లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం పార్లమెంటు స్థానాలు 543 నుంచి 816కి చేరుతాయి. 4,123 ఉన్న అసెంబ్లీ స్థానాలు 6,185 అవుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 263కి, తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి చేరుతాయి. లోక్‌సభ స్థానాలు ఏపీలో 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి చేరే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని 2026, మార్చి 23న ఎన్డీయే సమావేశంలో భాగస్వామ్య పక్షాలకు కేంద్రం చెప్పింది.
నియోజకవర్గాల సంఖ్య పెంచడానికి వీలుగా ముందుగా మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తూ ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లులు తీసుకువస్తుంది. లోక్‌సభలో ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుచేసి వెంటనే సీట్ల పెంపు కార్యక్రమం పూర్తిచేసి 2029 ఎన్నికల్లో అమలు చేయనుంది. సీట్ల పెంపు దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరుగుతాయి.