దేశంలో వస్తు ఉత్పత్తుల తయారీ, పంపిణీ, అమ్మకం కోసం విధించే పన్నును ఎక్సైజ్ సుంకం అంటారు. ఇది వస్తువుల తయారీదారులు భారత ప్రభుత్వానికి చెల్లించే పరోక్ష పన్ను. దేశంలో తయారైన వస్తువులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చాక విస్తృత శ్రేణి ఎక్సైజ్ పన్నులు విలీనమయ్యాయి. అయితే పొగాకు, పెట్రోలియం ఉత్పత్తులు లాంటి కొన్నింటిపై మాత్రమే ఇది కొనసాగుతోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ఈ పన్నుల నిర్వహణకు బాధ్యత వహిస్తుంది. సకాలంలో పన్ను చెల్లించాల్సిన ఆవశ్యకతను, దేశ ఆర్థిక వృద్ధిలో సీబీఐసీ పాత్రను తెలియజేసే లక్ష్యంతో ఏటా ఫిబ్రవరి 24న ‘సెంట్రల్ ఎక్సైజ్ డే’గా నిర్వహిస్తారు. పన్నుల దాఖలు ప్రాముఖ్యతతోపాటు సుంకాల ఎగవేత వల్ల జరిగే పరిణామాల గురించి ప్రజలను చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
దేశంలో ఉప్పు సహా ఇతర తయారీ వస్తువులపై ఎక్సైజ్ సుంకాలను ఏకీకృతం చేసే ఉద్దేశంతో నాటి బ్రిటిష్ ప్రభుత్వం 1944, ఫిబ్రవరి 24న సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సాల్ట్ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఎక్సైజ్ పన్నులకు సంబంధించి అప్పటి వరకు ఉన్న 11 చట్టాలను ఏకీకృతం చేసి దీన్ని అమలు చేశారు. 1966లో దీని పేరును సెంట్రల్ ఎక్సైజ్ చట్టం, 1944గా మార్చారు. దేశంలో సక్రమ పన్ను విధింపు, సేకరించడంలో ఈ చట్టం ఎంతగానో తోడ్పడింది. పరిశ్రమల లైసెన్సింగ్, వస్తువుల అధిక ఉత్పత్తి నియంత్రణకు, పరిశ్రమల్లో అవినీతిని అరికట్టడానికి ఇది ఉపయోగపడింది. అంతేకాక దీని అమలు వల్ల ప్రభుత్వానికి పన్ను రూపంలో అధిక ఆదాయం సమకూరుతోంది. ఈ చట్టం అమలుకు గుర్తుగా ఏటా ఫిబ్రవరి 24న ‘సెంట్రల్ ఎక్సైజ్ డే’గా నిర్వహిస్తున్నారు.