ఏఐ (కృత్రిమమేధ) సాంకేతికత అభివృద్ధి, వినియోగంలో అంతర్జాతీయంగా భారత్ మూడోస్థానంలో ఉందని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ‘2025 గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్’ నివేదిక వెల్లడించింది. 2024 గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ ర్యాకింగ్ ఆధారంగా, తాజా జాబితాను స్టాన్‌ఫోర్డ్ విడుదల చేసింది. గత జాబితాతో పోలిస్తే భారత్ 4 స్థానాలు పైకొచ్చింది. ఏఐకి సంబంధించి ‘పరిశోధన -అభివృద్ధి, బాధ్యతాయుత ప్రవర్తన, ఆర్థిక వ్యవస్థ, నైపుణ్యాలు, విధాన నిర్ణయాల అమలు, ప్రజాభిప్రాయం, మౌలిక వసతులు’ వంటి అంశాల ఆధారంగా గతేడాది వ్యవధిలో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకుని, వివిధ దేశాలకు ర్యాంకులను స్టాన్‌ఫోర్డ్ ప్రకటించింది.
ఈ ప్రకారం.. ఏఐ పురోగతిలో అమెరికా (స్కోర్ 78.6), చైనా (36.95) తరవాత స్థానంలో మనదేశం ఉంది. ఈ సూచీలో మనదేశ స్కోర్ 21.59 కాగా, దక్షిణ కొరియా (17.24), యునైటెడ్ కింగ్‌డమ్ (16.64), సింగపూర్ (16.43), స్పెయిన్ (16.37), యూఏఈ (16.06), జపాన్ (16.04) మనకంటే దిగువనే ఉన్నాయి.