైప్‌ చేయడం ఇలా వివిధ విన్యాసాలతో 11 ఏళ్లలో 21 సార్లు గిన్నిస్‌ రికార్డును సృష్టించారు.

Current Affairs

పెద్దకుర్మపల్లి రైతుకు జాతీయ పురస్కారం

కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం పెద్దకుర్మపల్లి గ్రామానికి చెందిన రైతు మావురం మల్లికార్జున్‌రెడ్డికి జాతీయ పురస్కారం లభించింది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ (ఐసీఏఆర్‌) ఆధ్వర్యంలో ఏటా దేశవ్యాప్తంగా ఉత్తమ రైతులను ఎంపిక చేసి ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఏఆర్‌ఐ) ఫెలో ఫార్మర్, ఇన్నోవేటివ్‌ ఫార్మర్‌ విభాగాల్లో పురస్కారాలు అందిస్తుంది. ఈ ఏడాది (2025) ఫెలో ఫార్మర్‌ పురస్కార విభాగంలో ఆరుగురు రైతులను ఎంపిక చేయగా, అందులో దక్షిణ భారతదేశం నుంచి మల్లికార్జున్‌రెడ్డి మాత్రమే ఉన్నారు.

Current Affairs

మెటా సముద్రగర్భ కేబుల్‌

ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రగర్భ కేబుల్‌ అయిన ‘ప్రాజెక్ట్‌ వాటర్‌వర్త్‌’కు భారత్‌నూ అనుసంధానం చేయనున్నామని సామాజిక మాధ్యమం మెటా 2025, ఫిబ్రవరి 15న తెలిపింది. మెటా ఆధ్వర్యంలో సాగుతున్న ఈ కేబుల్‌ ద్వారా కార్యకలాపాలు, ఈ దశాబ్దం చివరకు ప్రారంభమవుతాయని అంచనా.  ప్రపంచంలోని 5 ప్రధాన ఖండాలను కలిపే ఈ కేబుల్‌ పొడవు 50,000 కి.మీ.కు పైగా విస్తరించి ఉంటుంది. ఇది భూమి చుట్టుకొలత (40,075 కి.మీ) కంటే ఎక్కువ. ఈ కేబుల్‌కు నౌకల లంగర్లు, ఇతర ప్రమాదాల వల్ల ఇబ్బంది లేకుండా అధునాతన సాంకేతికత వినియోగించి 7,000 మీటర్ల వరకు లోతులో బలంగా వేస్తున్నారు.

Current Affairs

జీరో థ్రెషోల్డ్‌ రామన్‌ లేజర్‌

క్వాంటమ్‌ కమ్యూనికేషన్లకు ఉపయోగపడే జీరో థ్రెషోల్డ్‌ రామన్‌ లేజర్‌ను ఖరగ్‌పుర్‌ ఐఐటీ పరిశోధకులు రూపొందించారు. ఈ లేజర్‌ నానో స్థాయి సూక్ష్మ లేజర్‌ టెక్నాలజీని విప్లవీకరిస్తుంది. కాంతి కిరణం పాదార్థిక అణువులను ఢీకొన్నప్పుడు చెల్లాచెదురవుతుంది. ఆ క్రమంలో అణువుల శక్తిలో మార్పు వస్తుంది. దీన్నే రామన్‌ శ్కాటరింగ్‌ లేదా రామన్‌ ఎఫెక్ట్‌ అంటారు.  జీరో థ్రెషోల్డ్‌ రామన్‌ లేజర్‌ క్వాంటమ్‌ కాంతి పౌనఃపున్యాన్ని మార్చేస్తూనే క్వాంటమ్‌ స్వభావానికి భంగం కలగకుండా చూస్తుంది. ఈ లక్షణం క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌ సాంకేతికతలకు ఎంతో ఉపకరిస్తుంది. 

