ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025, ఫిబ్రవరి 28న శాసనసభలో 2025-26 సంవత్సరానికి రూ.3,22,359 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే. రాష్ట్ర బడ్జెట్ రూ.3 లక్షల కోట్ల మార్కును దాటడం ఇదే మొదటిసారి. రూ.48,341 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు.
సంక్షేమానికి, అభివృద్ధికి, హామీల అమలుకు సమప్రాధాన్యమిస్తూ స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాన్ని చేరుకునేందుకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చారు. అసాధారణ రీతిలో రూ.40,635 కోట్ల మూల ధన వ్యయాన్ని ప్రతిపాదించారు.
2025-26 బడ్జెట్ స్వరూపం
మొత్తం బడ్జెట్: రూ.3,22,359.33 కోట్లు
రాబడి:
మూలధన వసూళ్లు: రూ.1,04,382.80 కోట్లు
రెవెన్యూ వసూళ్లు: రూ.2,17,976.53 కోట్లు
ఖర్చులు:
మూలధన చెల్లింపులు: రూ.24,430.16 కోట్లు
రుణాలు, అడ్వాన్సులు: రూ.6,130.95 కోట్లు
రెవెన్యూ వ్యయం: రూ.2,51,162.5 కోట్లు
మూలధన వ్యయం: రూ.40,635.72 కోట్లు
’ రెవెన్యూ లోటు: -రూ.33,185.97 కోట్లు
’ ద్రవ్య లోటు: -రూ.79,926.90 కోట్లు
రంగావవారీ కేటాయింపులు
విద్యారంగం
పాఠశాల, ఉన్నత విద్యకు కలిపి ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో రూ.34,311 కోట్లు కేటాయించింది. ఇందులో పాఠశాల విద్యాశాఖకు రూ.31,805 కోట్లు; ఉన్నత విద్యాశాఖకు రూ.2,506 కోట్లు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే పిల్లలు ఎంత మంది ఉంటే అంతమందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామన్న హామీకి కట్టుబడి ఉండటంతో భారీ మొత్తం కేటాయించాల్సి వచ్చింది.
అమృత్ 2.0
పట్ణణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన అమృత్ 2.0 పథకానికి ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో రూ.751.72 కోట్లు కేటాయించింది. ఈ పథకం 2022లో ప్రారంభమైంది.
అమృత్ 2.0 పథకంలో 250 అసంపూర్తి పనులను రూ.7 వేల కోట్లతో హైబ్రిడ్ యాన్యూటీ మోడల్‌లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్‌లో చూపిన రూ.751.72 కోట్లను రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద కేటాయిస్తుంది. మిగతా మొత్తాలను గుత్తేదారులతో పెట్టుబడిగా పెట్టించి, వడ్డీతో సహా ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది. ఈ పనులను రెండేళ్లలో పూర్తి చేయించాలని భావిస్తోంది.
ఆరోగ్య రంగం
ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన, రోగుల సేవల మెరుగుకు కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యమిచ్చింది. మొత్తంగా ఈ రంగానికి ఇచ్చింది రూ.19,264 కోట్లు. అందులో పేదలకు ఆశాదీపమైన ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టుకు రూ.4 వేల కోట్లు, మందులకు రూ.600 కోట్లు కేటాయించింది. ఈ రంగానికి గత వైకాపా ప్రభుత్వం చివరి బడ్జెట్ (2023-24)లో రూ. 14,925 కోట్లు కేటాయించింది.
కిందటేడు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పీఎం-అభీమ్) అవసరాలకు రూ.129 కోట్లు కేటాయించారు. తాజా బడ్జెట్‌లో రూ.1,112 కోట్లు వాడుకునేందుకు వీలు కల్పించారు. ఈ మొత్తంతో ఆసుపత్రుల్లోని 26 ల్యాబ్‌లను ‘ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబరేటరీస్’ స్థాయిలో అప్‌గ్రేడ్ చేస్తారు. దీనివల్ల రోగ నిర్ధారణ పరీక్షలు పెరుగుతాయి.
జిల్లా, బోధన, ఇతర ఆసుపత్రుల్లో కలిపి 26 ‘క్రిటికల్ కేర్ బ్లాక్స్’ వస్తాయి. ప్రస్తుతం ఉన్న వాటినే కొత్త మార్గదర్శకాలు అనుసరించి ఉన్నతీకరిస్తారు.
పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో మరో 45 అర్బన్ ఆరోగ్య మందిరాలు రానున్నాయి. ఒక్కొక్క దానికి రూ.75 లక్షల వరకు వ్యయం చేస్తారు.
