సివిల్ సర్వీస్ క్యాడర్ కేటాయింపు విధానాల్లో కేంద్రం సవరణలు చేసింది. అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఓఎస్ క్యాడర్ కేటాయింపులకోసం కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ ఇదివరకు ఉన్న జోనల్ విధానం స్థానంలో కొత్తగా గ్రూప్ విధానాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రాలను అక్షర క్రమంలో 4 గ్రూపులుగా విభజించింది. ఈ సర్వీసులకు ఎంపికైన అభ్యర్థులను ఇకమీదట ఈ గ్రూపులవారీగా క్యాడర్‌కు కేటాయిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించిన మీదట కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ కొత్త విధానాన్ని నోటిఫై చేసింది.
దీంతో 2017 నుంచి ఉన్న జోనల్ విధానం స్థానంలో కొత్త గ్రూపు విధానం అమల్లోకి రానుంది. క్యాడర్ కేటాయింపుల్లో నిష్పాక్షికమైన, పారదర్శకతను పాటించడంకోసం అన్ని రాష్ట్రాల క్యాడర్, జాయింట్ క్యాడర్లను విభజించినట్లు వెల్లడించింది. అభ్యర్థుల ప్రాధాన్యం, ర్యాంకు, కేటగిరీ, ఆయారాష్ట్రాల్లో ఉన్న ఖాళీల ఆధారంగా సాధారణంగా క్యాడర్ కేటాయింపును చేస్తారు. ఇదివరకు రాష్ట్రాలను ప్రాంతాలవారీగా జోన్‌లుగా విభజించగా, ఇప్పుడు ఆ విధానాన్ని పక్కనపెట్టి అక్షరక్రమంలో గ్రూపింగ్‌చేశారు.