అంతరిక్షంలో రెండు ఉపగ్రహాల డాకింగ్, అన్‌డాకింగ్ సాంకేతికతలను మదింపు చేయడానికి ఇస్రో ప్రయోగించిన స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ (స్పేడెక్స్) విజయవంతమైంది.
2025, జనవరి 16న ఛేజర్ (ఎస్‌డీఎక్స్-01) టార్గెట్ (ఎస్‌డీఎక్స్02)లను డాకింగ్ (అనుసంధానం) చేసిన ఇస్రో, 56 రోజుల తర్వాత వాటిని అన్‌డాకింగ్ (విడిపోవడం) చేయగలిగింది. 2024, డిసెంబరు 30న ఇస్రో స్పేడెక్స్ మిషన్‌ను చేపట్టింది.
భారత కాలమానం ప్రకారం 2025, మార్చి 13న ఉదయం 9:20 గంటలకు 460 కి.మీ. వృత్తాకార కక్ష్యలో 45 డిగ్రీల వంపులో అన్‌డాకింగ్ ప్రక్రియను ఒకే ప్రయత్నంలో ముగించినట్లు ఇస్రో తన ప్రకటనలో వెల్లడించింది.
ప్రస్తుతం రెండు ఉపగ్రహాలూ మెరుగ్గా పనిచేస్తున్నట్లు తెలిపింది. రానున్న చంద్రయాన్-4, గగన్‌యాన్ వంటి కీలక ప్రాజెక్టుల్లో ఈ సాంకేతికత ఉపయోగపడనుంది.