భూమి నుంచి 120 కాంతిసంవత్సరాల దూరంలో ఉన్న ‘కె2-18బి’ అనే గ్రహంపై జీవం ఉందని బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం పరిశోధకులు తాజాగా గుర్తించారు. సముద్ర జలాల్లోని కొన్ని సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే అణువుల జాడను దీనిపై కనుగొన్నట్లు వారు తెలిపారు. ఈ గ్రహం పుడమి కంటే 8.5 రెట్లు పెద్దది. ‘కె2-18’ అనే నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తుంటుంది. ఈ గ్రహంపై మీథేన్, కార్బన్ డయాక్సైడ్ వంటి కర్బణ అణువులను పరిశోధకులు గతంలోనే గుర్తించారు. ‘కె2-18బి’కి సంబంధించి నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోబ్ అందించిన డేటాను కేంబ్రిడ్జి పరిశోధకులు తాజాగా విశ్లేషించారు.