భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ (60) పదవీ విరమణ చేసినట్లు అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించింది. 2025 డిసెంబరు 27న ఆమె పదవీ విరమణ చేసినట్లు సంస్థ జనవరి 21న అధికారికంగా వెల్లడించింది. 27 సంవత్సరాలకు పైగా నాసా కోసం పనిచేసిన సునీత మూడు సార్లు అంతరిక్ష యాత్ర చేశారు. ఆమె తన సుదీర్ఘ వృత్తి జీవితంలో 608 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో బసచేసి అత్యధిక కాలం అంతరిక్షయానం చేసిన వ్యోమగాముల జాబితాలో చేరారు.
గుజరాత్‌లోని మెహసానా జిల్లాకు చెందిన దీపక్ పాండ్యా, స్లోవేనియాకు చెందిన ఉర్సులిన్ బోనీ పాండ్యాల కుమార్తె అయిన సునీత 1965 సెప్టెంబరు 19న అమెరికాలోని ఓహాయో రాష్ట్రంలో జన్మించారు.