సూర్యుడిపై లోతైన పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన ఆదిత్య-ఎల్1.. సౌర గోళానికి సంబంధించిన అద్భుత చిత్రాలను అందించింది.
సూర్యుడి దిగువ పొరల్లో ఉత్పన్నమైన ఒక సౌర జ్వాలను క్లిక్‌మనిపించింది. సూర్యుడిలో సంభవించే విస్ఫోటక చర్యల గురించి ఇది లోతైన అంశాలను వెలుగులోకి తెచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు.
సౌర జ్వాలలనేవి భానుడిలో భారీ విస్ఫోటాలు. వీటి ద్వారా శక్తి, కాంతి, అత్యంత వేగవంతమైన రేణువులు రోదసిలోకి దూసుకొస్తాయి.
తద్వారా అంతరిక్ష వాతావరణంపై ప్రభావం చూపుతాయి. పుడమిపై రేడియో కమ్యూనికేషన్లు, కక్ష్యలో ఉపగ్రహ కార్యకలాపాలకు అవరోధం కలిగిస్తాయి. సౌర జ్వాలలు.. సూర్యుడిపై దేదీప్యమానంగా కనిపిస్తుంటాయి.