Published on Apr 26, 2025
Current Affairs
వరల్డ్‌ మలేరియా డే
వరల్డ్‌ మలేరియా డే

వరల్డ్‌ మలేరియా డేని ప్రపంచవ్యాప్తంగా ఏటా ఏప్రిల్‌ 25న నిర్వహిస్తారు. మలేరియాను నిర్మూలించడం, దాని వ్యాప్తిని నివారించడంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ఇటాలియన్‌లో మలేరియా అంటే చెడుగాలి అని అర్థం. పూర్వం ఈ వ్యాధి చెడుగాలి వల్ల సంభవిస్తుందని భావించారు. అయితే ఇది ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల సోకుతుంది. ఆడ ఎనాఫిలిస్‌ దోమ దీనికి ప్రధాన ఆతిథేయి కాగా మానవుడు ద్వితీయ ఆతిథేయి.
చారిత్రక నేపథ్యం:
ఆఫ్రికన్‌ దేశాల్లో మలేరియా బెడద ఎక్కువ. ఈ వ్యాధిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించేందుకు 2001 నుంచి అక్కడి ప్రభుత్వాలు ఏప్రిల్‌ 25న ‘ఆఫ్రికా మలేరియా డే’ నిర్వహించేవి. ప్రపంచవ్యాప్తంగా మలేరియాను నియంత్రించాలనే ఉద్దేశంతో డబ్ల్యూహెచ్‌ఓ 2007, మేలో జరిగిన 60వ అసెంబ్లీలో ఏప్రిల్‌ 25న ప్రపంచవ్యాప్తంగా ‘వరల్డ్‌ మలేరియా డే’గా జరుపుకోవాలని తీర్మానించింది. 2008 నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.