బంకర్లు, రక్షణశాఖ షెల్టర్ల నిర్మాణానికి అక్కరకొచ్చే మిశ్రమ పదార్థాలను వెదురు సాయంతో ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. సంప్రదాయ కలప, ఇనుము, లోహాలకు బదులుగా దీన్ని ఉపయోగించొచ్చు. దీన్ని భారత సైన్యం పరీక్షిస్తోంది. స్వీయ బరువుతో పోలిస్తే అందించే అత్యుత్తమ బలం కారణంగా ఏరోస్పేస్, పౌర, నౌకాదళ రంగాల్లో గ్లాస్ ఫైబర్, కార్బన్ ఫైబర్, శాండ్‌విచ్ కాంపోజిట్‌లను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే వీటి ఉత్పత్తి, పారవేతలో పర్యావరణ సవాళ్లు గణనీయంగానే ఉన్నాయి. చెట్ల నరికివేతపై ఆంక్షలు, హరిత ప్రత్యామ్నాయాలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా.. వెదురు ఆధారిత మిశ్రమ పదార్థాల రూపకల్పనపై గువాహటి ఐఐటీ శాస్త్రవేత్తలు కొంతకాలంగా పరిశోధనలు చేస్తున్నారు.