Published on Jun 10, 2025
Current Affairs
వరల్డ్‌ అక్రిడిటేషన్‌ డే
వరల్డ్‌ అక్రిడిటేషన్‌ డే

వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థలో అక్రిడిటేషన్‌ పాత్రను గుర్తించే లక్ష్యంతో ఏటా జూన్‌ 9న ‘వరల్డ్‌ అక్రిడిటేషన్‌ డే’గా నిర్వహిస్తారు.

ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, విద్యా సంస్థలు, ప్రయోగశాలలు, ధృవీకరణ సంస్థలు మొదలైన వాటి సామర్థ్యం, విశ్వసనీయతను నిర్ధారించడాన్ని అక్రిడిటేషన్‌ అంటారు.

వినియోగదారులు, వ్యాపారాలు, నియంత్రణ సంస్థల్లో నమ్మకం, విశ్వాసాన్ని పెంపొందించడంలో అక్రిడిటేషన్‌ కీలకపాత్ర పోషిస్తుంది.

ఉత్పత్తులు, సేవలు, వ్యవస్థలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లు హామీ ఇవ్వడం ద్వారా ఇది జరుగుతుంది.

దీంతో అంతర్జాతీయ వ్యాపారం సులభం కావడంతోపాటు ప్రజారోగ్యం, భద్రతకు మద్దతుగా ఉంటుంది.

అక్రిడిటేషన్‌ విలువలు, ప్రయోజనాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

చారిత్రక నేపథ్యం:

అంతర్జాతీయ వ్యాపారాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా వస్తు, సేవల స్థాయిని నిర్ధారించే ఉద్దేశంతో ఇంటర్నేషనల్‌ ల్యాబొరేటరీ అక్రిడిటేషన్‌ కోఆపరేషన్‌ (ఐఎల్‌ఏసీ) మ్యూచువల్‌ రికగ్నిషన్‌ అరేంజ్‌మెంట్‌ (ఎంఆర్‌ఏ)ను తెచ్చింది.

దీన్ని 1994, జూన్‌ 9న సభ్యదేశాలు ఆమోదించాయి.

2007లో జరిగిన ఇంటర్నేషనల్‌ ల్యాబొరేటరీ అక్రిడిటేషన్‌ కోఆపరేషన్‌ (ఐఎల్‌ఏసీ), ఇంటర్నేషనల్‌ అక్రిడిటేషన్‌ ఫోరం (ఐఏఎఫ్‌) ఉమ్మడి సమావేశంలో ఏటా జూన్‌ 9న ‘వరల్డ్‌ అక్రిడిటేషన్‌ డే’గా నిర్వహించాలని తీర్మానించాయి.

2008 నుంచి ఏటా దీన్ని జరుపుతున్నారు.

2025 నినాదం: Accreditation: Empowering Small and Medium Enterprises (SMEs)