Published on Dec 25, 2024
Current Affairs
5 రాష్ట్రాలకు నూతన గవర్నర్లు
5 రాష్ట్రాలకు నూతన గవర్నర్లు

కేంద్ర ప్రభుత్వం 2024, డిసెంబరు 24న మొత్తం 5 రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించింది. ముగ్గురిని ఒక రాష్ట్రం నుంచి మరోచోటకు బదిలీ చేయగా ఇద్దరిని కొత్తగా నియమించింది.
* మిజోరం గవర్నర్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కంభంపాటి హరిబాబును ఒడిశా గవర్నర్‌గా కేంద్రప్రభుత్వం నియమించింది. ఆయన స్థానంలో కేంద్ర మాజీమంత్రి జనరల్‌ వీకే సింగ్‌ మిజోరం గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. జనరల్‌ వీకే సింగ్‌ 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి కేంద్రమంత్రిగా పనిచేశారు. మరోవైపు ప్రస్తుతం ఒడిశా గవర్నర్‌గా ఉన్న రఘుబర్‌దాస్‌ రాజీనామా చేశారు. 
* కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్‌కుమార్‌ భల్లాను మణిపుర్‌ గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న అనసూయ ఉయికె పదవీకాలం 2024, జులై 30వ తేదీతో ముగియగా అప్పటి నుంచి ఆ బాధ్యతలను అస్సాం గవర్నర్‌ లక్ష్మణ్‌ప్రసాద్‌ ఆచార్య నిర్వర్తిస్తున్నారు. 
* మరోవైపు కేరళ గవర్నర్‌గా ఉన్న ఆరిఫ్‌ మహమ్మద్‌ఖాన్‌ను బిహార్‌కు, అక్కడ గవర్నర్‌గా ఉన్న రాజేంద్రవిశ్వనాథ్‌ ఆర్లేకర్‌ను కేరళకు కేంద్రప్రభుత్వం బదిలీ చేసింది.