తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2025-26 సంవత్సరానికి రూ.3,04,466.55 కోట్లతో 2025, మార్చి 19న రాష్ట్ర బడ్జెట్‌ను శాసన సభలో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తి 12 నెలల ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇదే. 2024, ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్, తర్వాత జులైలో మిగిలిన తొమ్మిది నెలలకు సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
2025-26 బడ్జెట్‌లో అత్యధికంగా 34.21% అంటే రూ1,04,329 కోట్లను సంక్షేమ పథకాలకే కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీ హామీల అమలుకు సంబంధించిన తొమ్మిది పథకాలకు ఏకంగా రూ.56,084 కోట్లు దక్కాయి.
తెలంగాణ బడ్జెట్ ముఖచిత్రం (రూ.కోట్లు)
మొత్తం బడ్జెట్: 3,04,466.55
మొత్తం వ్యయం: 3,04,965
రెవెన్యూ వ్యయం: 2,26,982.29
మూలధన వ్యయం: 36,504.45
ఆర్థిక ద్రవ్యలోటు: 54,009.74
రెవెన్యూ మిగులు: 2,738.33
రంగాలవారీ కేటాయింపులు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమం
♦ 2025-26 బడ్జెట్‌లో భారీగా నిధులు పెంచింది. సంక్షేమ శాఖలన్నింటికి కలిపి రూ.34,079 కోట్లు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధితో కలిపి సంక్షేమానికి రూ.72,396.43 కోట్లుగా పేర్కొంది.
♦ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే (2024-25) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు రూ.10,899 కోట్లను పెంచింది. ఎస్సీలకు స్వయం ఉపాధి కల్పించేందుకు సీఎం దళిత సాధికారత పథకానికి రూ.వెయ్యి కోట్లు, ఎస్టీ యువ పారిశ్రామికవేత్తల పథకానికి రూ.50 కోట్లు కేటాయించింది. ప్రత్యేక అభివృద్ధి నిధితో కలిపి ఎస్సీల సంక్షేమానికి రూ.40,231.61 కోట్లు, గిరిజన సంక్షేమానికి రూ.17,168.82 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.11,405 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.3,591 కోట్లు కేటాయించినట్లుగా ప్రభుత్వం పేర్కొంది.
మహిళా శిశు సంక్షేమ శాఖ
♦ మహిళా శిశు సంక్షేమానికి 2025-26 ఏడాదికి ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.2,862 కోట్లు కేటాయించింది. సమీకృత చిన్నారుల అభివృద్ధి(ఐసీడీఎస్) పథకానికి రూ.349.55 కోట్లు ఇచ్చింది. సఖి నివాసాలకు రూ.32.9 కోట్లుగా పేర్కొంది. దివ్యాంగుల ఉపకరణాలకు రూ.50 కోట్లు, వివాహాల ప్రోత్సాహకాల కోసం రూ.15 కోట్లు కేటాయించింది.
విద్యుత్ శాఖ
♦ 2025-26 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ రంగానికి రికార్డు స్థాయిలో రూ.21,221 కోట్లను బడ్జెట్‌లో సర్కారు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో ఇచ్చిన రూ.14 వేల కోట్లతో పోలిస్తే వచ్చే ఏడాదికి ఏకంగా 50 శాతం పెంచారు.
♦ వ్యవసాయానికి ఉచిత కరెంటు కింద రాష్ట్ర ప్రభుత్వం రాయితీ పద్దులో రూ.11 వేల కోట్లను ఇస్తున్నట్లు తెలిపింది.
♦ పేదల ఇళ్లకు నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకానికి రాయితీ కింద రూ.2,080 కోట్లు ఇచ్చారు.
సాగునీటి పారుదల రంగం
♦ 2025-26 బడ్జెట్‌లో సాగునీటి పారుదల రంగానికి మొత్తం రూ.23,373 కోట్లు కేటాయించారు. గతేడాది రూ.22,301 కోట్లు కేటాయించగా ఈ దఫా రూ.1,072 కోట్లు పెంచారు. ప్రాజెక్టుల నిర్మాణాలకు కావాల్సిన భూ సేకరణకు రూ.938 కోట్లు కేటాయించారు.
