దేశంలో లేదా రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉండాలన్నా, ప్రజలు సుఖ-శాంతులతో జీవించాలన్నా సమర్థవంతమైన పాలన అవసరం. దీని ద్వారానే పౌరులు మెరుగైన సేవలు పొందగలుగుతారు. ప్రజా వ్యవహారాల నిర్వహణలో నిర్ణయాలు తీసుకోవడం, అమలు చేయడం, పర్యవేక్షించడం లాంటివి పాలన సూచిస్తుంది. స్థిరమైన అభివృద్ధి, సామాజిక న్యాయం, పౌరుల సాధికారతకు ఇది అవసరం. ప్రభుత్వ జవాబుదారీతనం, సమర్థవంతమైన పరిపాలన గురించి ప్రజలకు తెలియజేసే లక్ష్యంతో ఏటా డిసెంబరు 25న మన దేశంలో సుపరిపాలన దినోత్సవాన్ని (Good Governance Day) నిర్వహిస్తారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతి సందర్భంగా దీన్ని జరుపుకుంటారు. ప్రభుత్వ బాధ్యతలు, విధుల, అభివృద్ధి ఆధారిత పాలన గురించి పౌరులను చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్న కాలంలో సమ్మిళిత వృద్ధి, ప్రభావవంతమైన పరిపాలనపై ఎక్కువగా దృష్టిసారించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014, డిసెంబరు 23న ఆయనకు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ప్రకటించింది. అలాగే ఆయన జన్మదినమైన డిసెంబరు 25న ఏటా ‘సుపరిపాలన దినోత్సవం’గా నిర్వహిస్తామని ప్రకటించింది. 2014 నుంచి ప్రతి సంవత్సరం దీన్ని జరుపుతున్నారు.