Current Affairs

జాతీయ కోచ్‌గా జస్పాల్‌ రాణా

దిగ్గజ షూటర్‌ జస్పాల్‌ రాణాను 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో హై పర్ఫార్మెన్స్‌ కోచ్‌గా నియమిస్తూ 2025, ఫిబ్రవరి 15న జాతీయ రైఫిల్‌ సంఘం నిర్ణయం తీసుకుంది. స్టార్‌ షూటర్‌ జీతు రాయ్‌కి 10 మీటర్ల విభాగంలో కోచింగ్‌ బాధ్యతలు అప్పగించింది.  2006 ఆసియా క్రీడల్లో మూడు స్వర్ణాలు గెలిచిన జస్పాల్‌ గతంలో జాతీయ జూనియర్‌ కోచ్‌గా వ్యవహరించాడు.

Current Affairs

గుల్వీర్‌ సింగ్‌

ఆసియా క్రీడల్లో కాంస్య పతక విజేత, భారత స్టార్‌ రన్నర్‌ గుల్వీర్‌ సింగ్‌ 16 ఏళ్ల జాతీయ రికార్డును తిరగరాశాడు. 2025, ఫిబ్రరి 15న బోస్టన్‌లో జరిగిన 3000 మీటర్ల ఇండోర్‌ రేసును 7 నిమిషాల 38.26 సెకన్లలో ముగించాడు. ఈ విభాగంలో సురేందర్‌ సింగ్‌ (2008లో  7 నిమిషాల 49.47 సెకన్లు) పేరిట ఉన్న రికార్డును మెరుగుపరిచాడు.  కొత్త జాతీయ రికార్డును నెలకొల్పిన గుల్వీర్‌ రేసును రెండో స్థానంలో ముగించాడు.

Current Affairs

దిల్నా, రూప

అత్యంత శీతల ప్రదేశంగా పేరుగాంచిన కేప్‌ హార్న్‌ సముద్రాన్ని దాటి భారత నౌకాదళ మహిళా సాహస యాత్రికులు దిల్నా, రూప చరిత్ర సృష్టించినట్లు నేవీ వర్గాలు 2025, ఫిబ్రవరి 15న తెలిపాయి. భారత నౌకాదళానికి చెందిన లెఫ్టినెంట్‌ కమాండర్లు అయిన వారు ‘ఐఎన్‌ఎస్‌ తరణి’ నౌకలో ‘నావికా సాగర్‌ పరిక్రమ-2’కు 2024లో శ్రీకారం చుట్టారు. వీరి యాత్ర దక్షిణ అమెరికాను చేరుకునే క్రమంలో గంటకు 70 కి.మీ. వేగంతో గాలులు వీస్తూ 5 మీటర్ల మేర అలలు ఎగసిపడినా ధైర్యసాహసాలు ప్రదర్శించారు. కేప్‌ హార్న్‌ అనేది అంటార్కిటికాకు 800 కి.మీ. దూరంలో ఉంది.

Walkins

ఎన్‌ఐఈఎల్‌ఐటీలో ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు

చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకీ ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 06 వివరాలు: 1. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌: 01 2. సీనియర్‌ రీసోర్స్‌ పర్సన్‌ (అడ్మిన్‌): 01 3. రిసోర్స్‌ పర్సన్‌ (అడ్మిన్‌)-01 4. రిసోర్స్‌ పర్సన్‌ (అకౌంట్స్‌)- 01 5. రిసోర్స్‌ పర్సన్‌ (డేటా సైన్స్‌)- 01 6. మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌)- 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ/బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. వయోపరిమితి: ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌కు 40 ఏళ్లు, ఇతర పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌కు రూ.50,000; సీనియర్‌ రీసోర్స్‌ పర్సన్‌కు రూ.25,000-రూ.35,000; రిసోర్స్‌ పర్సన్‌కు రూ.23,000-రూ.30,000; మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌కు రూ.21,000-రూ.23,000.  ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ఫీజు: రూ.200. ఇంటర్వ్యూ తేదీ: 27-02-2025. Website:https://nielit.gov.in/chennai/recruitments