చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భారత ప్రధాని నరేంద్రమోదీ 2025, ఆగస్టు 31న తియాన్‌జిన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సరిహద్దు వివాదాలను పక్కనపెట్టేసి అన్ని రంగాల్లో కలిసి పనిచేయాలని రెండు పక్షాలు నిర్ణయించాయి. సరిహద్దు సమస్యలకు ‘సముచితమైన, సహేతుకమైన, పరస్పర అంగీకారయోగ్యమైన పరిష్కారం’ కనుగొనేందుకు కలిసి పనిచేయాలని నేతలిద్దరూ అవగాహనకు వచ్చారు. ఆర్థిక సంబంధాలు, పెట్టుబడుల్ని విస్తరించుకుంటూ ప్రపంచ వాణిజ్యాన్ని స్థిరపరిచేందుకు పాటుపడాలని నిర్ణయించుకున్నారు. ప్రధానంగా పెట్టుబడులు, వాణిజ్యం పెంపొందించుకోవడంపై ఇద్దరు నేతలూ దృష్టి సారించారు. ప్రజల మధ్య సంబంధాలు, నేరుగా విమాన సేవలు, వీసా సదుపాయాలు వంటివి చర్చకు వచ్చాయి.