ప్రైవేట్ వ్యక్తుల యాజమాన్యంలోని ఆస్తులన్నీ సమాజ ఉమ్మడి వనరులు కాబోవని పేర్కొంటూ, ప్రైవేట్ ఆస్తులను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకొనే విషయంలో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ప్రజల ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు వాటిని ఏకపక్షంగా పంపిణీ చేయకూడదని స్పష్టం చేసింది. అయితే, కొన్నింటిలో మాత్రం మినహాయింపు ఉంటుందని 7 : 2 మెజారిటీతో వెలువడిన తీర్పులో పేర్కొంది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని 9 మంది జడ్జీలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు భిన్నాభిప్రాయంతో కూడిన తీర్పును 2024, నవంబరు 5న వెలువరించింది. రాజ్యాంగ అధికరణం 31(సి), 39(బి) నిబంధనల వివరణపై స్పష్టతనిచ్చారు. వనరులపై ప్రభుత్వాల నియంత్రణ, సమాజ ఉమ్మడి ప్రయోజనాలు, వ్యక్తుల హక్కులకు సంబంధించిన కీలక నిబంధనలు వీటిలో ఉన్నాయి.
ధర్మాసనంలో సభ్యులు:
సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఈ ధర్మాసనంలో జస్టిస్ హృషికేశ్‌రాయ్, జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ సుధాంశు ధూలియా, జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్ర, జస్టిస్ రాజేశ్ బిందల్, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్ సభ్యులుగా ఉన్నారు. జస్టిస్ బి.వి.నాగరత్న కొన్ని అంశాలపై పాక్షికంగా ఏకీభవిస్తూ, జస్టిస్ సుధాంశు ధూలియా మెజారిటీ అభిప్రాయంతో విభేదిస్తూ విడి విడిగా తీర్పులు రాశారు.