♦ చెరువులు, చెక్ డ్యాంలు, నీటి అభివృద్ధి సంస్థ పరిధిలోని చిన్న తరహా ఎత్తిపోతలకు కలిపి మైనర్ ఇరిగేషన్ కింద రూ.982 కోట్లు, వరద నియంత్రణ చర్యలకు రూ.280 కోట్లు, కేంద్రం విడుదల చేసే నిధులకు మ్యాచింగ్ గ్రాంట్ కింద జత చేసేందుకు రూ.105 కోట్లు కేటాయించారు.
పౌరసరఫరాల శాఖ
♦ రాష్ట్ర బడ్జెట్ 2025-26లో పౌరసరఫరాల శాఖకు రూ.5,734 కోట్లు కేటాయించారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు రూ.723 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్న ధాన్యం విక్రయించే రైతులకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ కోసం రూ.1,636.46 కోట్లు ఇవ్వనున్నారు. రాష్ట్రంలో దాదాపు 90 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం పంపిణీకి సిద్ధమవుతున్న సర్కారు ఈ సబ్సిడీకి రూ.1,879.05 కోట్లు కేటాయించింది.
పర్యాటక, సాంస్కృతిక శాఖ
♦ పర్యాటక, సాంస్కృతిక శాఖకు బడ్జెట్‌లో రూ.1,411 కోట్లు కేటాయించారు. ఇందులో అత్యధిక కేటాయింపులు పర్యాటక ప్రదేశాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రచారం కోసం ఉన్నాయి.
♦ పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.412 కోట్లు కేటాయించారు. తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్‌ను పెంచేందుకు, రాష్ట్రంలో పర్యాటకాన్ని పెంపొందించేందుకు వివిధ రూపాల్లో ప్రచారం చేసేందుకు తొలిసారి భారీగా రూ.300 కోట్లు బడ్జెట్లో పెట్టారు.
విద్యాశాఖ
♦ 2025-26 బడ్జెట్‌లో విద్యాశాఖకు రూ.23,108 కోట్లు కేటాయించగా.. గత బడ్జెట్ (రూ.21,292 కోట్ల)తో పోల్చితే ఇది రూ.1,816 కోట్లు అదనం. తాజాగా బడ్జెట్‌లో విద్యకు కేటాయించిన నిధుల వాటా 7.57 శాతం కాగా గత బడ్జెట్‌లో అది 7.31 శాతం.
♦ మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ (తెలంగాణ పబ్లిక్ స్కూల్) నెలకొల్పుతామని కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు 2024-25 బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించారు. ఈసారి కూడా అంతే మొత్తాన్ని ప్రతిపాదించారు.
చేనేత, జౌళిశాఖ
♦ రాష్ట్ర బడ్జెట్‌లో చేనేత, జౌళిశాఖకు గత బడ్జెట్‌లో కేటాయించిన రూ.371 కోట్లనే మళ్లీ కొత్తగా ప్రతిపాదించారు. చేనేత, జౌళి కార్మికులకు ఆర్థిక సాయం పథకం కింద రూ.237 కోట్లు, బీమా పథకం కింద రూ.15 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో గత ఏడాది కేటాయించిన రూ.371 కోట్లలో ఇప్పటివరకు రూ.177 కోట్లు మాత్రమే వెచ్చించారు.
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ
♦ 2025-26 బబ్జెట్‌లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు మొత్తంగా రూ.17,677 కోట్ల నిధులు కేటాయించారు.
♦ కొత్త పురపాలికల అభివృద్ధికి రూ.746.78 కోట్లు ఇచ్చారు.
♦ ఈ బడ్జెట్‌లో మున్సిపల్ ఎన్నికలకు ప్రత్యేకంగా రూ.85 కోట్లు నిధులు కేటాయించారు.
వ్యవసాయ రంగం
♦ 2025-26 బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.24,439 కోట్లు కేటాయించింది. ఇందులో ‘రైతుభరోసా’కు రూ.18 వేల కోట్లను ప్రతిపాదించింది. 2024-25లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు రూ.49,383 కోట్లు కాగా.. అందులో రూ.26 వేల కోట్లను రుణమాఫీకి కేటాయించారు. ఇంతవరకు 25.35 లక్షల మంది రైతులకు రూ.20,616.89 కోట్లు చెల్లించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
♦ రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకుగాను ఈ విభాగానికి రూ.2,149 కోట్లను ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించింది. ఇందులో రూ.258 కోట్లు ఆయిల్‌పామ్ సాగుకు నిర్దేశించింది. ఉద్యాన పంటల సాగులో బిందుసేద్యం కోసం సౌర విద్యుత్తును ఉపయోగించే రైతులకు రూ.14 కోట్ల ప్రోత్సాహక సబ్సిడీని ఇవ్వనుంది.
వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ
♦ 2025-26 బడ్జెట్‌లో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు రూ.12,393 కోట్లు కేటాయించగా.. గత ఏడాది సవరించిన అంచనాల కంటే ఇది రూ.925 కోట్లు అదనం. ఇందులో వివిధ పథకాల అమలు కోసం ప్రగతి పద్దు రూ.6,726 కోట్లు కాగా, నిర్వహణ కోసం రూ.5,667 కోట్లు కేటాయించారు.
♦ బోధనాసుపత్రులకు కొత్త భవనాలు, వసతి గృహాలు నిర్మించడంతోపాటు, అన్ని వసతులు కల్పించేందుకు వైద్య విద్య సంచాలక (డీఎంఈ) విభాగానికి ప్రత్యేకంగా రూ.3,010.92 కోట్లు కేటాయించారు.
♦ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి రూ.1,143 కోట్లు కేటాయించారు.
ముఖ్యాంశాలు:
♦ 2025-26 బడ్జెట్‌లో పరిశ్రమల శాఖకు రూ.3,527 కోట్లు, ఐటీ శాఖకు రూ.774 కోట్లను ప్రతిపాదించింది.
♦ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ఉద్దేశించిన రాజీవ్ యువ వికాసం పథకానికి ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో రూ.6 వేల కోట్ల భారీ కేటాయింపులు చేసింది.
♦ 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12,571 కోట్లను కేటాయించింది. 2024-25 బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.8,424.06 కోట్లను కేటాయించగా ఈసారి రూ.4,147 కోట్ల నిధులను పెంచింది. ఏటా నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలో గరిష్ఠంగా 4.50 లక్షల ఇళ్లను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున కేటాయిస్తోంది.
♦ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే రూ.100 కోట్లు పెరిగి రూ.3683 కోట్లకు చేరుకున్నాయి. ఎస్సీలకు రూ.600 కోట్లు, ఎస్టీలకు రూ.260 కోట్లు, బీసీలకు రూ.2173 కోట్లు, మైనార్టీలకు రూ.650 కోట్లు ఇచ్చింది.
♦ మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి గత బడ్జెట్ (2024-25)లో రూ.4,084.43 కోట్లు కేటాయిచగా, ఈ బడ్జెట్‌లో రూ.4,305 కోట్లు ఇచ్చారు.
♦ రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకంతో రాష్ట్రంలో 43 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ఇప్పటివరకు మహిళా లబ్ధిదారులకు రాయితీ కింద రూ.433.20 కోట్లు చెల్లించినట్లు ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొంది. గత, ప్రస్తుల బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.723 కోట్లు ఇచ్చారు.
♦ పేదలకు ఉచిత కరెంట్ కింద ప్రభుత్వం ప్రకటించిన గృహజ్యోతి పథకం ద్వారా రాష్ట్రంలో 50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. అర్హులైనవారికి విద్యుత్తు వాడకం నెలలో 200 యూనిట్లలోపు ఉంటే వారికి ఉచితంగా విద్యుత్తును అందిస్తోంది. గత బడ్జెట్‌లో దీనికి రూ.2,418 కోట్లు కేటాయించగా, ప్రస్తుతం రూ.2,080 కోట్లు ఇచ్చారు.
♦ ఆసరా పింఛన్ల కోసం ప్రభుత్వం రూ.14,861 కోట్లు కేటాయించింది.
♦ రాష్ట్రంలో గ్రామీణ మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ (మిషన్ భగీరథ)కు ప్రభుత్వం రూ.6 వేల కోట్లు కేటాయించింది. గతేడాది రూ.4,993 కోట్లు కేటాయించారు.
♦ ఉపాధిహామీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.2,922 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు.
♦ గ్రామీణ రోడ్ల నిర్మాణానికి రూ.1220 కోట్లు కేటాయించింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(హమ్)లో ప్రైవేటు భాగస్వామ్యంతో గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి రూ.200 కోట్లు కేటాయించింది.