భారత్, ఐరోపా కూటమి (ఈయూ) మధ్య చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదిరింది. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్‌గా పిలిచే ఈ ఒప్పందాన్ని 2026, జనవరి 27న దిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఈయూ నేతలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్, ఆంటోనియో కోస్టా సంయుక్తంగా ప్రకటించారు. దీంతోపాటు భద్రత, రక్షణ రంగంలో బంధం మరింత బలోపేతం, భారతీయ నిపుణులకు ఐరోపా దేశాల్లో అవకాశాలను కల్పించే ఒప్పందాలూ కుదిరాయి.
* భారత్, 27 ఐరోపా దేశాలు సంయుక్తంగా వచ్చే అయిదేళ్లలో ఈ ఒప్పందంపై అనుసరించాల్సిన వ్యూహాత్మక ఎజెండాను ఖరారు చేశాయి. ఎఫ్‌టీఏపై చర్చలతో ప్రారంభించి మొత్తం 13 ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం కారణంగా ఐరోపా కార్లు, మద్యం భారత్‌లో చౌకగా లభించనున్నాయి. భారతీయ రైతులు, చిన్న పరిశ్రమలవారి ఉత్పత్తులకు ఐరోపా మార్కెట్‌లో విస్తృత అవకాశాలు లభించనున్నాయి.