1947లో బ్రిటిష్ వారు భారత్‌కు స్వాతంత్య్రాన్ని ప్రకటించడంతోపాటు మన దేశం నుంచి పాకిస్థాన్‌ను విడగొట్టి స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచే రెండు దేశాల మధ్య వివిధ భౌగోళిక, రాజకీయ కారణాల వల్ల పరస్పరం ఘర్షణలు, యుద్ధాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. 1947లో జరిగిన మొదటి కశ్మీర్ యుద్ధం నుంచి 2025లో ఆపరేషన్ సిందూర్ వరకు అనేక ఘటనలు అందులో ఉన్నాయి. ఈ క్రమంలో మన దేశం ఎప్పటికప్పుడు తన వ్యూహాలకు పదునుపెడుతూ, సరికొత్త యుద్ధ రీతితో పాకిస్థాన్‌పై పైచేయి సాధిస్తూనే ఉంది. అయితే 1971లో జరిగిన యుద్ధం మన దేశ గెలుపును చాటడంతోపాటు బంగ్లాదేశ్ ఆవిర్భవాన్ని సూచిస్తుంది. ఈ పోరులో భారత్ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబరు 16న ‘విజయ్ దివస్’గా నిర్వహిస్తారు. దేశ రక్షణలో ప్రాణాలు వదిలిన సైనికులను స్మరించుకోవడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
స్వాతంత్య్రం కోసం ఉద్యమించిన తూర్పు పాకిస్థాన్ (బంగ్లాదేశ్)పై పశ్చిమ పాకిస్థాన్ చేపట్టిన క్రూర అణచివేత 1971లో భారత్-పాక్‌ల మధ్య మూడో యుద్ధానికి కారణమైంది. బెంగాలీ భాష మాట్లాడే తూర్పు పాకిస్థాన్ వాసులు పశ్చిమ పాకిస్థాన్ నుంచి స్వాతంత్య్రం కోరుతూ చేసిన ఉద్యమానికి భారత్ మద్దతు పలికింది. డిసెంబరు 3న భారత్ - పాకిస్థాన్ యుద్ధం ప్రారంభమైంది. డిసెంబరు 16న యుద్ధం ముగిసినట్లు ప్రకటన వెలువడింది.
యుద్ధానంతరం తూర్పు పాకిస్థాన్ పేరు బంగ్లాదేశ్‌గా మారింది. ఈ యుద్ధంలో భారత్ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబరు 16న ‘విజయ్ దివస్’గా నిర్వహిస్తారు.