ఆర్థిక, వాణిజ్య రంగాల్లో పరస్పరం సహకరించుకోవడంతో పాటు సత్వర అభివృద్ధి సాధన లక్ష్యంగా బ్రిక్స్ దేశాల మధ్య కీలకమైన అవగాహన కుదిరింది. స్థానిక కరెన్సీల్లోనే వ్యాపార, ద్రవ్య లావాదేవీలు నిర్వహించుకోవాలని, ఈ ప్రక్రియ సాఫీగా కొనసాగటానికి అవసరమైన యంత్రాంగాలను ఏర్పాటు చేసుకోవాలనే అంగీకారానికీ వచ్చాయి.
రష్యాలోని కజన్‌లో నిర్వహించిన బ్రిక్స్ సదస్సు ఈ మేరకు 2024, అక్టోబరు 23న ప్రకటనను వెలువరించింది. సమాన అవకాశాలు కల్పించేలా ‘బహువిధ అభివృద్ధి బ్యాంకు’(ఎండీబీ)ని సరికొత్త తరహాలో ఏర్పాటు చేసుకోవాలని అగ్రనేతలు నిర్ణయించినట్లు ఆ ప్రకటన తెలిపింది.
బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలతో ఏర్పాటైన బ్రిక్స్‌లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ సభ్యత్వాన్ని పొందాయి.