ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేదలకు రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించే సరికొత్త ఆరోగ్య విధానం రూపకల్పనకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇందుకు సంబంధించి బీమా కంపెనీల నుంచి టెండర్లు ఆహ్వానించేందుకు వీలుగా వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి 2025, సెప్టెంబరు 4న ఆమోదం తెలిపింది.
ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన - ఎన్టీఆర్ వైద్య సేవ కింద హైబ్రిడ్ విధానంలో కొత్త ఆరోగ్య విధానం రూపొందిస్తారు.
రాష్ట్రంలోని 5 కోట్లమందికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
పేదలకు బీమా ద్వారా రూ.2.50 లక్షల వరకు, రూ.2.50 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఎన్టీఆర్ ఆరోగ్య సేవా ట్రస్టు ద్వారా వైద్య సేవలు అందిస్తారు.
దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న వారికి రూ.2.5 లక్షల వరకు వైద్య బీమా వర్తిస్తుంది.
వర్కింగ్ జర్నలిస్టులను కూడా ఈ పథకంలోకి తీసుకువస్తారు.