పిల్లల చదువుల కోసం జాతీయ సగటు కంటే ఆంధ్రప్రదేశ్‌లో తల్లిదండ్రులు అత్యధికంగా ఖర్చుచేస్తున్నట్లు ‘సమగ్ర మాడ్యులర్ సర్వే విద్య-2025’ నివేదిక వెల్లడించింది.
దక్షిణాదిలో తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక తర్వాత ఏపీలో పాఠశాల విద్యకు సగటున చేస్తున్న వ్యయం అధికంగా ఉన్నట్లు ఇది తెలిపింది.
పూర్వ ప్రాథమిక విద్య(ఎల్‌కేజీ) నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని స్థాయిల్లో కలిపి ఒక్కో విద్యార్థిపై రాష్ట్రంలో ఏటా రూ.18,479 ఖర్చు చేస్తుండగా.. ఇది జాతీయ స్థాయిలో రూ.12,616గా ఉంది.
ఇదే వ్యయం తమిళనాడులో రూ.21,526, తెలంగాణలో రూ.20,590, కర్ణాటకలో రూ.18,756 చొప్పున ఉంది.
కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ 2025 ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఈ సర్వేను దేశవ్యాప్తంగా నిర్వహించింది.
ఏపీలో గ్రామాలు, పట్టణాల్లో కలిపి 1,828 కుటుంబాలు, 6,516 మందిని సర్వే చేసి వివరాలు సేకరించింది.