బాలల సంక్షేమంపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉంటుంది. వారే రేపటి ప్రపంచ భవిష్యత్తు. చిన్నారుల సంరక్షణ విషయంలో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల నిధి (United Nations Children's Fund - UNICEF) సంస్థ ఎనలేని కృషి చేస్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని బాలల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఇది పని చేస్తోంది. అనేక వర్థమాన దేశాల్లో బాలల ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం అందించడం, రోగ నియంత్రణ లాంటి కార్యక్రమాలను చేపడుతోంది. దీని ఏర్పాటుకు గుర్తుగా ఏటా డిసెంబరు 11న ‘యునిసెఫ్ డే’గా (UNICEF Day) నిర్వహిస్తారు. పిల్లల జీవితాలకు సవాలుగా ఉన్న సమస్యల గురించి అవగాహన కల్పించడంతో పాటు వారికి సాయం చేయాల్సిన ఆవశ్యకత గురించి చాటిచెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
రెండో ప్రపంచయుద్ధం తర్వాత యూరప్‌లోని బాలలకు ఆహారం, మందులు, దుస్తులు లాంటి అత్యవసర సాయం అందించే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి (ఐరాస) జనరల్ అసెంబ్లీ 1946, డిసెంబరు 11న ‘ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి’ (యునిసెఫ్)ని ఏర్పాటు చేసింది.
1953లో ఇది ఐరాసకు శాశ్వత సంస్థగా మారింది. దీని స్థాపనకు గుర్తుగా ఏటా డిసెంబరు 11న ‘యూనిసెఫ్ డే’గా నిర్వహిస్తున్నారు.