శాసనసభలు ఒకటికి రెండు సార్లు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవీ తీవ్ర జాప్యానికి గురికావడంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ అంశంలో గవర్నర్‌తో పాటు రాష్ట్రపతికీ గడువు విధించింది. గరిష్ఠంగా మూడు నెలల్లోగా ఆ బిల్లులను ఆమోదించడమో, తిప్పి పంపించడమో చేయాలని నిర్దేశించింది. బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపిస్తున్నట్లయితే అందుకు కారణాలనూ జత చేయాలని తెలిపింది. ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని నేరుగా ఆశ్రయించవచ్చని, గవర్నర్ల నిష్క్రియ న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది.