భారత రక్షణ రంగం బలోపేతమే లక్ష్యంగా దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ప్రతిపాదనకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) 2026, ఫిబ్రవరి 12న ఆమోదముద్ర వేసింది. భారత వాయుసేనకు (ఐఏఎఫ్) మరో 114 శత్రుభీకర రఫేల్ యుద్ధవిమానాలు చేర్చే ప్రతిపాదన అందులో ఉంది. ఇందుకోసం ఫ్రాన్స్ సర్కారుతో కేంద్ర ప్రభుత్వం భారీస్థాయి ఒప్పందం కుదుర్చుకోనుంది. మొత్తం రూ.3.60 లక్షల కోట్ల విలువైన మిలిటరీ హార్డ్‌వేర్ కొనుగోళ్లకు డీఏసీ తాజాగా ఆమోదం తెలిపింది.
రఫేల్ యుద్ధవిమానాలతో పాటు.. వాయుసేన కోసం క్షిపణులు, ఎయిర్-షిప్ బేస్డ్ హై ఆల్టిట్యూట్ సూడో శాటిలైట్ (ఏఎస్-హెచ్‌ఏపీఎస్), నౌకాదళం కోసం ఆరు అమెరికా తయారీ బోయింగ్ పీ8-ఐ నిఘా విమానాలు, సైన్యం కోసం వైభవ్ యాంటీ ట్యాంక్ మైన్ల కొనుగోలు, టీ-72 ట్యాంకుల మరమ్మతుల లాంటి ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి.