జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా రోప్‌వే పర్యాటకంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలో గోల్కొండ, వరంగల్ కోటల తర్వాత భువనగిరి కోటకు ప్రాధాన్యం ఉంది.
ఏకశిల రాతిగుట్టపై నిర్మించిన భువనగిరి కోటకు శతాబ్దాల చరిత్ర ఉంది. స్వదేశీదర్శన్ 2.0 పథకం కింద ఈ కోటను రూ.56.81 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసేందుకు పర్యాటక అభివృద్ధి సంస్థ తాజాగా టెండర్లు పిలిచింది.
భువనగిరి ఖిల్లా పక్కనే ఉన్న హైదరాబాద్-వరంగల్ 165వ జాతీయ రహదారి నుంచి కోట వద్దకు కిలోమీటరు దూరం వరకు రోప్‌వే ఏర్పాటుకానుంది. రాష్ట్రంలో తొలి రోప్‌వేగా ఇది గుర్తింపు పొందనుంది.
ట్రెక్కింగ్ ప్రాధాన్యమున్న ప్రాంతాల్లో ఒకటైన భువనగిరి కోటపైకి చేరడానికి దాదాపు గంట సమయం పడుతుంది. రోప్‌వే ప్రయాణం పర్యాటకులకు మంచి అనుభూతిని ఇస్తుంది.