తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క 2025, ఫిబ్రవరి 17న సచివాలయంలో ‘రాష్ట్ర గణాంకాల నివేదిక-2024’ను విడుదల చేశారు. రాష్ట్రంలో కోటిన్నర మంది వ్యవసాయంలోనే ఉపాధి పొందుతున్నారని నివేదికలో అర్థ, గణాంకశాఖ వెల్లడించింది.
2023-24లో రూ.40.44 లక్షల కోట్ల స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి(జీఎస్‌డీపీ)తో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలవగా, రూ.15.01 లక్షల కోట్లతో తెలంగాణ 7వ స్థానంలో ఉంది.
నివేదికలోని ముఖ్యాంశాలు:
తెలంగాణ జీఎస్‌డీపీలో రియల్ ఎస్టేట్, ఐటీ, వృత్తి సేవల రంగం వాటా 24.4 శాతం ఉండగా; వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, గనులు కలిపి 17.6%, వాణిజ్య, హోటళ్ల రంగం వాటా 19.9%, ఉత్పత్తి రంగం 8.9%, నిర్మాణ రంగం 5.2%, రవాణా, సమాచార రంగం 7%, ఆర్థిక సేవలు 4.8%, ఇతర రంగాలు మిగిలిన వాటా కలిగిఉన్నాయి.
జీఎస్‌డీపీలో రియల్ ఎస్టేట్, ఐటీ, వృత్తి సేవల రంగం 24.4 శాతంతో మొదటి ర్యాంకులో ఉన్నా; 51 శాతం మందికి ఉపాధి కల్పిస్తూ వ్యవసాయమే అగ్రస్థానంలో నిలిచింది. ఐటీ, వృత్తిసేవల రంగంలో 4% మంది, ఉత్పత్తిలో 12,వాణిజ్య, హోటళ్ల రంగంలో 10% మంది, మిగిలినవారు ఇతర రంగాల్లో ఉపాధి పొందుతున్నారు.
2023-24లో రాష్ట్ర ప్రజల తలసరి వార్షిక ఆదాయం(పీసీఐ)లో రూ.5.87 లక్షలతో సిక్కిం, రూ.4.61 లక్షలతో దిల్లీ, రూ.3.56 లక్షలతో తెలంగాణ వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. జాతీయస్థాయిలో పీసీఐ రూ.1.84 లక్షలుగా ఉంది.