ముఖ్య కేటాయింపులు:
జాతీయ ఆరోగ్య మిషన్: రూ.2,599 కోట్లు
మందుల కొనుగోళ్లు: రూ.600 కోట్లు
104, 108 సర్వీసులు: రూ.316 కోట్లు
రాజధాని నిర్మాణం
అమరావతి నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో రూ.6,000 కోట్లు ప్రతిపాదించింది. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లించేందుకు రూ.292.87 కోట్లు, రాజధాని ప్రాంతంలో సామాజిక భద్రతానిధి కోసం రూ.103.82 కోట్లు కేటాయించింది. రాజధానిలో భూమిలేని పేదలకు పింఛన్ల చెల్లింపు, ఇతర సామాజిక అవసరాల కోసం ఈ నిధుల్ని వెచ్చిస్తారు.
అమరావతి నిర్మాణానికి ప్రపంచబ్యాంక్, ఏడీబీ కలసి రూ.15వేల కోట్లు రుణం మంజూరు చేశాయి. రూ.12వేల కోట్లు ఇచ్చేందుకు సీఆర్‌డీఏతో హడ్కో అంగీకారం కుదుర్చుకుంది. రాజధాని నిర్మాణానికి ఆ నిధుల్నే ఖర్చు పెట్టబోతున్నారు. ఇప్పుడు ప్రతిపాదించిన రూ.6వేల కోట్లు కూడా ఆ సంస్థల నుంచి వచ్చేవే.
2024-25 బడ్జెట్‌లో రాజధాని పనులకు రూ.3వేల కోట్లు ప్రతిపాదించగా, సవరించిన అంచనాల ప్రకారం అది రూ.5,700 కోట్లకు చేరింది.
రాజధానిలో సుమారు రూ.48వేల కోట్ల పనులకు సీఆర్‌డీఏ, ఏడీసీ ఇప్పటికే టెండర్లు పిలిచాయి. రాజధాని నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
పారిశ్రామికరంగం
2025-26 వార్షిక బడ్జెట్‌లో పరిశ్రమలకు కూడా ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ వయబిలిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని అమలు కోసం బడ్జెట్‌లో రూ.2,000 కోట్లను కేటాయించింది. ఈ మొత్తంలో పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనకు కూడా వాటా దక్కనుంది.
వ్యవసాయ రంగం
మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను రూ.48,341.14 కోట్లతో ప్రవేశపెట్టారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 15 శాతం వార్షిక వృద్ధికి కార్యాచరణ రూపొందించామని, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణకు ప్రాధాన్యమిస్తూ రూ.12,903.41 కోట్లు కేటాయించామని వివరించారు.
సూపర్ సిక్స్‌లో భాగంగా ‘అన్నదాతా సుఖీభవ- పీఎం కిసాన్ పథకం’ ద్వారా రైతులకు ఏటా రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందించడానికి ఈ ఏడాది రూ.9,400 కోట్లు కేటాయించినట్లు అచ్చెన్నాయుడు ప్రకటించారు.
సేద్యానికి 9 గంటల ఉచిత విద్యుత్‌తో పాటు ఆక్వా రైతులకు రాయితీ విద్యుత్ ఇవ్వడానికి రూ.12,773.25 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు.
అంశాల వారీగా కేటాయించిన నిధులు (రూ.కోట్లలో):
ఉపాధి హామీ పథకం కింద సాగు అనుబంధ కార్యక్రమాలకు- 6,026.87
9 గంటల ఉచిత విద్యుత్, ఆక్వా రైతులకు రాయితీ విద్యుత్- 12,773.25
అన్నదాతా సుఖీభవ- పీఎం కిసాన్- 9,400
ఉచిత పంటల బీమా- 1,023
ఉద్యాన శాఖ- 930
మార్కెటింగ్ శాఖకు- 315.32
ధరల స్థిరీకరణకు- 300
రుణాలపై వడ్డీ రాయితీ- 250
మత్య్సకారుల వేట నిషేధకాల భృతి- 245.936
రాయితీ విత్తనాల పంపిణీ- 240
సహకార శాఖ- 239.85
వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా డ్రోన్లు, ఇతర యంత్రాల పంపిణీ- 219.65
పామాయిల్ తోటల సాగు- 179
పట్టు పరిశ్రమ అభివృద్ధి- 96.22
పౌరసరఫరాల శాఖ
పౌరసరఫరాల శాఖకు కూటమి ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో రూ.3,807 కోట్లు కేటాయించింది. ఈ శాఖ కింద గత ప్రభుత్వం ఏడాదికి సగటున రూ.1,901 కోట్లు ఖర్చు చేయగా... కూటమి ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లోనే రూ.9,415 కోట్లు (సవరించిన అంచనాల ప్రకారం) వినియోగించింది.
