యెనెస్కోకు చెందిన అంతర్జాతీయ విద్యా పర్యవేక్షణ బృందం (జీఈఎం) ప్రపంచవ్యాప్తంగా పాఠశాల విద్య, విద్యార్థులు చేరికపై ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. మహిళా విద్యపై నిషేదం, పేదరికం, మౌలిక సదుపాయాలు లేకపోవడం లాంటి కారణాలతో 2025లో ప్రపంచవ్యాప్తంగా 27.2 కోట్ల మంది పిల్లలు పాఠశాలల బయటే ఉండిపోవాల్సి వస్తోందని ఇది తెలిపింది.
ముఖ్యాంశాలు:
ప్రాథమిక పాఠశాల వయసు పిల్లల్లో 11 శాతం (7.8 కోట్లు), మాధ్యమిక పాఠశాల, కౌమర వయసు చిన్నారుల్లో 15 శాతం (6.4 కోట్లు) మంది, ఉన్నత పాఠశాల వయసు విద్యార్థుల్లో 31 శాతం (13 కోట్లు) మంది విద్యకు దూరమవుతున్నారు.
ఎస్‌డీజీ 4 స్కోరుకార్డు ప్రకారం, దేశాలు తమ లక్ష్యాలను చేరుకున్నట్లైతే 2030 నాటికి బడి బయట ఉన్న పిల్లల సంఖ్యను 16.5 కోట్లకు తగ్గించవచ్చు.
అయితే ఒక్క 2025లోనే ప్రాథమిక, ఉన్నత స్థాయి పాఠశాల వయసు గల 7.5 కోట్లమంది చిన్నారులు విద్యకు దూరం కానున్నారని నివేదిక అంచనా వేసింది.