Published on Mar 28, 2025
Current Affairs
హురున్‌ - గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌
హురున్‌ - గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌

హురున్‌ సంస్థ కనీసం 1 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.8500 కోట్ల) సంపద ఉన్నవారితో ప్రపంచ కుబేరుల జాబితా (గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌)ను విడుదల చేసింది. 2025, జనవరి 15తో ముగిసిన ఏడాది కాలానికి ఈ జాబితాను రూపొందించింది. దీని ప్రకారం..

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ ప్రపంచంలోని అగ్రగామి 10 మంది కుబేరుల జాబితాలో స్థానం కోల్పోయారు. ఏడాది వ్యవధిలో ఆయన సంపద విలువ 13% తగ్గి రూ.8.6 లక్షల కోట్లకు పరిమితం కావడం ఇందుకు కారణం. అయితే ఆసియాలో అత్యంత సంపన్నుడిగా తన స్థానాన్ని ఆయన నిలబెట్టుకున్నారు. అదానీ గ్రూపు అధిపతి గౌతమ్‌ అదానీ రూ.8.4 లక్షల కోట్ల సంపదతో భారత్‌లో రెండో అగ్రగామి సంపన్నుడిగా ఉన్నారు.

284 మంది సంపన్నులకు భారత్‌ నిలయంగా ఉంది. వీరి మొత్తం సంపద విలువ 10% పెరిగి రూ.98 లక్షల కోట్లకు చేరింది. దేశ జీడీపీలో (దాదాపు రూ.350 లక్షల కోట్ల)లో ఈ విలువ దాదాపు మూడోవంతు. ఈ 284 మందిలో 175 మంది సంపద విలువ పెరగ్గా, 109 మంది సంపద తగ్గడం లేదా మార్పులేకుండా ఉంది. 

దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా హెచ్‌సీఎల్‌ టెక్‌ వ్యవస్థాపకులు శివ్‌నాడార్‌ కూతురు, సంస్థ ఛైర్‌పర్సన్‌ రోష్ని నాడార్‌ (రూ.3.5 లక్షల కోట్లు) నిలిచారు.