రోడ్లు, భవనాల (ఆర్‌అండ్‌బీ) శాఖ
2025-26 బడ్జెట్‌లో ఆర్‌అండ్‌బీ శాఖలోని జిల్లా, రాష్ట్ర, గ్రామీణ రోడ్లు, వంతెనల నిర్మాణం, జాతీయ రహదారులు, ఎన్‌డీబీ ప్రాజెక్ట్ తదితరాలు అన్నింటికీ కలిపి రూ.4,129.76 కోట్లు కేటాయించారు. వైకాపా హయాంలో అయిదేళ్ల బడ్జెట్లలో ఆర్‌అండ్‌బీ రూ.19,429 కోట్లు నిధులు కేటాయించినట్లు చూపించగా ఖర్చు చేసింది రూ.9,015 కోట్లు మాత్రమే.
కూటమి ప్రభుత్వం వచ్చాక 2024-25లోనే రూ.3,399 కోట్లను రోడ్ల మరమ్మతులు, విస్తరణ, వంతెనల పనులకు వెచ్చించింది.
కొత్త బడ్జెట్‌లో రైల్వే క్రాసింగ్స్ వద్ద వంతెనల నిర్మాణానికి రూ.270 కోట్లు, జిల్లా రోడ్లకు రూ.50 కోట్లు, ప్రధాన జిల్లా రోడ్లకు రూ.205 కోట్లు, రాష్ట్ర రోడ్లకు రూ.225 కోట్లు, రిమోట్ ఇంటీరియర్ ఏరియా డెవలప్‌మెంట్ (రెయిడ్) కింద రోడ్ల పనులకు రూ.160.85 కోట్లు, కేంద్ర రహదారి మౌలికవసతుల నిధి కింద రూ.550 కోట్లు, సేతుబంధన్ పథకానికి రూ.40 కోట్లు కేటాయించారు.
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో 1,307 కి.మీ. అభివృద్ధి చేయనుండగా.. దీనికి సాధ్యాసాధ్యాల నివేదిక, డీపీఆర్ తయారీకి రూ.47.86 కోట్లు కేటాయించారు.
ప్రజా రవాణాశాఖ (ఆర్టీసీ)కి బడ్జెట్‌లో రూ.4,309 కోట్లు కేటాయించారు. రవాణాశాఖకు రూ.345.61 కోట్లు ఇవ్వనున్నారు.
జలవనరులశాఖ
2025-26 ఆర్థిక సంవత్సరంలో జలవనరులశాఖకు రూ.18,019 కోట్లు కేటాయించారు. ఇందులో చిన్ననీటి పారుదలకు రూ.877 కోట్లు కేటాయించింది. పోలవరం ప్రాజెక్టుకు అత్యధికంగా రూ.5,756 కోట్లు కేటాయించారు. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూ.3,243 కోట్లు ఖర్చు చేయనుంది. వెలిగొండ ప్రాజెక్టుకు రూ.309 కోట్లు కేటాయించింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ, మధ్య కోస్తా ప్రాంతాల్లో కీలకమైన ప్రాజెక్టులు, గోదావరి, కృష్ణా డెల్టా వ్యవస్థను, వరద గట్ల పటిష్ఠానికి కలిపి మొత్తం కేటాయింపుల్లో రూ.10,571.24 కోట్లు చూపారు. రాష్ట్రంలో మొత్తం 82 ప్రాజెక్టులకు పైగా నిర్మాణంలో ఉన్నాయి. పోలవరం సహా అన్ని ప్రాజెక్టులూ పూర్తిచేయాలంటే రూ.1,64,815 కోట్లు అవసరమని తేల్చారు.
వంశధార రెండోభాగం పూర్తిచేసేందుకు రూ.182.52 కోట్లు, వెలిగొండ ప్రాజెక్టుకు రూ.309 కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. తొలిదశ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేసి 1,19,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలనేది లక్ష్యం. కృష్ణా, గోదావరి డెల్టా వ్యవస్థలకు కలిపి రూ.600 కోట్లు కేటాయించారు. వరద గట్ల పటిష్ఠానికి రూ.250 కోట్లు ప్రతిపాదించారు.
ముఖ్యాంశాలు
ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణసాయంతో చేపట్టిన విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టు మొదటి, రెండో దశలో ప్రతిపాదించిన పనులకు సంబంధించి రాష్ట్ర వాటా కింద రూ.837.71 కోట్లను 2025-26 బడ్జెట్‌లో ప్రతిపాదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.259.59 కోట్లతో పోలిస్తే.. మూడున్నర రెట్ల నిధులను పెంచింది.
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న పోర్టులకు, ఆర్ ఆôడ్ ఆర్ పనులకు రూ.400.15 కోట్లు కేటాయించింది. మచిలీపట్నం పోర్టుకు రూ.150 కోట్లు, భావనపాడు భూముల పరిహారానికి రూ.100 కోట్లు, కాకినాడ ఎస్‌ఈజడ్ పోర్టుకు రూ.50 కోట్లు, రామాయపట్నంకు రూ.100 కోట్లు ప్రతిపాదించింది. 2024-25లో రూ.388.31 కోట్ల కంటే నిధులను పెంచింది.
కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు వీలుగా రూ.25 కోట్లు కేటాయించింది. గత ప్రభుత్వం 2023-24లో రూ.12.13 కోట్లు కేటాయించి శంకస్థాపనకే పరిమితమైంది.
భోగాపురం విమానాశ్రయానికి రూ.195 కోట్లు, ప్రాంతీయ విమానాశ్రయాలకు రూ.30 కోట్లు, విజయవాడ ఎయిర్‌పోర్టుకు రూ.29.99 కోట్లు కేటాయించడం ద్వారా విమానయాన రంగానికి ప్రాధాన్యం ఇచ్చింది. గత ప్రభుత్వం 2023-24లో రూ.70.10 కోట్లు మాత్రమే కేటాయించింది.
పీఎంఏవై పట్టణ (బీఎల్‌సీ) పథకానికి- రూ.4,642 కోట్లు (కేంద్రం వాటా రూ.2,639 కోట్లు, రాష్ట్రం వాటా రూ.2003 కోట్లు); పీఎంఏవై గ్రామీణ్- రూ.741 కోట్లు (కేంద్రం వాటా రూ.339 కోట్లు, రాష్ట్రం వాటా రూ.402 కోట్లు); పీఎం జన్‌మన్- రూ.225 కోట్లు (కేంద్రం వాటా రూ.135 కోట్లు, రాష్ట్రం వాటా రూ.90 కోట్లు).
క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందించడానికి కూటమి ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.65.15 కోట్లు కేటాయించింది. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి ఈ నిధులు వెచ్చించనుంది. దీంతో పాటుగా మౌలిక వసతుల కల్పనకు మరో రూ.49.85 కోట్లు కేటాయించింది. మొత్తంగా ఈ బడ్జెట్‌లో రూ.115 కోట్లు కేటాయించింది.
బడ్జెట్‌లో ప్రతిపాదించిన కొత్త కార్యక్రమాలు
రాష్ట్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో కొన్ని కొత్త పథకాలను, వినూత్న కార్యక్రమాలనూ ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించింది. దీంతో 46 వేల స్కూళ్లకు మేలు జరుగుతుంది.
తెలుగు భాష పరిరక్షణకు ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో రూ.10 కోట్లు కేటాయించింది. ఇలాంటి కేటాయింపు ఇదే తొలిసారి. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటం, తెలుగు భాష ప్రాముఖ్యతను గుర్తించి ప్రచారం చేసేందుకు నిధులు కేటాయించినట్లు ప్రభుత్వం పేర్కొంది.
పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టే అభివృద్ధి పనులకు ప్రభుత్వం 20 శాతం వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఇచ్చే కొత్త విధానాన్ని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. దీని కోసం రూ.2,000 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
మద్యపానం, మాదకద్రవ్యాల వ్యసనం నుంచి ప్రజలను, ముఖ్యంగా యువతను కాపాడేందుకు నవోదయం 2.0 పథకం కింద రూ.10 కోట్లు ప్రతిపాదించింది.
వ్యవసాయంలో డ్రోన్‌ల వినియోగానికి ప్రాధాన్యం. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రైతులకు కొత్తగా వెయ్యి డ్రోన్‌లు. పురుగుమందులు చల్లడం, ఇతర సస్యరక్షణ చర్యల్లో వినియోగం.
గుంటూరు, శ్రీసిటీ, కర్నూలు, పెనుకొండ, అచ్యుతాపురం, శ్రీకాకుళం, నెల్లూరుల్లో ఈఎస్‌ఐ ఆసుపత్రులు. తిరుపతి ఈఎస్‌ఐ ఆసుపత్రిని 50 నుంచి 100 పడకలకు పెంచేందుకు చర్యలు.
సైబర్ నేరాల ముప్పు పెరుగుతుండటంతో ప్రతి జిల్లాలో ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు చర్యలు.
పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం కింద మూలపేట, దొనకొండ, చిలమత్తూరు, కుప్పంలో నాలుగు కొత్త పారిశ్రామికవాడలు.
వెనుకబడినవర్గాల కోసం ఆదరణ పథకం పునరుద్ధరణ. రూ.వెయ్యి కోట్లు కేటాయింపు.
రియల్‌టైమ్ గవర్నమెంట్ సొసైటీకి రూ.101 కోట్లు కేటాయింపు.